Saturday, December 14, 2019

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

రాగం:శివరంజని

నీదీనాదీ ఒకటే దేశం
మనలో మనకూ ఎందుకు ద్వేషం
వేరనడానికీ నెపములెన్నెన్నో
మనమొకటని భావించగా-కారణమొకటైన దొరకదా
బోలో భారత్ మాతకీ జై-బోలో దునియాకీ జన్నత్ కో జై

1.నేను నా కుటుంబం నా వీథి నాఊరు
నా జిల్లా నా రాష్ట్రం అంటూ విడివడతారు
నా శాఖ నా కులము నా మతమే శ్రేష్ఠము
 నా యాస నా భాష నా ప్రాంతమె నా కిష్టము
పెంచుకోర సోదరా హృదయ వైశాల్యము
కలుపుకుంటె నీదిరా సువిశాల భారతం
బోలో భారత్ మాతకీ జై-బోలో దునియాకీ జన్నత్ కో జై

2.జాతీయస్ఫూర్తియే భరతావనికి పెట్టని కోట
ఐకమత్య లౌకికతే ఇంటా బయట భద్రతకు బాసట
ఘనములకు ఝరులకు జలధికి అనుబంధం
ఒకే దేశ ప్రజాస్వామ్య వారసులం మనకెందుకు భేదం
చేయి చేయి కలుపరా  ప్రగతి బాట పట్టరా
ఎదను ఎదుటను ఎదురౌవైరులను తరిమితరిమి కొట్టరా
బోలో భారత్ మాతకీ జై-బోలో దునియాకీ జన్నత్ కో జై

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

రాగం:మోహన

ముక్కోటి దేవతలకు ఒక్కనాడె దర్శనము
వైకుంఠ ఏకాదశి దర్శనము
ఉత్తర ద్వారాన దర్శనము
కోట్లమంది భక్తులకు దివ్య దర్శనం
ప్రభో అను నిత్య దర్శనం
స్వామీ సామీప్య దర్శనం
చిద్విలాసా హే శ్రీనివాసా
అర్ధనిమీలితనేత్రా హే ఆప్తమిత్రా

1.మునులకు ఋషులకైన దుర్లభమే నీదర్శనం
ఇంద్రాది సురులకైన పరిమితమే నీప్రాపకం
ప్రహ్లాద నారదాది భక్తులకూ పరమ విశేషం
సామాన్య మనుజులకు సర్వ దర్శనం భవ్య దర్శనం
ప్రభో అను నిత్య దర్శనంస్వామీ సామీప్య దర్శనం
చిద్విలాసా హే శ్రీనివాసా -అర్ధనిమీలితనేత్రా హే ఆప్తమిత్రా

2.సుప్రభాత సేవ దర్శనం సుఖదాయకం
అభిషేక సేవలో  నిజరూప దర్శనం
తోమాల సేవ దర్శనం నయనానందకారకం
నిత్యకల్యాణ దర్శనం లోక కల్యాణార్థము
సడలింపు పూలంగి తిరుప్పావడ ఏకాంత సేవలు
పూర్వ జన్మసుకృతాన సులభసాధ్యము
చిద్విలాసా హే శ్రీనివాసా -అర్ధనిమీలితనేత్రా హే ఆప్తమిత్రా
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

రాగం:రేవతి

“ మాంగల్యం తంతునానేనా
మమజీవన హేతునా!
కంఠే భద్నామి సుభగే
త్వం జీవ శరదాం శతం!! ”

ఎలా కలుపుతాడో భగవంతుడు
భిన్నమైన ధృవాలను
ఎందుకు ముడిపెడతాడో పరమేశ్వరుడు
విభిన్నమైన మనస్తత్వాలను
ఎంతటి బలమైనతాడో చెరోవైపు లాగినా తెగనే తెగదు
ఎందుకీ మాయలో పడతాడో తెలిసీ వగచుట తగదు

1.దాంపత్య మంటేనే ఆధిపత్య రాహిత్యం
నవరసాలు నిండిఉన్న అద్భుత సాహిత్యం
అభిప్రాయభేదాలకు తగ్గదు సాన్నిధ్యం
నిత్యం వాదనల నడుమ చెదరదు బాంధవ్యం
ఎంతటి బలమైనతాడో చెరోవైపు లాగినా తెగనే తెగదు
ఎందుకీ మాయలో పడతాడో తెలిసీ వగచుట తగదు

2.భారతీయ వైవాహిక వ్యవస్థ ఘనతనో ఇది
వేదమంత్రాలలోని మహిమాన్విత ఫలితమో ఇది
ఒకరిపట్ల ఒకరికున్న విశ్వసనీయతనో ఈ గుఱి
కాపురాల కాలాంతర అనురాగ మర్మమో మరి
ఎంతటి బలమైనతాడో చెరోవైపు లాగినా తెగనే తెగదు
ఎందుకీ మాయలో పడతాడో తెలిసీ వగచుట తగదు