Tuesday, February 21, 2023

 

https://youtu.be/zUMhJkj3so0

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:ఖర హర ప్రియ


శివలింగా శంభులింగా శ్రీరామలింగా

భవపాపభంగా అనంగదగ్ధ కరుణాంతరంగా



1.నీ తలమీద తారాడును ఆకాశగంగ

ఒడవని కన్నీటి కడలి నా ఎద పొంగ

తానమాడుకో తనివిదీర నాకనులు కురువంగ

అభిషేక ప్రియా మృత్యుంజయ ప్రియమారగ


2.బిల్వదళార్చన సంప్రీతుడివి భవానీ భవా

నా నయనదళము నర్పింతు ఆత్మసంభవా

అంకమునింక శంకరా మా జీవనాన మారనీవా

కడగండ్లు కడతేర్చి ఆనంద తీరాన్ని మము చేరనీవా

 రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:చారుకేశి


నీలాంబరైంది నీదైన అనురాగం

మలయమారుతం నా ఎద సరాగం

రెండింటి తాకిడి లో అమృతవర్షణి వర్షం

నాతో నీవుంటే చింతలేని అంతులేని హర్షం


1.మోహనరాగంలా నీ సమ్మోహన రూపం

చంద్రకౌఁస్ లా నీ కన్నులలో వెన్నెల దీపం

హంసనాదంలా నీ గాత్రమే  అపురూపం

శివరంజనిలా ఎదలో రేపకు ఏదో తాపం



2.సింధుభైరవే అణువణువున నీ అందం

ఆనందభైరవై నీతో బ్రతుకంతా ఆనందం

కళ్యాణిలా కమనీయం కావాలి మనభవితవ్యం

మధ్యమావతిలా ప్రతిక్షణం మనకిక నవ్యాతినవ్యం





https://youtu.be/23nJbM7sQSQ?si=V2W4MycJP4-JPngx

 రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ 

రాగం:ధర్మవతి


ధార్మికమౌ ధర్మపురి ధామమందు 

అన్న దానమే కడుపుణ్యమందు

నరసింహస్వామీ రూపమే కనిన కనులవిందు

గోవిందుని దివ్యనామమే అనిన వినిన బహుపసందు


1.పావన గోదావరీ నదిధారయందు

సరిగంగ స్నానాలతొ జన్మధన్యతనొందు

తీరములో మొంటెలవాయినాలతో

ముత్తైదువుల ఐదోతనము శాశ్వతమొందు


2.దక్షిణవాహిని పవిత్ర గోదారి మునక

పితృతర్పణాదులకు పావనమౌ ప్రోక

బ్రహ్మ యమరాజులకు ఇదియే బైసుక

ఎన్ని విశేషాలో ధర్మపురి దర్శిస్తే గనక

 

https://youtu.be/h9S7K2qvIN4?si=JlCa9UTp6obI1TZ5

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ 


రాగం:భీంపలాస్


శివనామమే మధురాతిమధురము

శివగానమే అమృత పాన సమము

శివలింగరూపమే మంగళప్రదాయకం

శివ భక్తి తత్త్వమే… కైవల్యదాయకం


1. కరమున అమరిన త్రిశూలమే అభయకరం

ఢమఢమ మ్రోగే ఢమరుకమే చేతనాప్రపూరం

అనాలంబి వీణా నిక్వణమే శ్రవణానందకరం

నటరాజ తాండవమే నయనమోహనం శ్రీకరం


2.శివ శిరమున గంగధార పరమ పావనం

 శశి విలసిత మనోహరం సుందరేశు వదనం

నిశి పూజతొ మోదమొందు పరమేశు హృదయం

శివరాతిరి పర్వదినం అణువణువూ శివమయం