Sunday, January 6, 2019


ఏముంది చెప్పడానికి.. నీగురించి కొత్తగా
ఏముంది విప్పడానికి ..నీ గుట్టు తెలియనట్టుగా
యదుకులబాలా..హే నందలాలా
గోపీలోలా గిరిధరగోపాలా

1.చిన్ననాట నీనోట జగతిని చూపావట
వెన్నముద్దలన్నీ వేడ్కగ దోచావట
జలకమాడు పడతుల వలువలు దాచావట
ప్రార్థించిన పాంచాలికి చీరలిచ్చి కాచావట
మధుసూదనా హే వాసుదేవా
పురుషోత్తమా పాండురంగ విఠలా

2.కుచేలుణ్ణి ఆదరించి మైత్రి విలువ నిలిపావట
కుబ్జను కనికరించి మానవతను చాటావట
రాధతోడికూడినీవు పరమ ప్రేమ నేర్పావట
బ్రతుకుసారమంతనీవు గీతలోనె తెలిపావట
అచ్యుతా అనంతకృష్ణ హేమాధవా
గోవిందా హరి ముకుంద జగన్నాథ జనార్ధనా
వాలుచూపుల నెరజాణ
వాలుజడనూ వాడకుమా
వాలిపోయెద నీఒడిలోనా
నీ వాడినయ్యీ తడిసేను
నీ వలపుల జడిలోనా

1.ప్రత్యూషపు తుషారమీవు
ప్రదోషాన సింధూరమువు
పారిజాత పరిమళమీవు
మంజీర నాదము నీవు
పంచభూతాత్మకమైన
నా ప్రాణ పంచకమీవు
వాడబోకు నీచిరునవ్వు
అది మదనశరములు రువ్వు

2.శ్రీనాథుడు వ్రాయగలేడు
అల్లసాని తెలియగ లేడు
కాళిదాసు వర్ణించలేడు
రవివర్మ చిత్రించగలేడు
జక్కనైన చెక్కని శిల్పం
బ్రహ్మ సృష్టించని అందం
నాకు దక్కిన భాగ్యం
వద్దని వారిస్తా వరమిస్తే స్వర్గం
జాబిలి నీ సిగ పూవు
చీకట్లను పారద్రోలు నీవున్న తావు
జాలిగుండె దేవుడవు
ఇక్కట్లను కడతేర్చి కాపాడుతావు
మల్లన్నగా రాజన్నగా మహిలొ కొలువు దీరినావు
భక్తులపాలిటి పెన్నిధిగా వెలుగొందుతున్నావు
ఓం నమఃశివాయ వందనమందుకోవయ్యా
నమో నమఃశివాయ మా మతిలొఉండి పోవయ్య

1.లోపాలనెంచక నీ చూపు మాపై నిలుపు
తప్పిదాలు మన్నించి ఇకనైనా కనికరించు
కానుకగా నీకు మా మనసునర్పించెదము
కన్నతండ్రి నీవని నమ్మి నిన్ను కొలిచెదము
లింగయ్యగా జంగయ్యగా జగతినేలుతున్నావు
భక్తులపాలిటి పెన్నిధిగా వెలుగొందుతున్నావు
ఓం నమఃశివాయ వందనమందుకోవయ్యా
నమో నమఃశివాయ మా మతిలొఉండి పోవయ్య

2.మంచిరోజులొస్తేనే మెదులుతుంది నీతలపు
కర్మపండిపోతేనే అందుతుంది నీ పిలుపు
మా ఈతిబాధలకు ఈయవయ్య ముగింపు
చెరిగిపోని నగవును మా పెదవులపై నిలుపు
శివయ్యగా సాంబయ్యగా  ఇలన నిలిచి ఉన్నావు
భక్తులపాలిటి పెన్నిధిగా వెలుగొందుతున్నావు
ఓం నమఃశివాయ వందనమందుకోవయ్యా
నమో నమఃశివాయ మా మతిలొఉండి పోవయ్య