Thursday, November 24, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:భాగీశ్వరి


నీ అభయహస్తము  దీనుల ప్రియ నేస్తము

శ్రీ వేంకటేశ నీ మహిమలు కడు ప్రాశస్త్యము

తరించె నిను సేవించి లోకాస్సమస్తము

గోవింద నీనామ సంకీర్తన కలిగించు పారవశ్యము

గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవిందా


1.నీ దివ్య దర్శనము మహదానందము

నీ పాద తీర్థసేవనము అకాల మృత్యుహరణము

నీ శఠగోప శిరోధారణము అహంకార దమనము

నీ లడ్డూ ప్రసాద స్వీకారము ఆరోగ్యదాయనము

గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవిందా


2.పుష్కరిణీ పుణ్య స్నానము ఘోరపాపనాశనము

తిరుమలలో గడుపు ప్రతిక్షణము మోక్ష కారకము

నీ  సన్నిధి శయనము స్వప్నసాక్షాత్కార అనుభవం

ఆపదమొక్కులవాడవంది నీ సార్థకనామధేయము

గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవిందా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఊహ ఎంత మధురము

స్వప్నమే సంతోషకరము

అంతులేని స్వేచ్ఛాకాశానా

ఆనందంగా విహరించవశము

కల్పనా ప్రేయసితోను 

పదే పదే విరహించతరము

కలహించతరము కౌగిలించుకొనువరము


1.కీలు గుర్రమెక్కి ప్రియురాలితో

సప్త సాగరాలు లిప్త పాటులో దాటవచ్చు

చెలి మేను మాణిక్యవీణను

మంజుల నిక్వణ మొలుకగ మీటవచ్చు

ఆకలి దప్పుల ప్రసక్తే లేక 

ఏ ఇతరాసక్తీ లేక మనోహరితొ సల్లాప మాడవచ్చు


2.చేజారిన ప్రియసఖినీ చేరదీయవచ్చు

కోహినూరు వజ్రాన్నీ కానుక ఈయవచ్చు

భవ్యంగా రమ్యంగా నవ్యంగా జీవించవచ్చు

సవ్యంగా దివ్యంగా హృద్యంగా భావించవచ్చు

కాలమున్నంత కాలం  కాపురం చేయవచ్చు

కలలే చెదరనంత సమయం కలిసిఉండవచ్చు