Saturday, January 7, 2023


https://youtu.be/ONu0VN1p6ck

 రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


కాపురాలకెసరొచ్చే రేపల్లెలో నీ మాయ జిక్కి కృష్ణా

గోపికలే మైమరచేరు నువు మభ్యపెడితె దొంగ కృష్ణా

మచ్చిక చేసుకొనగ నిను మించరెవరు కొంటె కృష్ణా

నువు విసిరే వలలొ పడని వనితే లేదు వంశీకృష్ణా


1.నాదస్వరమల్లే మురళిని వాయించి లొంగదీస్తావు

పొగడ్తలే కుమ్మరించి గొల్లభామలందరి ఉల్లము దోస్తావు

నీ మాటల మత్తులో చిత్తుకాని చిత్రాంగి ఇలలో లేదు

నీ అక్కునజేరాక మతిపోని అతివంటూ ఉండనే ఉండదు


2.ఇంటిలోన బొంకి సైతం నీ వంకవచ్చేరు జంకులేక

ఒంటి పైన ధ్యాసేలేక నీ వెంటబడతారు కాదు కుదరదనక

అష్టభార్యలందరినీ ఆకట్టుకున్నావు కనికట్టుచేసేసి

ఇష్టసఖులెందరున్నా వద్దనక మురిపిస్తావు ముద్దుచేసి

 https://youtu.be/LGVUIdUI49I?si=Kb-Rm60Szy0qu8FI

రచన,స్వరకల్పన&గానం:గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


పూర్వజన్మ సుకృత వరమే పురందరదాసుది

అపూర్వ తపఃఫలంబే ఆ అన్నమాచార్యునిది

సర్వస్య శరణాగతి ప్రతిఫలమే త్యాగరాజుది

ఏ వ్రత ఫలితమ్మో తరిగొండ వెంగమాంబది

మధురమైన గళముతో తిరుమలేశ నిను నుతించిరి సంప్రీతి

గాత్రమే గరళమై గానమునకు దూరమై వేంకటేశ ఏల నాకీ దుర్గతి


1.ప్రయాసలెన్ని పడినానో పాట పాటవానికై

ప్రయత్నమెంత చేసానో గానమాధురి కొరకై

జన్మతః శాపమే కంఠమందు మార్ధవమే కరువై

జన్యులోపమే నా గొంతులోన కర్కశమే కొలువై

గాత్రమే గరళమై గానమునకు దూరమై వేంకటేశ ఏల నాకీ దుర్గతి


2.విధేయుడినై నుడివితి నా కృతులు పాడమని

ప్రాధేయ పడితిని పదేపదే గాయనీ గాయకులని

కనిపించినవారినల్ల అడిగితిని పాడుదురాయని

కన్నీటితొ వేడితిని స్వామీ నాకు గొంతీయగలేదని

గాత్రమే గరళమై గానమునకు దూరమై వేంకటేశ ఏల నాకీ దుర్గతి

 https://youtu.be/l4o-i9hwTIE?si=NfODglm9udHLidVu

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


హేమంత సాయంకాలమైంది

గిలి పెడుతూ చలి చంపుతోంది

సొగసైన ప్రేయసి సన్నిధిని మది కోరుతోంది

చెలి కౌగిలిలో నులివెచ్చగా  కరగాలనుంది


1.చామంతులు పూబంతులు వంత పాడాయి

కొంటెగా కంటిముందే పావురాలు జత కూడాయి

ఒంటిని కొరికే ఈదురు గాలితోనే  నాకు లడాయి

తొలి రాతిరి తీపి గురుతులూ ఎదనెంతో తోడాయి


2.అరవిరిసిన సిరిమల్లెలన్నీ మాలగ మారాయి

మరులను రేపుతు చెలి జడ పాయలొ దూరాయి

ఘుమఘుమలతొ రిమరిమలేపుతు సవాలు విసిరాయి

జాగు చేయుచూ జాము గడపకని ప్రేమతొ కసిరాయి


https://youtu.be/Pty64HNVDrk?si=iIL0ggDSHH3UVS1R

 రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


ప్రేమగా పలకరించు

చెలిమి చిగురించు

చిరునవ్వును పంచు

బంధాలు మించు

ఈ క్షణమే మనదని తలచి

మమతనందించు హాయిగా జీవించు


1.కొండనే తాకిన మబ్బు

గుండె కరిగి కురియునుగా

పూవుపై వాలిన తుమ్మెద

తేనె గ్రోలి మురియునుగా

చరాచరమేదైనా అలంబన కోరుగా

మనసుతో మనసును ముడివేయి నేరుగా


2.కడలిలో కలవాలని 

నది మదికి ఎంతో తొందర

కలువను కలువాలని

జాబిలికి తరగని ఆతురత

కలవరమయ్యేను సంగమించునందాక

కల వరమై తరిస్తుంది తలపోసినదందాక