Monday, July 12, 2021

 గుండె గుండెలో మువ్వన్నెల జెండా

ప్రతి భారతీయుని కలలే పండ

జాతీయతే పిడికిళ్ళు నిండా

జాతి  జాగృతికే అండదండ

జయహో స్వతంత్ర భారతమా

జయజయహో స్వేఛ్ఛా సంకేతమా


1..జైళ్ళలో మగ్గారెందరొ జీవితాంతం

లాఠీ దెబ్బలు తిన్నారు ఉద్యమసాంతం

తూటాలకు ఎద ఎదురొడ్డారు ఏ మాత్రం వెరవక

అహింసతోనే సాధించారు సంపూర్ణసాధికారత

జయహో స్వతంత్ర భారతమా

జయజయహో స్వేఛ్ఛా సంకేతమా



2.బానిస సంకెళ్ళనే త్రెంచివేసి

భావదారిద్ర్యమే త్రుంచివేసి

సమైక్య గీతం ముక్తకంఠంతొ ఆలపించారు

పంద్రా అగస్ట్ స్వతంత్ర కేతన మెగురవేసారు

జయహో స్వతంత్ర భారతమా

జయజయహో స్వేఛ్ఛా సంకేతమా




 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


గుర్తింపుకోసం ఎంత ఎంత వెంపర్లాట

కీర్తి కోసమెందుకె మనసా ఇంతగా తండ్లాట

గోరంత ప్రతిభ ఉన్నా కొండంత అపేక్షట

ఇసుమంత కృషిచేస్తేనే ఇలన వెలిగి పోవాలంట

సహజమైన పాటవమును తూచలేదు ఏ కొలమానం

అత్మసంతృప్తిని మించి విలువైంది కాదే బహుమానం


1.ఎవరి మెప్పుకోసము ఎలుగెత్తేను పికము

ఏ పురస్కారముకై పురివిప్పును మయూరము

ఇంద్రధనుసు ఎందుకని అందాలు చిందుతుంది

మేఘమాల దేనికని మెరుపులని చిమ్ముతుంది

సహజమైన పాటవమును తూచలేదు ఏ కొలమానం

అత్మసంతృప్తిని మించి విలువైంది కాదే బహుమానం


2.కొలనులో విరిసిన కమలం ఏమికోరుకుంటుంది

వెన్నెల వెదజల్లే జాబిలి ఏ సత్కారమడుగుతుంది

హాయిగొలుపు పిల్లతెమ్మెర సమ్మానించమంటుందా

తపన తీర్చు వర్షపుజల్లు బిరుదులే ఇమ్మంటుందా

సహజమైన పాటవమును తూచలేదు ఏ కొలమానం

అత్మసంతృప్తిని మించి విలువైంది కాదే బహుమానం

 ఉత్తర దిక్పతి సకల సంపత్పతి

అలకాపురపతి సిరి వరదా ధీమతి

కుబేరా ప్రభో యక్షపతి నీకిదె నా ప్రణతి

తరగని ఐశ్వర్యమొసగ నీవే శరణాగతి


1.విశ్రవసు దేవవర్ణి ప్రియపుత్రా

భరద్వాజ ఋషిపుంగవ సుపౌత్రా

చార్వీ పతీ  స్వామీ పింగళ నేత్రా

త్రిపాద అష్టదంష్ట్ర లఘు గాత్రా

కుబేరా ప్రభో యక్షపతి నీకిదె నా ప్రణతి

తరగని ఐశ్వర్యమొసగ నీవే శరణాగతి


2.మహాదేవ ప్రియసఖా పూర్వ గుణనిధిరూపకా

శ్రీ వేంకటేశ కళ్యాణ వినిమయ ఋణదాయకా

గదాయుధ ధరావీరా నర వాహన సంచాలకా

జంబాల నామాంతరా నర లోక నిజ పాలకా

కుబేరా ప్రభో యక్షపతి నీకిదె నా ప్రణతి

తరగని ఐశ్వర్యమొసగ నీవే శరణాగతి



 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


పంజరాన్ని వీడిరావే నా పావురమా

బంధనాలు త్రెంచుకోవే ఓ ప్రియతమా

దిగంతాలు దాటివెళదాం 

దివ్యమైన లోకం ఉంది

యుగాంతాల అంతుచూద్దాం

భవ్యమైన జీవితముంది


1.సాలెగూడులోన చిక్కే చక్కనైన నీ బ్రతుకే

విధే వక్రించి ముక్కే  బంగారు నీ భవితే

అంతుపట్టలేకుంది నీ అంతరంగం

కట్టువీడ తలపడుతోంది యౌవనతురంగం

చేయందుకోవే ఓ చంచలాక్షి

నీ జతను కోరుతోంది నా ప్రాణపక్షి


2.ఊబిలోన దిగబడిపోయాం బయటపడలేము

సాగరాన ఈదుతున్నాం చేరలేము ఏతీరం

మనసంటు ఉందిగాని మార్గమే లేదాయే

తీపి తీపి జ్ఞాపకాలే వేపాకు చేదాయే

సాంత్వనే అందజేద్దాం పరస్పరం

ఊరటే చెందగలము అనవరతం




పల్లెటూరి చిన్నదాన

పట్నం చదువుకు వచ్చినదాన

రెక్కలె రాని పక్షిలాగా

దారం తెగిన పతంగిలాగా

ఎందుకే ఎందుకే అంత తొందర 

తప్పటడుగు వేసావో భవితే చిందరవందర


1.రంగురంగుల హంగులే పట్టిలాగుతాయి

ఫ్యాషన్ పేరిట వికృతాలు చుట్టుముడతాయి

కొత్తకొత్త వ్యసనాలన్నీ నిన్నే కోరి వరిస్తాయి

వింత వింత స్నేహాలన్నీ ఆప్తంగా కనిపిస్తాయి

ఎందుకే ఎందుకే అంత తొందర 

తప్పటడుగు వేసావో భవితే చిందరవందర


2.పార్టీల్లో చేరకపోతే నిన్ను గేలి చేస్తారు

పబ్బులకు వెళ్ళకపోతే జాలిగా చూస్తారు

డేటింగ్ అన్నది చేయకపోతే అప్డేవలేదంటారు

మాదక ద్రవ్యాలకే బానిసగా మారుస్తారు

ఎందుకే ఎందుకే అంత తొందర 

తప్పటడుగు వేసావో భవితే చిందరవందర