Tuesday, November 3, 2009

“ కుప్పతోట్టిలో పసిపాప కంఠశోష ”

అమ్మామాయమ్మా ఓ అమ్మలగన్నయమ్మ 
ముగురమ్మలకే నీవు మూలమందురు గదయమ్మ కవులరాతలే నేతి బీరలు- ప్రేమ అనురాగం కుందేటి కొమ్ములు 

1. నీ నెత్తుటిలో నేను నెత్తురు ముద్దగ 
బొడ్డుపేగు ముడివేసి నను పసిగుడ్డుగ 
మోసావుగదమ్మా మురిపెంగ తొమ్మిది నెలలు 
కన్నవెంటనే బరువైనాన నను సాకగ ఇలలో 

 2. ఎంగిలాకులే పొత్తిళ్ళుగా 
లాలాజలమే నీ చనుబాలుగా
భావించి విసిరావా చెత్తకుండీలో 
వదిలించుకున్నావా నను పెంటబొందలో 

3. కుక్కలైనా పీక్కతినలేదు కాసింత జాలితో 
ఒక్కమనిషీ నను గనలేదు పిసరంత ప్రేమతో 
మానవజాతికే నేను మచ్చనైపోతి 
నా కన్నతల్లికే నేను శత్రువైపోతి 

 4. అనాథకున్న బాధెంతో నీవెరిగేవా 
అమ్మా అనుమాటకైన అర్థం తెలిసేనా 
కన్నవెంటనే నను చంపవైతివే 
కరుణ తోడనూ కాస్త పెంచనైతివే
మణిదీపం నీ రూపం
అపురూపం నీ స్నేహం
కలిపింది మనలను ఏదో మధుర స్వప్నం
’కల చే’దైపోవును ఎదురైతే నగ్నసత్యం
1. ఎప్పటికైనా నువ్వు నాకపరిచితం
అయిపో నేస్తమా ఊసులకే పరిమితం
వాస్తవాలు దుర్భరం కఠినాతికఠినం
జీర్ణించుకోలేము ఏనాటికి కటిక నిజం
2. పొరపడి చిరునామా తెలుపనే తెలుపకు
తారసపడి గుర్తించినా నన్ను పలకరించకు
నీ గుట్టును ఎన్నటికీ విప్పనే విప్పకు
వేసుకున్న మేలిముసుగు కాస్త జారనీకు
3. ఊహకు భిన్నమైతె భరియించలేముగా
ఆశలుఅడియాసలైతె సహియించలేముగా
దూరపు కొండలే నునుపన్న తీరుగా
సాగనీ మనస్నేహం సాగినంత కాలం