Thursday, September 9, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్


రాగం:భీంపలాస్


నువ్వు ఎలుక వాహనమెక్కి చక చక రా చక చక రా 

నవ్వు గుజ్జు రూపముతోని గున గున రా గునగునరా

నువ్వు రావయ్య విఘ్నపతి నువ్వు పుట్టిన ఈ చవితి

రావయ్య మా ఇంటిలోనికి రావయ్య ఈ మండపానికి


1.వాకిళ్ళలో ముగ్గులెట్టి గుమ్మాల తోరణాలు కట్టి

కళ్ళలొ దీపాలు పెట్టి ఎదిరిచూస్తున్నాం ఉగ్గబట్టి

నువ్వు రావయ్య గణపతి నిలిచిపోగా మా మతి

రావయ్య మా ఇంటిలోనికి రావయ్య ఈ మండపానికి


2.ఇరవయ్యొక్క పత్రి పెట్టి రంగుల పూలెన్నొ తెచ్చి

మందార మాలలు కట్టి దుర్వారాలు ఏరుకొచ్చి

సిద్దపరిచాం పూజకు సిద్దిపతి చూపవయ్య సద్గతి

రావయ్య మా ఇంటిలోనికి రావయ్య ఈ మండపానికి


3.మోదకాలు చేసి పెట్టి ఉండ్రాళ్ళు సైతం పెట్టి

వెలగపండు కోసుకొచ్చి పాయసాన్ని వండి తెచ్చి

నీ ముందుంచాము తినమని మా మనవిని వినమని

రావయ్య మా ఇంటిలోనికి రావయ్య ఈ మండపానికి

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కలియుగ వైకుంఠమై ధరలొ వరలె తిరుమల తిరుపతి

సుస్థిరముగ సిరియుతముగ శ్రీహరి నిలువగా

సద్గురునాథుడై వెలిసే సాయిగా భువిని కైలాసపతి

పరమేశ్వరుడిల షిరిడీ పురములొ సిద్ధావధూతగా


1.అంగమందు అంబరాల సంబరమే కనరాదు

నివాసమనగరాని వసతే శిథిలమైన మసీదు

భిక్షాపాత్రతొ ఇల్లిల్లు దిరుగ ఆదిభిక్షువనకపోదు

చితాభస్మధారుడిలా మనకు పంచేటిది ఒట్టి ఊదు


2.భోళాతనముతో బాలకులతొ ఆటలాడు

కోపోద్రిక్తతతో దోషములను తూలనాడు

వైద్యనాథుడై ప్రబలిన వ్యాధుల ఆకీడు

పరవశమున చిందులేసి తకిటతధిమి నాట్యమాడు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


దాటగలము సాగరాన్ని సైతం

కాలికేమాత్రం నీరు తాకనట్లుగా

గడపలేము సంసార జీవితం

కంటికామాత్రం కన్నీరు కారనట్లుగా

అక్షర సత్యమిది జోహారు ప్రవచించిన ఆ కవికి

అనుభవైక వేద్యమిది ప్రభవించిన నిజ రవికి


1.సర్దుకపోయినంత కాలం సరదా దాంపత్యం

గొడవలకొకటే మూలం సైచని ఆధిపత్యం

విడాకులను మాట వస్తే వేరైనట్టే ఇది సత్యం

చావలని ఊహకైన తోస్తే చచ్చినట్టే ఇక నిత్యం

అక్షర సత్యమిది జోహారు ఎన్నో కాపురాలకు

అనుభవైక వేద్యమిది అందరి హృదయాలకు


2.చిరుచిరు కలహాలు చిలుక అలకలు

ఒకటి రెండంటూ చిలవలు పలవలు

ఒక్కరు దాల్చే మౌనం ఇరువురి పాలిటి వరం

ఎదుటివారి విసుగుకు నీ నవ్వు ముసుగు అనివార్యం

అక్షర సత్యమిది జోహారు ఆచరణీయులకు

అనుభవైక వేద్యమిది  చిరస్మరణీయులకు

 నీ పేరే వలపులకే వల

నీవేమో అభినవకోయిల

నీ అందం పోలిక కావల

నీ ప్రణయం నాకో ఎరలా

పడిపోయా నీకే నే చేపలా


1.నీ కన్నులే పున్నమి వెన్నెల్లా

నీ నవ్వులే ఆమని పువ్వుల్లా

నీ పలుకులే జలపాతాల్లా

నీ కులుకులే రాజహంసలా

వర్ణించగ యత్నించానే కవిలా


2.నీ కోసమే చెలీ నా ఎద పరిచా

నీ తలపులలో నను నే మరిచా

నా భవిత నీకై ప్రతిపాదించా

నిను మెప్పించి నీ ప్రేమ గెలిచా

ఫిదానైపోయా నీ దాసునిలా