Sunday, September 22, 2019

పుడమి చీల్చుక పుడుతుంది గడ్డి పరక..
తన జన్మకూ సార్థకత కోసం
పాదాల క్రింద నలిగుతున్నా..
మనుగడ సాగిస్తుంది కిక్కురు మనక..
ప్రకృతే పాఠశాల ప్రతి మనిషికి
పాఠాలు వల్లెవేయి వికాసానికి

1.మూడునాళ్ళ ముచ్చటగా
వికసించును ప్రతికుసుమం
చేరుతుంది గుడినో జడనో
మార్చుకోక తన నైజం
అందాలు చిమ్ముతుంది
వసివాడునంతదాకా
సుగంధాలు రువ్వుతుంది
గాలి మోసినంతదాక
ప్రకృతే పాఠశాల ప్రతి మనిషికి
పాఠాలు వల్లెవేయి వికాసానికి


2.చినుకుగా మొదలయ్యి
కలిసిపోతుంది తోటి వాటితోటి
ఒక్కొక్కటిగా చేరి
వాగులూ ఝరులౌతుంది
అడ్డుగా కొండలున్నా
ఆపదు నది తన ధాటి
నేలదూప తీర్చుకుంటూ
ఐక్యమౌతుంది కడలి కౌగిలి
ప్రకృతే పాఠశాల ప్రతి మనిషికి
పాఠాలు వల్లెవేయి వికాసానికి

రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:చిత్తరంజని

నిన్ను ప్రేమించలేను-చెట్టపట్టాలువేసుకొంటూ
నీ వెంటపడలేను-బంధనాలు తెంచుకుంటూ
నా మదినే కోవెల చేసి నిన్ను ప్రతిష్ఠిస్తాను
దేవతగా ఆరాధిస్తూ బ్రతుకిలా గడిపేస్తాను

1.నీ అందం తరిగిపోయినా నా దృష్టిమారిపోదు
నీ వయసు ఉడిగిపోయినా అనురాగం మూగవోదు
మనసుల మధ్యన ప్రబలిన బంధం మనది
మరణం సైతం విడదీయని మిథునం మనది

2.దేహైక ప్రణయాలే ప్రేమకు పరమార్థమా
స్వప్నలోకాలలో మనమే మనలేమా
కోరుకున్న తక్షణమే నన్ను చేరుకుంటావు
పెదవి విప్పకుండగానే  నాలో లయమౌతావు