Wednesday, January 20, 2021

 రచన.స్వరకల్పన&గానం:డా.రాఖీ


నెలవంక తలనున్న శివశంకరా

నా వంకలెంచక అనుకంపగనరా

గరళాన్ని మ్రింగినా భోళాహరా

అజ్ఞాని నేనని అలుసేలరా

పశుపతి గిరిజాపతి కైలాసపురపతి

నాకీయరా సద్గతి కపర్దీ శరణాగతి 


1.లింగరూప గంగాధర జంగమదేవర

త్ర్యంబకా కంకటీక  అంతకాంతకా

కపాలీ శూలీ భగాలీ పింగళీ అస్థిమాలీ

నా గుణదోషాలు నీవే కరుణాకర కనికరించరా


2.వృషవాహన ఋతధ్వజా దూర్జటీ

త్రిపురారి భృంగీశా సితికంఠా ముక్కంటీ

మృత్యుంజయ భస్మాంగ సంధ్యావాటి

నా భవతాపాలు నీవె పరిహరించరా ఉద్ధరించరా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నవ్వే నీ మోముకు నవరత్నాభరణం

నీ మంజుల హాసానికి నా ప్రాణాలే తర్పణం

ఎంతని పొగడను నీ అందం చర్విత చరణం

 అందాన్ని మించి అపురూపమే నీ సౌశీల్య గుణం


1.చూపుల్లో మెరిసె నిశి రాతిరి చుక్కలు

చుబుకానికె సోయగమా చిన్నారి నొక్కులు

చెంపలకే ఇంపైన  విన్నాణపు సొట్టలు

వంకీల ముంగురులే విలాసాన దిట్టలు


2.సన్నధిలో పరిమళించు  మధువన గంధాలు

వాగ్ఝరిలో ప్రవహించు మందార మరందాలు

సఖ్యతలో పొంగిపొరలు అతులిత ఆనందాలు

సౌమ్యతలో హాయిగొలుపు వీరంధర చంద్రకాలు