Wednesday, July 1, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

ముంగురులు చెప్పే ముచ్చట లేమిటో
ముసిముసి నవ్వులు పూసే ఘటనలు ఏవిటో
ఏ జ్ఞాపకాలు బుగ్గల సిగ్గుల నద్దేనో
ఏ వింతమైకాలు ఒంటిని కమ్మేనో
నీలో నీవే నేనుగా నాలో నేనూ నీవుగా
తడిసేము రేయి పగలు తలపులు ముంచగా

1.నీరెండ పోల్చుకుంది నీ మేని మెరుపుని
బొండుమల్లె తేల్చుకుంది తను కాస్త నలుపని
పచ్చదనం నినుమెచ్చి అలుముకుంది కోకగా
పసిడిగుణం తనువిచ్చి అల్లుకుంది అలవోకగా
నీలో నీవే నేనుగా నాలో నేనూ నీవుగా
నా ఊహల రూపం నీవేగా నీ కలల కల్పన నేనేగా

2.చిత్తరువయ్యాను నీ చిత్తరువు గని నేను
గమ్మత్తుగ చిత్తైనాను కించిత్తు స్పందిస్తేను
ఆషాఢ మాసాలు  పడుచుజంటలకు శాపాలు
కరోనా అంతరాలు చేరనీవు మన తీరాలు
నీలో నీవే నేనుగా నాలో నేనూ నీవుగా
నన్నావరించే సౌగంధి నీవు నిన్నలరించే గాంధర్వం నేను

మరచిపోతే ఎలా నా చెలీ
నను విడిచిపోకే ఓ జాబిలీ
మగువకే సాధ్యమౌనేమో నిర్లక్ష్యము
పడతికే అలవాటేమో ఈ టక్కరితనము

కాలిబంతిలాగా నన్నాడుకుంటున్నావే
పూలచెండులాగా ననువాడుకుంటున్నావే
తగదెనీకు తుంటరితనము-మానవే నెరజాణతనము
నన్నుంచుకోవే నీ తలపులోనా-నన్నుండనీవే నీ గుండెలోనా

మదిలోన మంటలు రేపి జారుకుంటావు
బ్రతుకంతా అలజడిరేపి తుర్రుమంటావు
అనురాగం అన్నదే యోగం-మనలేనే నీ వియోగం
మృతివరకు నిన్నే నే కోరుకుంటా-చితి చేరినాగాని నినువదలనంటా
రచన.స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:రేవతి

ఆషాఢ శుద్ధ ఏకాదశి పర్వదినం
చాతుర్మాస్యదీక్షకు ఈనాడే శ్రీకారం
అలసిన శ్రీహరి విశ్రమించు శుభతరుణం
పరిశుభ్రత శమదమ నియమ పాలన ఆచరణీయం

1.ఆరోగ్యానికే అగ్రతాంబూలం ఏకాదశి మర్మం
జాగరణ ఉపవాసం పండగ అంతరార్థం
చలవ పదార్థాల విస్మరించుటే పరమార్థం
వ్యాధులు ప్రబలకుండ చేపట్టే చర్యలసారం

2.విష్ణునామ సంకీర్తన శ్రేయోదాయకం
విష్ణుప్రియ కన్యను సేవించుట పుణ్యప్రదం
విష్ణుతత్వ జిజ్ఞాస చేర్చునులే పరమపదం
విష్ణు భక్తులమై పొందాలి జన్మసాఫల్యం
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:మోహన

ప్రధాని పదవే వచ్చింది తానుగా వరించి
ఆర్థిక సంస్కర్తగ నవభారత విరించి
నేడు జగమెరిగిన పీవిగారి శతజయంతి
జేజేలు పలుకుతోంది తెలుగుజాతి గర్వించి
జయహో పాములపర్తి వేంకట నరసింహారావు
జోహార్ నీకిదే తొలి తెలుగు ప్రధానిగా మరపురావు

1.బహుభాషా ధురీణుడు అపర చాణక్యుడు
తెలంగాణ మాగాణి పుత్రుడు రాజకీయ పవిత్రుడు
కాంగ్రేస్ విశ్వసనీయుడు గాంధీ పరివార విధేయుడు
కవిగా పండిత ప్రకండునిగా పేరొందిన వరేణ్యుడు
జయహో పాములపర్తి వేంకట నరసింహారావు
జోహార్ నీకిదే తొలి తెలుగు ప్రధానిగా మరపురావు

2.నిదానమే ప్రధానమని ఆచరించినవాడు
ఆచితూచి అడుగేసిన మంత్రాంగ యోధుడు
ముభావమే సర్వదా భావ ప్రకటనైనవాడు
పక్కా నిర్ణయాలె ప్రతీతిగా కలిగినవాడు
జయహో పాములపర్తి వేంకట నరసింహారావు
జోహార్ నీకిదే తొలి తెలుగు ప్రధానిగా మరపురావు

3.నిరాడంబరుడు నిగర్వి తాను నిస్పక్షపాతి
ప్రపంచాన ఇనుమడింపగచేసె భరతఖ్యాతి
తెలంగాణ మకుటంలో పివి కలికితురాయి
భారతరత్నమై వెలుగొందుటె తరువాయి
జయహో పాములపర్తి వేంకట నరసింహారావు
జోహార్ నీకిదే తొలి తెలుగు ప్రధానిగా మరపురావు