Monday, October 28, 2019

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

గుండెరగిలిపోతేనేం -కంటనీరు పొరలింది
గొంతుమూగ వోతేనేం-చూపు మనసు విప్పింది
బాధలకేదారమే అవనీతలమంతా
వేదనే సాధనైతే ఆనందమే వెతలచెంతా

1.సుఖదుఃఖాలు రెండు నాణేనికి భిన్నముఖాలు
ఓటమీ గెలుపులలో ద్వయరూప బాష్పాలు
జీవనమరణాలకు తేడా ఒక వెంట్రుకవాసి
ఎదభారం తీరేదైతే యత్నించు వలపోసి

2.ఏకష్టం ఎంతగొప్పదో కొలమానముందా
ఏనొప్పి తీవ్రత ఎంతో అవగతమౌతుందా
భరించేతత్వం వల్లనె విలువ మారిపోతుంది
చావుకన్న మిక్కిలి లేదు దీపమారిపోతుంది
రచన.స్వరకల్పన&రాఖీ

ప్రణయ భావం ఒకరిది
వినయ ధ్యానం ఒకరిది
అనురాగ మైకం రాధికది
ఆరాధనా లోకం మీరాది

1.రాధ శోధన బృందావనమున
మీరా దర్శించె తనమనములోన
లోబరుచుకుంది రాధ మాధవుని
లీమయ్యింది మీరా కృష్ణునిగని
ప్రేమ నిత్యం ఒకరికి -భక్తి తత్వం ఒకరికీ

2.రాధ అందించె అధరసుధల
మీరా గ్రోలింది విషమునవలీల
తనువు గానమై మురళిగ ఆ రాధ
గుండె గాయమై మువ్వగ ఈమీర
పెదవుల రాధ-పదముల మీరా

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

ధర్మపురి సంస్థిత ధర్మానువర్తీ సమవర్తీ
యమధర్మరాజా దక్షిణదిక్పాలక చక్రవర్తీ
పాపప్రక్షాళనానురక్తీ ప్రసాదించు జీవన్ముక్తి
యమునా సహజా శని అశ్వినీ దేవతాగ్రజా
నీకిదే నా సాదర ప్రణతి ఈయవె శరణాగతి

1.ధర్మాధర్మ విచక్షణా న్యాయమూర్తి
కర్తవ్యపాలనలో అగణిత గుణకీర్తి
మహిషవాహనారూఢ భీకర ముఖదీప్తి
పక్షపాత రహితా పరమ పావనమూర్తి
యమునా సహజ శని అశ్వినీ దేవతాగ్రజా
నీకిదే నా సాదర ప్రణతి ఈయవె శరణాగతి

రవి సంజ్ఞా ప్రియ పుత్రా శ్యామల ఏలికా
దండపాశధరా ప్రచండ ధర్మ పాలకా
కాల నీలాది చతుర్దశనామ విరాజితా
గ్రహరూప ప్రదీపకా అనుగ్రహ ప్రసాదకా
యమునా సహజా శని అశ్వినీ దేవతాగ్రజా
నీకిదే నా సాదర ప్రణతి ఈయవె శరణాగతి
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

రాగం:జోన్ పురి

నీమాలనెరుగను స్వామీ నీ నామాలే
హోమాలు చేయగలేను నీకు ప్రణామాలే
నా పాలిటి వేదాలు నీ పాదాలే
నాలోకపు రవిచంద్రులు నీ నేత్రాలే
గోవిందా గోవిందా పాహిపాహి ముకుందా
గోవిందాగోవిందా పరమానందా

1.స్తోత్రమేమి చేయగలను  సోదివెళ్ళ గ్రక్కెదగాని
స్తుతియించలేను నేను అర్తి తెలుపగలనేగాని
మంత్రము తంత్రమురాదు మనసార తలచెదగాని
మెక్కులు ముడుపులు సైతం నావెతల కథలేగాని
గోవిందా గోవిందా పాహిపాహి వేంకటరమణా
గోవిందాగోవిందా కరుణాభరణా

2.నా చిత్తమె పీతాంబరము  ధరియించు స్వామి
నా హృదయము కౌస్తుభము శ్రీవత్సాంకితమవనీ
నా బుద్ధియే వైజయంతి నీమెడనలరించనీ
నాకవనమె నందకమై నీ కర శ్రీకరమై వరలనీ
గోవిందా గోవిందా పాహిపాహి శ్రీనివాసా
గోవిందాగోవిందా భక్తజనపోషా



రచన,స్వరకల్పన&గానం:రాఖీ

రాగం:ఖమాస్

మరచిపోలేవు నన్ను మనసైన నేస్తమా
ఏనాటికైనా ఎదలో పారద్రోల సాధ్యమా

1.కునుకు నీకు పడితేచాలు కలలోకి చొరబడతాను
మెలకువ ఐనంతనే తలపులలో దిగబడతాను
నీలోన ఊపిరిగా వచ్చిపోతుంటాను
నీ కను కొలుకులలో అశ్రువై నేనుంటాను
జ్ఞాపకాల చితిలో ఎపుడూ కాలుతూనె ఉంటాను
నీడలాగ నిన్నెపుడూ వెంటాడుతుంటాను

2.అద్దంలో నీఅందాలకు మెరుగుదిద్దుకుంటేనో
అందులోన ప్రతిబింబంగా కనబడుతు నేనుంటాను
గాలిలోన చేరవచ్చే పాటలాగ తోడుంటాను
మధురస్మృతులు మెదిలినంత పెదవులపై నవ్వౌతాను
మనచెలిమి గురుతులు మదిలో శిలాశాసనాలు
మరుజన్మకైనా మరలా   మరులుగొనే అంకురాలు
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

ఏ పూర్వ పుణ్యమో నీతొ నాసావాసం
ఎంత అదృష్టమో మన ఇరువురి సాంగత్యం
లోకమంతా ఏకమై మనకు ఎదురు తిరిగితె ఏమి
కక్షగట్టి విడదీసే కుట్రలెన్ని పన్నితె ఏమి
మన ప్రణయ బంధం త్రెంచలేరెవ్వరు
మన ప్రేమ సౌధం కూల్చలేరెవ్వరు

1. కులాల కుత్సితాల బలాబలాలో
మతాల సంకుచితాల వికృత పోరులో
సమాజాన్నె వెలివేసి మన బాటలొ సాగుదాం
కుటుంబాలు వదిలేసి మనకు మనమె బ్రతికేద్దాం
మన ఆశయాలు మార్చలేరెవ్వరు
మన ఆశలెన్నటికీ త్రుంచలేవ్వరు

2.వివరాలనెరిగాకే అనురాగం పుడుతుందా
ప్రణాళికలు రచియిస్తేనే అనుబంధం బలపడుతుందా
ఎవరికెపుడు ముడిపడుతుందో ఎవరికి ఎరుక
అందమో అందుబాటో స్పందిస్తేనె కలయిక
స్వర్గంలో జరిగిన పెళ్ళిని  నరకంగా చేసుడెందుకో
పరస్పరం అభీష్టముంటే కట్టుబాట్లు కాసుడెందుకో