Monday, October 18, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నందనవని నీ మానసం -నిన్న ఎంత సుందరం

సుడిగాలి చెలరేగి-నేడు చిందరవందరం

వివిధ వర్ణ విరి శోభితం-నీమది ప్రశాంతమౌ వసంతం

భీభత్సపు వానలు ముంచగ-మోడుబారి ఇపుడో శిశిరం


1.పలుకులు తలపించె నాడు-మెలికలతొ పారే సెలయేళ్ళు 

నవ్వుల్ని రువ్వితె చాలు-ఎదలొ దుముకు జలపాతాలు

నీ మౌనమిపుడాయే గాంభీర్య గౌతమి

నీ హృదయమనిపించే అగాధాల జలధి


2.నీ కనులు కురిపించేను పగలైనా వెన్నెలలు

నీ చెలిమి అలరించేను తొలగించ వేదనలు

మూగవోయింది వీణ తీగలే తెగిపోయి

రాగాలు మరిచింది నలుగురిపై గురిపోయి

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:హుస్సేని


చూపించవయ్యా కైలాస మార్గము

నను చేర్చవయ్యా కైవల్య తీరము

మంచులాంటి మనసే నీది శంకరయ్యా

కురిపించు దయామృతం ఈశ్వరయ్యా


1.మూఢభక్తి నాది ముక్కంటి కనవయ్యా

గాఢానురక్తి నీపై  పెంచుకుంటి లింగయ్యా

నాగుపాము ఏనుగుపాటి  సేవచేతునయ్యా

ఆగలేను ఓపను నీ తావు తోవ నడ్తునయ్యా


2.చేసేను నిను కనగా గణపతి సోపతి

వాడేను దరిజేరగ సేనాపతి పరపతి

ఆదరించి బ్రోచునుమాయమ్మ పార్వతి

ఆలస్యమిక నీదే ఆనతీయ పశుపతి

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ     


ఆత్రమేమొ నేత్రాల్లో

ఆర్తి దంతవస్త్రాల్లో

ఆగలేను ఇక ఎంత మాత్రము

చేస్తున్నా చెలి ప్రేమ స్తోత్రము


1.చూపు పంపు ఆహ్వాన పత్రము

వలపు తెలుపు దివ్య సూత్రము

కైపు రేపు నీ కాంతి వక్త్రము

నునుపు గొలుపు నవనీత గాత్రము


2.మనసేమో దయాపాత్రము

సొగసే అపురూప చిత్రము

వయసిక శృంగార శాస్త్రము

మన కలయిక కడు విచిత్రము

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:నీలాంబరి


కోపముంటే కొట్టూ తిట్టూ

కినుక కలిగితె పీకను పట్టు

మాటలాడక చేయకు బెట్టు

నొప్పించను నిన్నిక ఒట్టు

చింతించనేల తీవ్రాతి తీవ్రంగా

మంత్రించనేల భవిత శూన్యంగా


1.అంతగా  బాధించానా

ఎదలొ కత్తులు దించానా

మత్తుమందుపెట్టి  మైకంలో ముంచానా

మాయమాటలే చెప్పి నిన్ను వంచించానా

చింతించనేల తీవ్రాతి తీవ్రంగా

దూషించనేల బ్రతుకు నాశంగా


2.నీ గాథనంతా జీర్ణించుకున్నాను

ఆవేదనంతా నే పంచుకున్నాను

కొనసాగలేమా శ్రేయోభిలాషులుగా

మన వ్యాపకాలే ఊపిరులవగా

చింతించనేల తీవ్రాతి తీవ్రంగా

శపియించనేల చితిని పేర్చంగా


FOR audio.. ping un whatsapp

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:ముల్తాన్


నీ గానమే రోజూ నా కవితౌతుంది

నీ మౌనమూ నాపాలిట పాటౌతుంది

నీ స్నేహం అపురూప వరమౌతుంది

నీ అలకతో నేస్తమా  కలవరమౌతుంది

ప్రాయశ్చిత్తమేలేదా పశ్చాత్తాపానికి

విషాదాంతమేనా నా జీవితానికి


1.గాయాన్ని చేయాలంటే గుండెనే కోయాలా

గుణపాఠం నేర్పాలంటే ప్రాణమే తీయాలా

నువ్వు మన్నించకుంటే మనుగడే నాకు శూన్యం

నువ్వు చేయిసాచకుంటే నా ఉనికి కడు దైన్యం

ప్రాయశ్చిత్తమేలేదా పశ్చాత్తాపానికి

విషాదాంతమేనా నా జీవితానికి


2.నీ మనసులొ ఏముందో ఎలా తొంగి చూడను

తప్పుకొనగ ఎప్పుడు చూడకు నేను నీనీడను

దాపరికమేలేదు నా మదిలొ ఎన్నడునూ

నమ్మినా నమ్మకున్నా నీ  చేదోడు వాదోడును

ప్రాయశ్చిత్తమేలేదా పశ్చాత్తాపానికి

విషాదాంతమేనా నా జీవితానికి

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


వర్షాకాలంలోనూ వన్నెల వసంతం విరిసింది

వానలు ముసిరినగానీ కన్నె కోయిల కూసింది

ఉల్లములో ఉప్పెనలా  ఉద్వేగాలే ఉసిగొలుప 

వలకాక వలపులతో వెల్లువలా పెల్లుబుక


1.ఒంటరి తానైతేమి ఈ తుంటరి లోకంలో

ఎందుకు మునిగుండాలీ పికము ఎప్పుడు శోకంలో

గున్నమావి కవిగామారి భావచివురులందిస్తుంది

ఎలుగెత్తీ  గానంచేయగ ఎంతో పరవశిస్తుంది


2.పాట ఒకటి ఉంటేచాలు ప్రాణానికి సాంత్వన

ఆకలీ దప్పులు తీర్చును గాత్రామృతాస్వాదన

పంచభూతాలే శ్రోతలు పంచమాస్యా సదస్సున

శషభిషలు మానేసీ చెలఁగాలీ స్నేహ జగాన