Wednesday, August 28, 2019

రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం: మధుకౌఁస్

తెలుగుకన్న వెలుగు పంచు భాషలేదు
తెలుగుకన్న తెగువ పెంచు వాక్కు లేదు
అజంతా సోయగాల అమరభాషరా ఇది
యుగాలెన్ని మారినా ఇగురదుఈ జీవనది
నా మాతృభాష తెలుగు - నా ఊపిరి హృదయ లయ తెలుగు

1.ముత్యాల దస్తూరి నాభాషకు ఆభరణం
నుడికారాల కస్తూరి నా భాషకు పరిమళం
పద్యసాహితీ ప్రబంధాను బంధం నాతెలుగు
హృద్యమైన అవధాన  సంధానం నా తెలుగు
పొగడగ చెఱకుగడే కటిక చేదు  నాభాష ముందు
వివరింపగ మీగడే సాటిరాదు నా భాషే పసందు
నా మాతృభాష తెలుగు - నా ఊపిరి హృదయ లయ తెలుగు

2.భువన విజయకొలువులో కవనమై చెలఁగింది
దేశభాషలన్నిటిలో దవనమల్లె  కీర్తిగొంది
పాల్కుర్కిసోమన్న ప్రభవించిన నా తెలుగు
బమ్మెర  పోతన్న ప్రవచించిన నా తెలుగు
జానపదుల గళ గర్జన నా భాష శ్రీకారం
అన్నమయ్య పదకీర్తన నా భాష ఓంకారం
నా మాతృభాష తెలుగు - నా ఊపిరి హృదయ లయ తెలుగు
రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:మాల్కోస్

ఏం రాత రాసాడు నీ పెనిమిటి
నా బ్రతుకంత చేసాడు కడు చీకటి
నాలుగు తలలున్న బహునేర్పరి
నను బలిచేయగ వింతే మరి
పలుకుల పూబోడి నీ దాసుడి
అలజడి మాన్పవే బ్రహ్మక్రొత్తడి

1.ఉండనీయడమ్మా ఉన్నచోట
పండనీయడమ్మా ఏ పూట
దండగైపోయిందీ మనుజ జన్మ
అనుభవించి తీరాలి పూర్వ కర్మ
ఆమాత్రం నువ్వాదరించకుంటెనో
ఆగమై పోయేవాణ్ణి విద్దెలమ్మా

2. ఏ కొఱతాలేదనీ విర్రవీగనా
కొఱతవేసినందుకు నేనేడ్వనా
అడగకున్న ఇచ్చాడని నమ్మికొలువనా
ఉన్నదూడ్చివేసాడని దెప్పిపొడవనా
కన్నతండ్రి కుండకుంటె ఏ కనికరము
ఆ బిడ్డల మనుగడయే నిత్యనరకము