Tuesday, April 27, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఏమీ తోచడం లేదు-నోచినదానికై వేచివేచి

ఏదీ సైచడం లేదు- నీ పెదవుల నే రుచి చూచి

జాబిలిదీ అందమనగలేను నీ మోమును కన్నాక

వెన్నెలా చల్లగ అనిపించలేదు నీ చేరువ నున్నాక


1.మబ్బులకూ అబ్బురమే నీ కురులు రేగ

చుక్కలూ మిణుగురులే నీ చూపుల తూగ

రోజాలకిష్టమే నీ బుగ్గల సిగ్గులై మెరవగ

మల్లెలకదృష్టమే నీ నవ్వులకవి పోలికవగ


2.నీ నడుం మడతలు గోదారిసుక తిన్నెలు

వయారాల నడకలు కిన్నెరసాని మెలికెలు

దృష్టి దాటి పోనీని నీ సుందర మందర గిరులు

సృష్టికి ప్రతిసృష్టిగా మరులురేపు నీ పురులు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కాలుకు దూరమైనా -నాకంటికి భారమైనా

మానసాన్ని దర్జాగా ఆక్రమించినావే

మెదడునే దౌర్జన్యంగా కబ్జా చేసినావే

అబ్జదళనేత్రి అభిమాన అభినేత్రి

సుమ సమ కోమల దివ్యగాత్రి నా ప్రియమైత్రి


1.మేని పై నీ మెరుగులే ఎరలాయె దక్కేటందుకు

నీ చిలిపి చేష్టలన్ని వలలాయే చిక్కేటందుకు

ప్రయోగించినావే నీ మంత్రదండాన్ని

ప్రదర్శించినావే ఏదో ఐంద్రజాలాన్ని

ప్రస్తుతం నేను ఐనాను నీ దాసుడను

వస్తుతః నేను నిఖార్సైన బానిసను


2.నర్మగర్భముంటుంది వింతగ నీ పలుకులలోనా

అంతరార్థముంటుంది నీ మూగ సైగల్లోనా

కట్టిపడవేసావే కనికట్టుతొ నీఎదవాకిట

గారడేదొ చేసావే కళ్ళుమూసి తెరిచే లోపట

అయస్కాంతమల్లే నన్నులాక్కున్నావే

ఇనుపముక్కలాగా నిన్నతుక్కున్నానే

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

చిత్రం: Sri.Agacharya Artist 


శ్రీరామ బంటువని నిన్నంటే మారుతి

పులకరించి పోయెదవు నీ కెంతటి ప్రీతి

శ్రీరామ గానమే నీకు నిత్య నిర్వృతి

ప్రత్యక్షదైవమ హనుమా నీవే శరణాగతి


1.వాయుతేజస్సుగల వరపుత్రుడవు

సాక్షాత్తు పరమేశ్వర అంశవే నీవు

అంజనాదేవీ కేసరి నందనుడవు

దినకరునికి నీవు ప్రియమైన శిశ్యుడవు


2.వజ్రాయుధ ఘాతానికి హనుమవైనావు

బ్రహ్మాస్త్రానికి నీవు బద్ధుడవైనావు

ధర్మానికి రామునితో తలపడనిలిచావు

రామనామ మహిమను లోకానికి చాటావు


3.సకల శాస్త్ర కోవిదుడవు సంజీవ రాయుడవు

సంగీతంలో నారదు గర్వభంగమొనర్చావు

భీముని కావరాన్ని అణచి దీవించావు

పార్థుని పతాకవై విజయము నందించావు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:దర్బార్ కానడ


రప్పించెద నిన్నూ రామనామ భజన చేసి

మెప్పించెద నిన్నూ సిందూరము మేన పూసి

కుప్పించి ఎగసి కడలిని దాటిన లంకాదహి పావని

చప్పున నను భవజలదిని కడతేర్చర పాహిపాహి

శ్రీ ఆంజనేయా  జయమంగళం

శ్రితపారిజాతా  శుభమంగళం


1.నీ జయంత్యుత్సవము నేడు మదికెంతో ఉత్సాహము

హనుమశ్చరితమున నీ కీర్తి గానము శ్రవణ పేయము

భక్తి ముక్తిదాయం నీ సుందరకాండ పారాయణం

నీదివ్య దర్శనముతొ దీర్ఘ వ్యాధులే మటుమాయం

శ్రీ రామదూతా అభివందనం

జైజగజ్జేతా హస్తార్పణం


2.రవిని ఫలమని మ్రింగిన ఘనుడవు బాలాంజనేయ

యయాతికండగనిలిచిన బలుడవుఅభయాంజనేయా

రోమరోమమున రామునిగన స్వామిదాసుడవు భక్తాంజనేయా

భక్తులపాలిటి కల్పతరువువు జయహో ప్రసన్నాంజనేయా

కపివర్యుడా  నీకు  కైమోడ్పులు

వాగధీశుడా నీకు వందనశతములు


శ్రీ రామదూత హనుమజ్జయంతి శుభకామనలు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


పాపిట మెరిసే సింధూరం

నుదుటన కుంకుమ తిలకం

కంటికి దిద్దిన అంజనము

వనిత వదనానికే సింగారము

భారతీయ సంస్కృతికి నెలతే నిదర్శనం

సాంప్రదాయ మనుగడకు మగువే కారణం


1.సీత సింధూర ధారణ మహిమనెరిగి మారుతి

మరుచెదమా తన మేనంతా పులుముకొన్న సంగతి

కుంకుమ ధరించినంతనే దిష్టి దోషానికి దుర్గతి

పసుపు కుంకుమలతొ పడతికి ఆయురారోగ్య ప్రాప్తి


2.ఆకట్టుకొనుగ అరచేతుల గోరింట  అరుణకాంతి

ప్రమద పాదాలకు పారాణే నిత్య సౌందర్య దీప్తి

నిండుగా చేతికి వేసుకొన్న గాజులే చూపరులకు రక్తి

పద్దతైన చీరకట్టులో పూబోడి అందమే ప్రశస్తి