Friday, May 22, 2020

నా హృదయం నీ చేతి ఢమరుకమై మ్రోగనీ
నా ఊపిరి నీ పద మంజీరమై రవళించనీ
అవధరించరా శివశంకరా
నను ధరించరా దిగంబరా
సిద్ధపరచరా ఉద్ధరించరా ఉమా మహేశ్వరా
వందే వ్యోమకేశా వందే క్లేశనాశా

1.కైమోడ్చి వేడెద కైలాసం నా ఆవాసం కానీ
కైంకర్యము నొనరించెద మనసే నీ మందిరమవనీ
తేల్చిచెప్పు సత్వరమే ఏది నీకు సమ్మతమో
ప్రసాదించు వేగిరమే ఏది నీకు సాధ్యమో
వందే ఇందుమౌళీ వందే హే కపర్దీ

2.నా ప్రాణపంచకాన పంచాక్షరి లీనమవని
నా నవనాడులసడి నమఃశివాయ గానమవని
నిర్ణయించు నిటలాక్షా నీ కేది సముచితమో
అనుగ్రహించు అంగజహర నాకేది ప్రాప్తమో
వందే వామదేవా వందే సద్యోజాతా

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:రేవతి

"విశ్వంభర"

కాల గమనంలో- లోకాల భ్రమణంలో
ఎన్ని వింతలో- ఎన్నెన్ని చింతలో
మానవ జీవనమే నవరస కదంబము
నరజాతి మనుగడలో అడుగడుగూ గండము

1.సంభ్రమంగ భువినావిర్భవించి
పలువిధముల పరిణామం చెంది
నాగరికతతో సంస్కారమొంది
పరిశోధనలే సలిపి ఆవిష్కరణలుచేసి
సర్వతోవికాసమొందినాడు మనిషి
సర్వదా సాటివారికై తపించే మహర్షి

2.పాతని సతతం పాతర పెడుతూ
అనవరతం నవ్యతకే పట్టం కడుతూ
అనునిత్యం ఎన్నెన్నో సవాళ్ళు ఛేదిస్తూ
నవతరానికై దారంతా ముళ్ళనేరేస్తూ
యుద్ధానికై సదా సంసిద్ధుడైన యోధుడు
జయాపజయాలలో చలించకున్న సిద్ధుడు

చకోరి కోరికా-కార్తీక చంద్రిక
సుమాల మాలిక-భ్రమరానికే యిక
ఉషస్సులే మనస్సులో రుచస్సులేయగా
వసంతమే నా సొంతమై ఆసాంతమాయెగా

1.నీలాలనింగి నంటుతున్న నీలగిరి కొండలు
పచ్చికయే పచ్చని చీరగ ప్రకృతి ముస్తాబులు
లేళ్ళను మరిపించి దుముకె చక్కని సెలయేళ్ళు
రవికళ్ళలొ చిరుజల్లుకె మెరిసిన హరివిల్లు
ఆనందమాయెగా-అనంతమాయెగా
అందాల నందనం –గుండెల్లొ విరియగా

2.రాచిలుకలన్ని స్వాగతించి దారి తీయగా
రాయంచలె నా ఎదుటనిలిచి హారతీయగా
మయూరాలు తయారనీ ఆనతీయగా
కోయిలలు మురిసి మేను మరచి పాడె తీయగా
ఆనందమాయెగా-అనంతమాయెగా
అందాల నందనం –గుండెల్లొ విరియగా

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

కౌగిలి అనుబంధాలకు లోగిలి
కౌగిలి అనురాగాలకు వాకిలి
కౌగిలి ప్రణయానికి ముంగిలి
కౌగిలి మన్మథ కేళికి దివ్యనివాళి

1.మల్లెతీగ అల్లుకోగ ఆలింగనమే
తల్లి పిల్ల హత్తుకొనగ బరవసమే
స్నేహితుల అలయ్బలయ్ కావలింతయే
ప్రేమికులు పైకొనగ పరిష్వంగమే

2.పెదవుల చుంబనము పరిరంభమే
తనువులు అక్కునజేరగ సమాశ్లేషమే
నులివెచ్చని చెలికౌగిలి స్వర్గతుల్యమే
చెలికాని బిగికౌగిలి ఇల కైవల్యమే
నుదుటి మీది పుట్టుమచ్చ బొట్టు లెక్కనీకు
పెదవి మీది పుట్టుమచ్చ దిష్టి చుక్కనీకు
కమ్ముకున్న కారుమబ్బులల్లె తోచె నీ కురులు
పున్నమి జాబిలియై వెలిగేను నీ మోము సౌరులు
సఖీ  నీవు సౌందర్య దేవతవు
చెలీ నీవు అనురాగ దీపికవు

1.కనులు కనులు కలిపితే-రెప్పగిలుపలేము
చూపు మనసు తెలిపితే-తప్పుకొనగలేము
ప్రవహించెను భావఝరి-హృదయసీమలోకి
ప్రసరించెను రసమాధురి-హాయినంత ఒలికి
సఖీ నీవు ప్రణయ ప్రబంధం
చెలీ నీవు పుష్ప సుగంధం

2.మలయ మారుతం వేసవిలో నీ సహచర్యం
హర్ష వర్షపాతం ఎడారిలో నీ  సహయోగం
లిఖించేను అహరహరం - నీ గీతాగోవిదం
తపించేను ఇహం పరం - నీ జతయే ఆనందం
సఖీ నీవు సత్యం శివం సుందరం
చెలీ నీవు సత్వరజస్తమో మందిరం