Thursday, October 29, 2009

కళ్ళుమూస్తె ఏముంది కనరాని చీకటి
తరచిచూడు నేస్తమా ఉంటుంది కలల సందడి

మౌనమే పాటిస్తే తెలిసేది ఏమిటి
నినదించు మిత్రమా నీ గుండె సవ్వడి

మార్చాలి ఇకనైనా నీ దృష్టి కోణాన్ని
ఏమార్చాలినీవు నిరాశా దృక్పథాన్ని

చావూ పుట్టుకలు నీ చేతిలో లేవు
విజయాలు కాకతాళీయాలు కావు

స్వేదమనే వేదాన్ని నీలో ఒలికించవోయి
శ్రమయేవ జయతే సూక్తి ప్రగతికే కలికితురాయి

మానవతా వాదపు మర్మమెరుగవేల రాఖీ?
సచ్చిదానందమే సార్థక్యము నీ జన్మకి
నేను రహదారిని-కడదాక తోడుండీ చేర్చేను నీ గమ్యాన్ని
నేను మార్గదర్శిని-సులభంగ సాగేలా చేస్తాను పయనాన్ని

నేను కర్మ యోగినీ చూపించనెవ్వరికీ తరతమ భేదాన్ని
నేను కరుగు కాలాన్నీ తిరిగి ఇవ్వనెప్పటికీ చేజారిన క్షణాన్ని

నేనో కవి కలాన్నీ -రచియిస్తా సమానవతా వేదాన్ని
నేను మధుర గళాన్నీ-ఒలికిస్తా సుమకరంద నాదాన్ని

నేను మహా వృక్షాన్నీ- ఛాయకాయపత్రంఫలం అందిస్తా అన్నీ
నేనో సజీవ ఝరిని-తీరుస్తా దాహార్తుల దాహాన్ని

నేను సమున్నత లక్ష్యాన్ని-చేకూరుస్తా ననుజేరగ విజయాన్ని
నేను జన్మరహిత మోక్షాన్ని-రాఖీ నీకే లంపటమంటనీయని సత్యాన్ని
పొద్దు పొడిచె పొద్దు గ్రుంకె- ముద్దరాలి సద్దు లేదె
సుద్దులెన్నొ దాచి ఉంచా-నిద్దురనే కాచి వేచా
రాదేలా నాచెలి గారాల నెచ్చెలి
రాధేలా చేరరాగ తానే నా కౌగిలి
1. నడినెత్తికి సూరీడు-వడివడిగా చేరేడు
ఎవరిపైనొ అలిగాడు-నిప్పులే చెరిగాడు
శీతలపానీయమైన-తీర్చకుంది నా దాహము
మలయమారుతమ్మున్నా-తాళకుంది నా దేహము
రాదేలా నాచెలి గారాల నెచ్చెలి
రాధేలా చేరరాగ తానే నా కౌగిలి
2. సంధ్యకూడ సడిసేయక-రేయిబావ ఒడి చేరగ
నింగిలోన చుక్కలన్ని-చందమామ సొంతమవగ
వెన్నెలైన తీర్చకుంది-నా విరహ తాపము
మల్లికూడమాన్పకుంది-నా హృదయ గాయము
రాదేలా నాచెలి గారాల నెచ్చెలి
రాధేలా చేరరాగ తానే నా కౌగిలి
3. పగలు పోయి రేయి పోయి- రోజులెన్నొ మారిపోయి
వారాలు మాసాలు-ఋతువు లెన్నొ గడిచి పోయి
బ్రతుకు లోని ప్రతి హాయి-చెలియ తానైపోయి
ఎదకు తూపులు తగిలాయి-ఎదురు చూపులు మిగిలాయి
రాదేలా నాచెలి గారాల నెచ్చెలి
రాధేలా చేరరాగ తానే నా కౌగిలి