Sunday, November 3, 2019

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:హంసనాదం

(కార్తీక సోమవారపు గీతార్చన)

అణువణువూ నిను వర్ణించితిని
ఆపాద మస్తకం కీర్తించితిని
ఇహపర దైవం నీవని ఎంచితి
ఈశ్వరా నాలోనిను దర్శించితి
ఉమాపతే నన్నుద్ధరించరా
ఊహాతీతము నీ తత్వమురా

1.ఋతంబరా ఋషి ముని సేవిత
కౄరకర్మలన్ని నాలొ పరిహరించరా
నా క్ఌఏశములను నాశమొందించరా
ఎటులనేమెప్పింతును ఏకామ్రేశ్వరా
ఐహికాముష్మికాభీష్టదాయకా హరా
ఒకపరి నే ఓలలాడ నామనవిని ఔననరా
అంతఃకరణనాక్రమించరా చంద్రశేఖరా

2.నీ గుణ గణముల నే ప్రణుతించితి
నీ మహిమలు పలువిధముల పొగడితి
నీ ఉత్సవాల పరమార్థం నే ప్రవచించితి
నీ క్షేత్రాల ప్రాశస్త్యం ప్రస్తుతించితి
కైలాస వైభవం వక్కాణించితి
నీకుటుంబ సభ్యుల  నుతియించితి
నేనెరిగిన సారమంత కవితగా పాడితి

ప్రాధాన్యతలే వేరాయే
తెప్పను కాల్చిన తీరాయే
దిక్కేలేకా ఏదైనా ఒకరాయే
నిన్నటి నేస్తం నేడు పరాయే
సంద్రపునీటిని తాగినమేఘం
వర్షం కురియక ఎంతటి ద్రోహం

1.రచ్చను గెలిచే పిచ్చి క్రమంలో
ఇంటికి చిచ్చును రగిలించడమా
ఆటను నెగ్గే ఆరాటంలో
ప్రత్యర్థులనే పరిమార్చడమా
నీడను ఇచ్చే వటవృక్షం
ఊడలనురిగా మార్చుటె లక్ష్యం

2.గుంతల చింతల చింతన లేక
ఒంటెద్దు పోకడ బండికి హితవా
మేసే ఊసే  ఒకటే ధ్యాస
గుడ్డెద్దు చేలుకు చేటే అవదా
కమ్మే చీకటె  అయోమయం
ఎరుగదు మూసుకపోయిన నయనం
రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:మాల్కోస్

ఎదలో ఏదో అలజడి
నీ తలపుల్లో నే చిక్కుబడి
చేసావేదో చేతబడి
చేష్టలుడిగా నీ పాలబడి
బ్రతుకిక నీకే కట్టుబడి
మనుగడ నీకిక లోబడి

1.కవ్విస్తుంటే తడబడి
ఆరిందేనా గొంతు తడి
చేయకు ఇంకే గారడి
భవితే నాకిక గడిబిడి
బ్రతుకిక నీకే కట్టుబడి
మనుగడ నీకిక లోబడి

2.కడితిని మదిలో నీకుగుడి
వేసా మనసుతొ మనసు ముడి
చిక్కితి చిక్కుల చిక్కుబడి
వేడిని తాళక నిను వేడి
బ్రతుకిక నీకే కట్టుబడి
మనుగడ నీకిక లోబడి