Tuesday, June 16, 2020

నాన్న ప్రాణ స్నేహితుడు
నాన్న జ్ఞాన బోధకుడు
నాన్న మార్గదర్శకుడు
నాన్న శిక్షకుడూ సంరక్షకుడూ
కనిపెంచే కనిపించే నాన్న దేవుడు

1.విశ్వసించగలిగే  ఆత్మీయుడు
విస్మరించలేని ఆప్తమిత్రుడు
మన ఉన్నతి కాంక్షించే గురువర్యుడు
లౌక్యాన్ని నేర్పించే ఆచార్యుడు
కనిపెంచే కనిపించే నాన్న దేవుడు

2.బ్రతుకు బాట వేసే శ్రేయోభిలాషి
దారితప్పనీయని అనవరత హితైషి
క్రమతతొ నడిపించి దరిజేర్చే దిక్సూచి
మన ప్రగతే తనదిగా భావించే మహర్షి
దైవత్వం నింపుకున్న ఇలోని మహా మనిషి


రచన,స్వరకల్పన&గానం.:డా.రాఖీ

జగమే ఒక ఉయ్యాల-కాలమే జంపాల
జనులనూరడించగా జోలనీవె పాడాల
జంగమదేవరా అర్ధనారీశ్వరా
జననివి జనకుడివీ నీవేరా నీవేరా
రాజరాజేశ్వరా భవా భీమేశ్వరా

1.నీ విశ్వరచనలో మేము తోలు బొమ్మలం
నీ జగన్నాటకంలొ వచ్చే అతిథి పాత్రలం
ఆడించినట్టుగా ఆడి అలసిపోయాము
నడిపించినట్టుగా నడిచి సొమ్మసిల్లాము
మమ్ముల లాలించి పరిపాలించరా
నీ ఒడిలో సేదదీర విశ్రమించనీయరా

2.నియమాలే అతిక్రమించు జీవిత చదరంగం
నిబంధనలు పాటించక సాగు కాలచక్రం
నీ మాయల మర్మమైతె ఎరుగమైతిమయ్యా
నీ లీలల పరమార్థం నీకే తెలియునయ్యా
శోధించగ వేదనలే మిగిలేనయ్యా
నీ పదసన్నిధికై పొగిలితిమయ్యా
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

ఎంతగానో  మాకిష్టం -భక్షభోజ్యచోష్యలేహ్యాలు
భోజన ప్రియులకు ఆత్రం పంచభక్ష పరమాన్నాలు
లొట్టలేస్తు లాగించేస్తాం షడ్రసోపేతాలు
నోరూరించే కమ్మనైన తినుబండారాలు

1..నలభీమపాకమైతే చెప్పడానికేముంది
నేతి తీపి మిఠాయిలైతే రసన మురిసిపోతుంది
ఆవకాయ గోంగూరతో అదరహో ప్రతిపూట
అప్పడాలు వడియాలుండగ అదేకదా పండగ

2.అతిథిలాగ వచ్చేస్తాం తృప్తిగా భోంచేస్తాం
అమ్మలా ఆదరిస్తే కొసరికొసరి వడ్డిస్తే
ఆయాసమొచ్చేదాకా కడుపారా తింటాం
అన్నదాతా సుఖీభవా అంటూ దీవిస్తాం
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

స్నేహమంటె నాకెంతో  వ్యామోహం
నేస్తాల అంతరంగమంతా అనురాగం
ఏ ప్రేగు బంధం లేకున్నా రక్త సంబంధం కాకున్నా
అనిర్వచనీయమీ అనుబంధం
చిత్రమేసుమా మైత్రీబంధం-మన మైత్రీబంధం

1.ఏ గాలి కలిపిందో ఏ వేళ కలిసిందో
ఏ తీరు నచ్చిందో ఎదలోకి చొచ్చిందో
బలీయమైపోయింది బాంధవ్యం
అనంతమై సాగుతుంది ఈ పయనం
అనిర్వచనీయమీ అనుబంధం
చిత్రమేసుమా మైత్రీబంధం-మన మైత్రీబంధం

2.అద్దమల్లె మనవన్నీ స్పష్టంగా తెలుపుతుంది
కనబడని మనవెన్నే  కంటికి చూపెడుతుంది
పరకాయ ప్రవేశమే చెలిమికెపుడు తగు అర్థం
పరసువేది తత్వమే సఖ్యతకు పరమార్థం
అనిర్వచనీయమీ అనుబంధం
చిత్రమేసుమా మైత్రీబంధం-మన మైత్రీబంధం