Saturday, January 28, 2023

 రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ



వాడి తగ్గిపోయిందా నీ సుదర్శనం వాడి వాడి

సొట్టలు పడిపోయిందా కౌమోదకి మోదిమోది

పదును కోల్పోయిందా నీ ఖడ్గము నందకానిది

మూల జేరిపోయిందా నీ సారంగము నారి తెగి

ఏమైంది స్వామీ నీకు దుష్ట శిక్షణా లక్ష్యము వీగి

చతికిల పడిపోయావా బాలాజీ నువు చేష్టలుడిగి


1.సిరి సహురిలతో నిరంతరం సరసాలా

నైవేద్యాలలో చక్కెర పొంగలి పాయసాలా

లడ్డూ దద్దోజనాలూ ఆరగించ ఆయాసాలా

భక్తుల ముడుపులతో సరదాలు విలాసాలా

ఏమైంది స్వామీ నీకు దుష్ట శిక్షణా లక్ష్యము వీగి

చతికిల పడిపోయావా బాలాజీ నువు చేష్టలుడిగి


2.ఖండించు మాలోదాగిన దుష్ట శక్తులను

దండించు మదిలోని దానవీయ యుక్తులను

నిర్జించు అంతరాన పెట్రేగే దుర్జన మూకలను

సరిదిద్దు మా బ్రతుకును మెలితిప్పే వంకలను

ఏమైంది స్వామీ నీకు దుష్ట శిక్షణా లక్ష్యము వీగి

చతికిల పడిపోయావా బాలాజీ నువు చేష్టలుడిగి

 https://youtu.be/H8N2AAtzrDw

*రథసప్తమి శుభాకాంక్షలు*28/01/2023


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


తిమిరాన్ని పరిమార్చే అరుణభాస్కరా

జీవదాతవీవే పరంజ్యోతివీవే కరుణాకరా

చంద్రునికోనూలుపోగు చందాన రవీ నీకు నీరాజనం

నీవులేక మనుగడ సాగించలేరు మా ధరణి జనం


1.సప్తాశ్వరథా రూఢుడవు

సప్తవర్ణ సమ్మిళిత కిరణుడవు

కర్మసాక్షివీవు ధర్మం తప్పని వాడవు

నవగ్రహాధినేతవు అనుగ్రహ దేవుడవు

మంగళ హారతిదే మిత్రుడా

అక్షర హారతిదే ఆదిత్యుడా


2.సంధ్య ఛాయల ప్రియ పతివి

యముడు శనిదేవుల పితరునివి

ఆహార ఆరోగ్య వరప్రదాతవు నీవు

ప్రత్యక్ష నారాయణమూర్తి నీవు ఆర్తిని బాపేవు

కర్పూర హారతిదే కమలాప్తుడా

నక్షత్ర హారతిదే నమస్కార తుష్టుడా

 

https://youtu.be/MWLlb-tC568?si=9itduX73YdGNIHTu

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


వేడకు నన్ను ఆజ్ఞాపించు

అడగకు నన్ను పురమాయించు

నీ సేవ చేసుకొనుటె నాకు భాగ్యము

నీ పద దాసునిగా కడతేరిన ధన్యము


1.కడగంటి చూపులకే కరిగిపోతాను

పెదవంచు నవ్వులకే మురిసిపోతాను

ఒక్క పలకరింపు కొరకై అర్రులు చాస్తాను

దర్శనమిస్తివా ప్రేయసీ పరవశించి పోతాను


2.కలయిక కలయిక నడుమన స్థాణువునౌతాను

నువు నడిచిన దారులలో దుమ్ము రేణువునౌతాను

రోజొకపరి ననుతలవగ మంత్ర ముగ్ధుడనవుతాను

శ్రద్ధను కనబరచితివా నీ ప్రేమాగ్ని దగ్ధుడనవుతాను


https://youtu.be/0hu-3sjaMg4?feature=shared

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


శ్రీ లలితా పరాభట్టారికా

శ్రీ రాజ శ్యామలా మణిద్వీపనగరి ఏలికా

శ్రీ చక్రరాజ సింహాసనేశ్వరీ జగదంబికా

శ్రీ రాజ రాజేశ్వరీ శ్రీవిద్యా శివాత్మికా

నమస్సులు నీకివే మానసా దేవీ

రుచస్సును నింపవే మామదిలో మంజులభార్గవీ


1.సూర్యకాంతి జగతికి ఐనా తిమిరమె మాకు

నెలకో పున్నమి లోకానికి చీకటే మా కన్నులకు

కన్నతల్లివే గదా గతుకులేలా మా పథములకు

జీవశ్చవాల రీతిగడుప తగునా నీ పుత్రులకు

నమస్సులు నీకివే మానసా దేవీ

రుచస్సును నింపవే మామదిలో మంజులభార్గవీ


2.ఏడాదికి ఒకమారు వస్తుందిగా వాసంతము

ఎడారిలోనూ కురియునెప్పుడో చిరు వర్షము

ఏది ముట్టుకున్నా ఔతోంది అంతలోనే భస్మము

ఈ జన్మకు లేదా మరిమా బ్రతుకుల హర్షము

నమస్సులు నీకివే మానసా దేవీ

రుచస్సును నింపవే మామదిలో మంజులభార్గవీ