Friday, March 20, 2020

రచన.స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:పట్ దీప్

నీ వదనమే అరవిందము
నీ అందమే మకరందము
నా చూపులు మారేనూ భ్రమరాలుగా
నీ మోమున వాలేనూ సుధలుగ్రోలగా

1.కలువల వలలోనా -చిక్కుకుంది నాహృదయం
అధర మందారాల్లో మత్తుగొంది నా చిత్తం
కపోలాల నిగారింపులో స్ఫురించింది నవనీతం
కనుబొమల కనుమల్లో సింధూర సుప్రభాతం

2.ఊరించసాగాయి ఉరోజాలు పరువాన్ని
పక్షపాతి అయ్యింది పైటకొంగు తప్పుకొని
ఉపాసించగలనే నిన్ను సౌందర్య దేవత
ప్రసాదించవే వరమును అందించి నీ మమత
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:తిలాంగ్

శిరమునుండి కరుణగంగ పొంగిపొరలదా
కనులనుండి దయామృతం వరదలై పారదా
భోళాశంకరుడవు సర్వదుఃఖ హరుడవు
శివుడవు భవుడవు ప్రణవ స్వరూపుడవు
సాష్టాంగ వందనాలు సదాశివా
కవనచందనాలు నీకు సాంబశివా

1.కాలకూట విషమునైన కంఠాన నిలిపావు
ప్రళయాగ్నినైనా మూడో కంటిలోన దాచావు
నాగులనే నగలుగా తనువున దాల్చావు
చితివిభూతి ఒంటికంత పూసుకున్నావు
కరోనాను కాలరాయ నీకేపాటి
దీనులనిల కావగా నీకెవరు పోటి

2.కనికరమున వరములీయ లేరునీకు సాటి
కోరినదొసగుటలో అసామాన్యమె నీ దృష్టి
అర్ధాంగినైతె నేమి ఆత్మలింగమైతెనేమి
అడిగినదే తడవుగా ప్రసాదించినావు
కరోనాను కాలరాయ నీకేపాటి
దీనులనిల కావగా నీకెవరు పోటి
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

ఒళ్ళుమరిచె ప్రపంచం సోషల్ మీడియాతొ
జగతి విడిచె సమాజం అంతర్జాలంతో
మంటగలిసిపోయాయి మానవీయ బంధాలు
మింటికెగసిపోయాయి రక్తసంబంధాలు
కరోనా కల్పించింది చూరుకింది అనుబంధాలు
కరోనాపెంచింది గృహంలోన బాంధవ్యాలు

1.బందైపోయాయి బయట తిరగడాలు
కుచించబడిపోయాయి హోటళ్ళలొ తినడాలు
ఇల్లాలి చేతివంటలొ వడియాలు అప్పడాలు
పరస్పరం శ్రద్ధాసక్తుల ఆరోగ్య భాగ్యాలు
కరోనా కల్పించింది చూరుకింది అనుబంధాలు
కరోనాపెంచింది గృహంలోన బాంధవ్యాలు

2.సంసారమె ప్రాధాన్యతగా సాగాలి లోకం
వ్యక్తిగత సౌఖ్యమే సంఘానికి శ్రేయోదాయం
ఎవరికివారైతేనే ప్రబలిపోదు అంటువ్యాధి
ఇంటిపట్టునే ఉంటే కట్టగును ప్రతి మహమ్మారి
కరోనా కల్పించింది చూరుకింది అనుబంధాలు
కరోనాపెంచింది గృహంలోన బాంధవ్యాలు
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:హేమవతి

ఏడు కొండలనే వీడినావులే సరి
మా గుండెల చేరరావో శ్రీహరి
విజృంభిస్తున్నదీ కరోనా మహమ్మారి
మము కావగ నినువినా ఎవరుమరి
వేంకట రమణా కరుణా భరణా
శరణుశరణు భవపాపహరణా

1.మా దేహమందు నిన్ను ఆవాహన చేసెదము
మా హృదయమందు నీకు ఆసనము వేసెదము
పన్నీటి పాద్యమిచ్చి పదముల కడిగెదము
కన్నీటి అర్ఘ్యమొసగి కరముల తోమెదము
వేంకట రమణా కరుణా భరణా
శరణుశరణు భవపాపహరణా

2.మాలిన్యము తొలగేలా అభిషేకించెదము
స్వచ్ఛమైన వస్త్రాలను ధరియించెదము
ప్రకృతి పచ్చదనం నిత్యం నిలిపెదము
పర్యావరణమునే పరిశుభ్ర పరిచెదము
వేంకట రమణా కరుణా భరణా
శరణుశరణు భవపాపహరణా

3.సాటివారిపట్ల మేము బాధ్యతగా మెలిగెదము
కలుషితాలనెడబాసి నీ ధ్యాసలొ మనెదము
ప్రతి నరుడిలో మురహరినే దర్శించెదము
మానవీయ బంధాలు పునరుద్ధరింపజేసెదము
వేంకట రమణా కరుణా భరణా
శరణుశరణు భవపాపహరణా