Wednesday, March 3, 2021

 *నా  సాహిత్యాభిమాన పాఠక బంధుమిత్రులకు కృతజ్ఞతాభి వందనములు..!!*


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఋణం తీరిపోదు ధన్యవాదాలతో  

మొక్కుచెల్లిపోదు కృతజ్ఞతా ప్రకటనతో

ఎన్నాళ్ళ అభిమానమో మన సాహితీ గంధం

ఎన్నేళ్ళ సావాసమో మన కవన బాంధవ్యం

మనసా వచసా శిరసా మీకు అభివందనాలు

నిన్నా నేడూ రేపూ మీకు మైత్రీ   చందనాలు


1.అడుగు అడుగులో మీ శుభాకాంక్షలు

అలుపు అలుపులో మీ స్ఫూర్తీ ప్రేరణలు

మలుపు మలుపులో తెలిపే మీ ప్రశంసలు

గెలుపు గెలుపులో మీ శుభాభినందనలు

ఇంతకన్న ఏంకావాలి ప్రోత్సాహకాలు

ఇవేకదా ఉత్సాహానికి ఉత్ప్రేరకాలు


2.పెద్ద మనసు గలవారు మీరు పాఠక శ్రేష్టులు

విశాల రసహృదయులు నా పాటల ఇష్టులు

నాకు పరిపూర్ణత కూర్చగ మీరే నా స్రష్టలు

నా ఉన్నతి సంకల్పించే నిజమైన ద్రష్టలు

ఇదేకదా జీవితానికి అసలైన పరమార్థం

మీ ఆదరాభిమానంతో నా జన్మ చరితార్థం

 రచన.స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఆ కళ్ళు వేస్తాయి కదలనీక సంకెళ్ళు

ఆ కళ్ళు రేపుతాయి చూపులకే ఆకళ్ళు

ఆ కళ్ళే అందానికి ఆనవాళ్ళు

ఆ కళ్ళే అనురాగపు లోగిళ్ళు


వదన సరసు మీనాలై ఒప్పారును ఆ కళ్ళు

ఆనన కాననాన విహ్వలించు పసి లేళ్ళు


1.ఆ కళ్ళు అంగాలలో అనుంగు వ్యంజనాలు

ఆ కళ్ళు ముఖపుస్తక  సమీక్షకే నీరాజనాలు

ఆ కళ్ళు మది గది వీక్షింపజేయు దీపికలు

ఆ కళ్ళు భావ పుష్ప సౌగంధికా వీచికలు


మోము కొలను కలువలై అలరారు ఆ కళ్ళు

లలనకు లాల నూరించెడి అల్లనేరేడు పళ్ళు


2.ఆ కళ్ళు ఒలికించు అలవోకగ నవరసాలు

ఆ కళ్ళు అచ్చతెనుగు ఇచ్చకాల సమాసాలు

ఆ కళ్ళు కురిపించును నచ్చక కడు వడగళ్ళు

ఆ కళ్ళు అతివల అలకలందు పారే సెలయేళ్ళు


కాటుక పుట్టుకకే కారణాలు ఆ సోగ కళ్ళు

సైగల భాషలో వెలయించే కైతల పుట్టిళ్ళు