Saturday, January 11, 2020

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

చతురానన అతులిత సృజన
శ్రీనాథ కవిసార్వభౌమ కల్పన
గంధర్వ  లోక అపూర్వ స్వప్న గీతిక
రవివర్మ లేఖనీ అనూహ్య దివ్య చిత్రిక
నీ సావాసమే చెలీ అపురూప అనుభవం
నీ సహచర్యమే సఖీ అద్వైత సంభవం

1.నిను వర్ణించలేక నా కలమే తడబడింది
ఉపమానమె కరువై ఉన్మత్త అయ్యింది
పదములు కొరవడి నిఘంటువే తలొంచెలే
గత సారస్వతమే నిను గని విభ్రమించెలే
నీ సావాసమే చెలీ అపురూప అనుభవం
నీ సహచర్యమే సఖీ అద్వైత సంభవం

2.మేలి ముసుగు జారనీకు భూభ్రమణ మాగునేమొ
క్రీగంట చూడబోకు జాగరణే మునులకూ
చిరునవ్వూ రువ్వకూ చిత్తాలే చిత్తవునూ
మేని విరుపు మెరుపుల్లో ఊపిరులిక ఏమవునూ
నీ సావాసమే చెలీ అపురూప అనుభవం
నీ సహచర్యమే సఖీ అద్వైత సంభవం