Thursday, May 28, 2020

నరుడే హరుడని భావించాలి
మానవుడే మాధవుడని సేవించాలి
మానుష జన్మ దుర్లభమే సార్థకతను పొందాలి
తరిస్తూ తరింపగజేస్తూ బ్రతుకు చరితార్థం కావాలి

1.కామం దరిరాదు ఉన్నంతలొ తృప్తిపడితె
కోపానికి తావులేదు క్షణకాలం యోచిస్తే
లోభం నిరర్థకం దేహమూ వదిలేదనితోస్తే
ఎప్పుడూగెలుపునీదే లోపలి శత్రువులను హరిస్తే

2.మోహం మించదు వైరాగ్యం బోధపడితె
మదమే హెచ్చదు విశ్వరచననే గ్రహించితే
మత్సరం కుత్సితం ప్రయోజనరహితమే
తప్పటడుగువేయవు కాలం విలువ నెరిగితే

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

విశ్వసించగలగాలి వందశాతము
వశమైతీరుతాడు నిశ్చయంగ దైవము
నవవిధముల భక్తిమార్గాలతో
శ్రద్ధాసక్తులనే కర్మసూత్రాలతో

1. పురాణాలు వినవలే పరీక్షిత్తువలే
కీర్తించాలి సదా నారద మహర్షి లా
స్మరించాలి సర్వదా ప్రహ్లాదుడి మాదిరి
పాదసేవచేయాలి సౌమిత్రి రీతి
తపించాలి మనసా వాచా కర్మణా
అన్యధా శరణం నాస్తియనే సమర్పణ

2.అర్చనసేయాలి పృథు చక్రవర్తి భంగి
వందనమొనరించాలి అక్రూరుడి చందమున
దాస్యం చేయాలి మారుతి తీరుగా
సఖ్యత పొందాలి పార్థుని పగిదిగా
తరించాలి బలివోలె ఆత్మనేనివేదించి
ముంచినా తేల్చినా నీవేనని ప్రార్థించి
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

అనురాగమే పాడదా పాటగా
మానసవీణను పాటవంగ మీటగా
స్నేహామృతం లభించదా ఊటగా
నీతోడు నీకుతోడు  నేనన్నదే మాటగా
మనిషిమనిషి మధ్య బంధమే అభినందనీయము
ప్రేమిస్తూ ప్రేమపొందగలగడమే అభిలషణీయము

1.ఉడతసాయమైనా చాలు ఉద్దేశ్యమే ముఖ్యం
చిన్నిచిన్ని గులకరాళ్ళే తీర్చలేదా కాకిదాహం
ఓపికా శక్తి మేరకైనా చేయూత నీయలేమా
ఒక్కొక్క నీటిబొట్టే కలిసీ సంద్రంగ మారడంలేదా
మనిషిమనిషి మధ్య బంధమే అభినందనీయము
ప్రేమిస్తూ ప్రేమపొందగలగడమే అభిలషణీయము

2.విడగొట్టుకుంటూ పోతే విలువ శూన్యమే
ఎవరికెవరేమౌతారంటే బ్రతుకులన్నీ దైన్యమే
గడ్డిపోచలన్నీ కలవగ గజమునైన బంధించవా
చీమలన్ని దండుగ కుడితే పామునైన చంపవా
మనిషిమనిషి మధ్య బంధమే అభినందనీయము
ప్రేమిస్తూ ప్రేమపొందగలగడమే అభిలషణీయము