Wednesday, March 23, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నిద్రపట్టదు నీ నగుమోమును గనక

రెప్పవాలదు నినుగాంచలేదు గనక

బ్రతకమంటావా,చంపుకుంటావా

నీ మనసునడుగు ఒకసారి

ఓపలేకున్నా నీకై వేచిచూచి వేసారి

శుభరాత్రికానపుడు శుభోదయంకాదెపుడు


1.స్ఫూర్తిగలుగ జేస్తుంది

ఆర్తి తీర్చివేస్తుంది

అందాలకే అందం నీ వదనారవిందం

మత్తులో ముంచేస్తుంది

హాయిలో తేలుస్తుంది

అమృతభాండం నీ ముఖబింబం

చూపిస్తె సొమ్మేంపోదు కనిపిస్తె ఖర్చేంకాదు

శుభరాత్రిగ మార్చేయి శుభోదయం కానీయి


2.కలలు కనవచ్చు నినుచూసి

కల్పనే చేయొచ్చు కనుల దాచి

కవితలెన్నొ రాయవచ్చు నాకు వెరసి

మరుల జోరు నాపవచ్చు

మనసు పోరుమాన్పవచ్చు

తెల్లారిపోయేదాకా ప్రశాంతంగ ఉండవచ్చు

శుభరాత్రిక చెప్పవే శుభోదయం తప్పదే

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


మాట తప్పడం మామూలేగా నీకు

దాట వేయడం అలవాటేగా నీకు

చేసిన బాసలు చెప్పిన ఊసులు నీటిమూటలేనా

వేసిన ఒట్లు మాటల కనికట్లు గాలివాటమేనా

చెప్పిందేమిటి నువు చేసేదేమిటి

ఇస్తానన్నది చెలీ మరుస్తావేమిటి


1.బొట్టు కాటుక పెట్టుకొని

తల్లో పువ్వులు తురుముకొని

సిరిసిల్ల నేతచీరనే సింగారించుకొని

కరినారం వెండి పట్టీలే పాదాలకు పెట్టుకొని

వస్తానంటివే మహలక్ష్మివి నీవై

ఎదురొస్తానంటివే గృహలక్ష్మివి నీవై


2.సిగ్గును బుగ్గన దిద్దుకొని

నగవులు పెదవుల అద్దుకొని

కళ్యాణి రాగాన ఆలాపన జతివై

మంజుల స్వానాల స్వానుభూతివై

ఇస్తానంటివే  కొత్త జీవితాన్ని

వినిపిస్తానంటివే మన ప్రేమగీతాన్ని

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కోరుకో చెలీ  ఏ కానుకైనా

ఇచ్చేస్తా అది నా హృదయమైనా

వదులుకుంటా నా ప్రాణమైనా

వదులుకోలేను నిను క్షణమైనా

ప్రేమా ప్రణయం జీవన సర్వం నువ్వే

నేడూ రేపూ జీవిత కాలం నువ్వే నువ్వే


1.పొద్దుపొడిచేది నీతోనే

పొద్దుగ్రుంకేది నీతోనే

పొద్దుపొద్దంతా నాకు నీ సుద్దులతోనే

ఆకలిని నే మరిచానే

నిద్దురను మానేసానే

నీ తలపులలోనే మునకలువేసానే

అచ్చట ముచ్చట నచ్చుట అన్నీ నీతోనే

పచ్చని వెచ్చని మెచ్చిన ఊహలు నీతోనే


2.ప్రతి భావన పంచుకొని

అనుభూతిగ మలచుకొని

ఆనంద నందనాన నీతో విహరిస్తానే

పదములలో పొదువుకుని

పాటలుగా అల్లుకొని

పాడుకుంటూ కడదాకా బ్రతికేస్తానే

ఇష్టము కష్టము స్పష్టముగా నాకు నువ్వే

అదృష్టము సంక్లిష్టమూ నాకు నువ్వే నువ్వే


ఇందు అందు ఎందు వెదకినా దొరకని నా 'ఇందు' అందమేమందు

చిందర వందర గందరగోళపు నా మదికి ఇందు అందమే మందు

వందలాది వత్సరాలు తపముజేసినా పొందలేని వరము నా ఇందు

అందము ఆనందము కలబోసిన అతిలోక సుందరాంగి నా ఇందు


1.ఇందు చెంత ఉంటే ఎంతటి అడవైనా నందనవనమే

ఇందు తోడుగా ఉంటే ఎడారి సైతం అపర బృందావనమే

ఇంద్రపదవి ఇచ్చినా వదులుకుంటా ఇందు నా చేయినందుకుంటే

ఇందు వదన  మందగమన నా ఇందు కనువిందు నా ముందుంటే


2.ఇందు అరవింద పాదానికి అందెగా తగిలిస్తా నా డెందము

ఇందు అరవింద నయనాలను అలరించగ నేనౌతా అంగారము

మందార మకరంద మధురిమ లొలుకును సదా నా ఇందు అధరాలు

మందస్మితాన చంద్రికలే చిలుకును ఆహ్లాద భరితమై  ఇందు హసితాలు



 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఒక్కసారి కనిపిస్తావా

మనసు గుట్టు చెప్పేస్తావా

యుగాలుగా వీడనిబంధం

ఎరుక తిరిగి కలిగిస్తావా

పెదవులిపుడు విప్పేస్తావా

ప్రేమను ఇక ప్రకటిస్తావా

కొట్టుమిట్టాడే నా ప్రాణం

పోకుండగ చూస్తావా


1.చినుకుగ నను తడిపేస్తావా

మారాకులు తొడిగిస్తావా

ఈ మోడునికనైనా 

చిగురింపజేస్తావా

సంతసాన్ని సొంతం చేసి

సాంత్వననే కలుగగజేసి

ఆకు కొసన జారకుండా

నాలో విలీనమౌతావా


2.మరునిమిషం మాయమౌ

హరివిల్లువు నువుకావొద్దు

అందుబాటులో ఉండే 

అవనివైతె ఎంతో ముద్దూ

చేరువగా తపనలు పెంచే

మరీచికవుగా మారవద్దు

గుక్కెడైన నీరందించే 

చెలమెలాంటి చెలిమిని నాకిద్దూ