Wednesday, October 13, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


పారాయణి నారాయణి దాక్షాయణి

పరమార్థ దాయని నవ దుర్గా కాత్యాయని

త్రిశక్తి రూపిణి త్రిభువన పాలిని  కపాలిని

శివాని భవాని శాకిని సనాతని మాలిని

త్రిగుణాతీతా  పరదేవతా జగన్మాతా 

నమామి సతతం సకలలోక పూజిత శ్రీ లలిత


1.మాతవే గీతవే నా భవితకు నిర్మాతవే

పునీతవే అనంతవే  అపర్ణవే అపరాజితవే

నగజాతవే సుజాతవే ఆనంద సంజాతవే

పైడినెలతవే మంగళదేవతవే తమ్మింటిగరితవే


1.కాలికవే కరాళికవే అంబికవే కాళికాంబికవే

అమ్మికవే నాలోని నమ్మికవే ననుగాచే చండికవే

చండాలికవే సర్వార్థసాధికవే నా మనస్తోకవే

మాతృకవే పురుహూతికవే బృహద్భట్టారికవే


(దుర్గాష్టమి శుభాకాంక్షలతో)

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఏది నాగరికత ఏది ఆధునికత

ఏదీ మన జాతీయ సాంస్కృతికత

ఉనికినే కోల్పోతున్న మన ఘనమైన చరిత

పునరుజ్జీవింపజేయాలి భారతీయ సభ్యత


1.కత్తిరించి విరబోసిన చింపిరి జుట్టు 

అదే సంస్కార హీనతకు ఆటపట్టు

చిరుగుల చింపుల రంగెలిసిన జీన్స్ ప్యాంటు

బిచ్చగాళ్ళకన్న దీనమైన దుస్తులే ఫ్యాషనంటు


2.ధరించినదేదైనా ఈ నాటి ముదిరకు

విశృంఖల ప్రదర్శనే లక్ష్యమాయె చివరకు

వెన్ను నడుము నాభి వక్షస్థలము కొరకు

చూసినంతనే మగాడు రెచ్చిపోవు వరకు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఎవరైనా ఎపుడైనా తాకారా మీ ఎదను

ఏదైనా  ఘటనొకటి తట్టిందా  మీగుండెను

అప్రయత్నంగానే నయనాలు సజలాలై

పొడిబారిన హృదయంలో ఊట ఒకటి మొదలై

నిదురించిన నీలో మనిషి  మేలుకొన్న అనుభూతి

అడుగు పొరల మరుగున అదిగో మానవత్వ ఆచూకి


1.కాసింత సమయమైనా వెచ్చించగలిగి నప్పుడు

పిసరంత సాయమైనా పరులకు నువు చేసినప్పుడు

ఎదుటివారి కన్నుల్లో కనిపించే సంతృప్తి చిహ్నం

కృతజ్ఞతా భావనతో గొంతు మూగవోయిన వైనం

నిదురించిన నీలో మనిషి  మేలుకొన్న అనుభూతి

అడుగు పొరల మరుగున అదిగో మానవత్వ ఆచూకి


2.గోరంత నీ త్యాగం ఆర్తులకు  కొండగా  పరిణామం

పట్టెడంత పెట్టిన అన్నం తరతరాలకది ఆశీర్వచనం

ఆస్తులను పంచకున్నా దాతృత్వగుణమే సుకృతం

సహానుభూతి చెందితె చాలు ఎదుటి మనసు కదియే ఊతం

నిదురించిన నీలో మనిషి  మేలుకొన్న అనుభూతి

అడుగు పొరల మరుగున అదిగో మానవత్వ ఆచూకి