Monday, January 16, 2012

దయగల్ల మారాజు రాజన్న

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

అంతవాడివని ఇంతవాడివని -ఎంతెంతొ పొగిడాను రాజన్నా
నిన్నెంతెంతొ పొగిడాను రాజన్నా
నమ్మిన వాడిని నట్టెట ముంచుట
నీకైతె తగదయ్య స్వామి-రవ్వంత దయజూడవేమి

1. పరమదయాళుడ వీవేనంటూ
పదివేల మందికి చెప్పినానయా-నిదర్శనాలెన్నొ చూపినానయా
కరుణాసాగరుడ వీవేనంటూ
కనబడ్డవారికి చెప్పినానయా -నీలీలలెన్నెన్నొ చాటినానయా
భోలాశంకర ననుపరీక్షించగ
నీకింక తగదయ్య స్వామీ- రవ్వంత దయజూడుస్వామి

2.దానవుల సైతం ప్రేమతొ బ్రోచే
వెన్నంటిమనసు నీదంటిని-నిన్నే నమ్ముకొంటిని
దోషాల నెంచక శరణాగతినిచ్చే
భక్త సులభుడ వీవంటిని-నిన్నే వేడుకొంటిని
గరళకంఠ నా కడగండ్లు తొలగింప
పరుగుపరుగున రావేమి- రవ్వంత దయజూడుస్వామి

3. ఆకలిగొనియున్న నన్నాదరించి
కడుపునిండ బువ్వ పెట్టినావు-కోరిన వరముల నిచ్చినావు
సంబరపడతూ అదమరచినేనుంటె
వీపుమీద చఱిచి కొట్టినావు-కొత్తకొత్త కష్టాలు తెచ్చినావు
త్రిపురాసురసంహారి-హే సంకటహారీ
మొరవిని ననుగావ రావేమి-రవ్వంత దయజూడు స్వామి