Tuesday, June 9, 2020



నువ్వా చిన్నదానివి( ?! )ఎన్నో వన్నె లున్నదానివి
వగలే పోతున్నదానివి
మాయచేసి మంత్రమేసి మదిదోచుకున్నదానివి
నీ గుండెలోతుల్లో దాచుకున్నదానివి

నువ్వా చిన్నోడివి (!! )మంచి మనసు ఉన్నోడివి
లౌక్యమే లేనోడివి
పాలేవో నీళ్ళేవో అసలేమాత్రం ఎరగనోడివి
నోట్లో వేలెడితే కొఱకనోడివి

1.1.ఏడ నేర్చుకున్నావే ఇంతటి నెరజాణతనం
చూడబోతే విస్తుబోయె నంగనాచి వైనం
1.2.విప్పిచెప్పినా గాని వినుకోని విశ్శెన్నవు
తెరిచి ఉంచినా నేరుగ చొరబడనేరవు
పాలేవో నీళ్ళేవో అసలేమాత్రం ఎరగనోడివి
నోట్లో వేలెడితే కొఱకనోడివి

2.1కన్నుగీటి సైగచేసి నన్నుకాస్త పిలిచేవు
పంటినొక్కు లెన్నొనొక్కి నీ బాంచను చేసేవు
2.2.మెచ్చిందా మగువ నిను చచ్చేదాక వదలదు
అలకొచ్చిందా మగడా కాళ్ళబేరమైతెగాని కుదరదు
మాయచేసి మంత్రమేసి మదిదోచుకున్నదానివి
నీ గుండెలోతుల్లో దాచుకున్నదానివి
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:కామవర్ధిని(పంతువరాళి)

అర్థంకాదు అందరికీ నాలోని భావన
వ్యక్తమే చేయలేను నీపై ఆరాధన
నా మౌనభాషకే భాష్యం రాసే నేర్పరినీవు
నీ చిలిపి ఊహకే పదములు అల్లే కూర్పరి నేను
కలలు కల్పనలే కమ్మని కవనాలు
కరుగుతున్న ఈ క్షణాలు ఆనందనందనాలు

1.నేను నిజం నా కవిత నిజం
స్ఫూర్తినీవే అన్నమాట ముమ్మాటికీ నిజం
నీవో భ్రమగా ఒక మధురిమగా
మరులను రేపుతున్నదే పచ్చినిజం
కమలం భ్రమరం సంపర్కం
మిథ్యయన్నదే గుప్పిటగప్పిన నిజం
సృజనకు మూలం సుదతియన్నదే
అనాదిగా ఎల్లరు ఎరిగిన పరమనిజం

2.పరిమితి లేదు అనుమితి కృతిగా
నీ అందచందాలు నీమేని గంధాలు
ఎల్లలు లేవు పరిగణ చేయగా
నీతో ఊసులుబాసలు విరహాలు విహారాలు
ఇంతకన్న గొప్పగా ఎంతగానొ చెప్పినా
పోలికకందదు నీ సౌందర్యం
ఎన్నిసార్లు గ్రోలినా అనుభూతెంత పొందినా
చేదనిపించదు నీ మాధుర్యం
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

మీనాల నయనాలు వేసేను గాలాలు ఎంతో చిత్రంగా
చూపుల విరితూపులు చేసేను గాయాలు ఎదకే ఆత్రంగా
కనుబొమల కనుమల్లొ భానూదయాలు
సమసేను ప్రేమల్లో అనుమాన తిమిరాలు
ముంగురులే పాడేను  ప్రణయ గీతాలు
దరహాస చంద్రికలే పూసే నవనీతాలు

1.కవనాలు మౌనంగ రాసే ప్రేమలేఖలు
 కపోలాలు సిగ్గుతొ చేసేను నృత్యాలు
కనుపాపలొ నా రూపును బంధించినావు
కలలోను నను కలువగ తపియించినావు
కడకొంగుకే నన్ను ముడివేసుకున్నావు
కడదాకా నడిచేందుకె చేయందుకున్నావు

2.ఎన్నెన్ని తిరిగానో గుళ్ళూగోపురాలు
అనురాగ దేవతకై మది మందిరాలు
నీయంత నీవే ఎదురొచ్చి మెచ్చావు
గురిఎంతో కుదిరి నీ  మనసిచ్చినావు
నినువీడి మనలేను ఏడేడు జన్మాలు
చావైన బ్రతుకైన తోడుంటే అదిచాలు

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:భీంపలాస్

అమ్మా నిన్నే నమ్ముకుంటే
వమ్ముకాదు ఆశయెన్నడు
అమ్మా నీ పంచన జేరితె
చెమ్మరాదు కంటికెప్పుడు
ముల్లోకాలకె కన్నతల్లివి
దయగల్ల తల్లివి కల్పవల్లివి

1.ఆకలి సంగతి  నీవెరుగనిదా అన్నపూర్ణాదేవి
అన్నమో రామచంద్రా అంటూ అలమటించగానేమి
ప్రపంచానికే ధాన్యాగారమై భారతావని విలసిల్లనీ
ఆకలి కేకల శోకాలు లోకాన కనుమరుగవనీ

2.విద్యలేని మనిషేలేని వసుధగా సంస్కరించు
నలందా తక్షశిలల విద్యను పునరుద్ధరించు
బ్రతుకనేర్చు బుద్ధినీ మాలో జాగృత పరచు
పరమార్థ సాధనకై మమ్ముల సన్నద్ధపరచు

3.నలత కాస్త కలతగా పరిణమించనీయకమ్మ
వాస్తవ భాగ్యమైన ఆరోగ్యము నీయవమ్మ
వికృత వింత వ్యాధుల ధర దరి రానీయకమ్మ
నీవెరుగని సత్యమేది నీకసాధ్యమేదమ్మా
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:చక్రవాకం

శ్రీదేవీ నమోస్తుతే శివాత్మికా
శ్రీచక్ర విలసిత శ్రీ లలితాంబికా
శ్రీవిద్యాన్వితా సురమునిపూజితా
శ్రీపీఠ సంశోభిత శ్రితజన సేవితా

1.పరమ దయాళూ పరాంబికా
సరగున బ్రోవవే వరదా వేదమాతా
పరిపరి విధముల నిను నుతియించెదా
పరసౌఖ్యమీయవే పరా పరవిద్యా

2.నీమాయావశమే చరాచరజగము
నీ కనుసైగలతో కదులును మా పదము
తల్లివి నీవనీ తలపున నమ్మితీ
తక్షణమే దయజూపి నీ అక్కునజేర్చవే