Thursday, September 24, 2009

నాప్రణయ దైవమా-జీవిత సర్వస్వమా
ముంజేయి పట్టిచూడు-ఎదన చెవియొగ్గిచూడు
నీ రాకతోనే నాడి ఆగిపోయిందో
పట్టరాని సంతోషంలో గుండె మూగవోయిందో

1. లోకమంత కోడైకూయని-మన స్నేహం అతులితమైందని
జనమంతా మెటికలు విరవని-మన బంధం అజరామరమని
నీవులేక వెయ్యేళ్లెందుకు-మోడులాంటి ఈ బ్రతుకు
నీవుంటె క్షణమే చాలు-నందనవన మయ్యేటందుకు
ఓ ప్రాణ నేస్తమా –ఓ నా సమస్తమా
నా మేను తాకి చూడు-నా శ్వాస జాడ చూడు
నిన్ను చూడగానే ఒళ్లు చల్లబడిపోయిందో
చెప్పరాని ఆనందంలో ఊపిరి గతి ఏమయ్యిందో

2. నా తపస్సు ఎంత తీవ్రమో-నీ మనస్సు కే ఎరుక
నా దీక్ష ఎంత కఠోరమొ-పంచ భూతాలకె ఎరుక
ఎన్ని యుగాలైనా గాని-మానలేను నీ ధ్యానం
నేనిక జీవశ్చవమే-నీలో చేరె నా ప్రాణం
ఓ నా మిత్రమా-నా అంతర్నేత్రమా
నా ఛాతి చీల్చి చూడు-దేహాన్ని కోసి చూడు
అణువణువు లోనూ నీవె నిండి ఉంటావు
జీవకణము లోనూ కనిపిస్తువుంటావు