Monday, August 24, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

గాదె క్రింది పందికొక్కులు-గోతికాడి గుంటనక్కలు
తోకనూపు ఊరకుక్కలు-హీనమౌ పరాన్న బుక్కులు
లంచగొండి పురుగులు బంట్రోతు నుండి మంత్రిదాకా
అవినీతి జలగలు వ్యాపారి మొదలు ఉత్పాదకులదాకా

1. గడ్డికరుస్తారంతా అన్నం బదులుగా
సంచరిస్తుంటారు మరీ దిగంబరంగా
అక్రమార్జనెప్పుడో బయటపడక  మానదు
బినామీ ఆస్తులకూ ముప్పురాక తప్పదు
మేలుకుంటె మేలుకలుగు ఈ క్షణమైనా
ఉన్నంతలొ తృప్తిపడితె హాయే స్థాయేదైనా

2.విలువకోల్పోతారు సభ్యసమాజాన
గౌరవం మంటకలుసు బంధు మిత్ర బృందాన
అనుభవించిన వారే ఈసడించుకుంటారు
భార్యా పిల్లలు సైతం చీదరించుకుంటారు
ఎవరికొరకు  తాకట్టో అవినీతిపరుల ఆత్మగౌరవం
ఎందుకు బజారుపాలో లంచావతారుల వ్యక్తిత్వం


https://youtu.be/MhkCoCoQgSk

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:వలజి

హే పంచముఖీ హనుమా
నీ పంచన నాకు చోటీయుమా
నా పంచప్రాణ కారణమా
నీ చరణసేవ ప్రసాదించుమా
ప్రణామాలు నీకివే పవన సుతా
వందనాలనందుమా అంజనానందనా

1.వానర వదన సకల శత్రుసంహరణ
సింహముఖా భూతప్రేత వినాశకా
గరుడాననా స్వామీ ఘోరరోగ ప్రశమనా
ఆదివరాహ లపన అక్షయ సంపత్ప్రదానా
హయగ్రీవ చుబ్రమాయ జన వశంకరాయ
పంచముఖీ హనుమతే నమో ఆంజనేయాయ


2.మా ఇంటి ఇలవేల్పువు నీవే స్వామీ
ఇలలోన నా ఇష్ట దైవమూ నీవె స్వామి
సీతామాతకు సంతసము కూర్చితివి
సౌమిత్రికి సంజీవిదెచ్చి జీవము నిలబెట్టితివి
రామప్రియా నన్ను కావగ జాగేలరా
ప్రేమమీర నన్నిపుడే ఆదుకోవేమిరా

రాగం:ఉదయ రవి చంద్రిక

ఆచితూచి అందాలు రంగరించి
అపురూప వర్ణాలు మేళవించి
కొసరి కొసరి మెరుగులెన్నొ చిలకరించి
ప్రావీణ్యమంతా ప్రదర్శించి
కొలతలు తగురీతిగ అమరించి
నెలతా నిను సృజించాడు విరించి

1.వెన్నెల వెన్న లు ఏర్చికూర్చి
మేలిమి పుత్తడిని కరిగించి
శ్రీగంధం మకరందం సాధించి
పాలను పుష్పాలను మధించి
పోతపోయ తగువిధంగ సవరించి
నెలతా నిను సృజించాడు విరించి

2.సప్తస్వరాలు గళమున ఒదిగి
నవరత్నాలే నవ్వుల పొదిగి
ఇంద్రధనుస్సే మేని వంపై ఇల దిగి
పొంకాలన్నీ పోటీపడి ఎదిగి
వర్ణించలేనట్లు నీ సౌరు వివరించి
నెలతా నిను సృజించాడు విరించి



గంగాధరా జటాధరా
భోళాశంకరా గరళ కంధరా
అవలీలగ కనికరించె పరమదయాళా
నీలీలలు అద్భుతమే భళా భవా భళా

1.భగీరథుని మనోరథం మన్నించినావు
ఆకాశగంగనే జటనుంచి కురిపించావు
గాండీవి గర్వాన్ని అణిచివేసినావు
పాశుపతాస్త్రమునే ప్రసాదించినావు
అలవోకగ పరికించే చంద్రకళాధరా
అలవిమాలిన ప్రేమ  ప్రసరింతువురా

2.మార్కండేయుని  ఆశీర్వదించావు
మృత్యుంజయుడనీ అనిపించావు
శ్రుతిర్మాత లయః పితగ గీతమువైనావు
సంగీతనాట్య శాస్త్రాల మూలకర్తవైనావు
మధురగాత్రమొసగేటి మహాదేవా
నా గళమున వసియించు సదాశివా


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

వెలకట్టలేనిదిమీ అభిమానము
తీర్చుకోలేను ఎప్పటికి మీ ఋణము
ఏ మేరకు అలరించానో నా కవితలతో
ఎంతగావిసిగించానో నావైన వెతలతో
చేజోతలు మీకివే ప్రియమైన హితులారా
కృతజ్ఞలు శతకోటి శ్రేయోభిలాషులారా

1.కవి భావన ఎదలోపలికి చొప్పించగలిగానో
వ్యవహార భాషలోనే వ్యక్తపరుచగలిగానో
ఏ ఒక్కపూటైనా నా పాటైనా ఆహ్లాదం కలిగించిదో
పూర్వజన్మ బంధమేదో మన మధ్యన నిలిచిందో
చేజోతలు మీకివే ప్రియమైన హితులారా
కృతజ్ఞలు శతకోటి శ్రేయోభిలాషులారా

2.వైవిధ్యం కొనసాగిస్తే నచ్చనివీ భరించారు
రాశిలాగ కుప్పబోస్తే ఓరిమితో సహించారు
అనుక్షణం ప్రోత్సహిస్తూ నన్ను నడిపిస్తున్నారు
తగువిధంగ స్పందిస్తూ నా వెన్నుతడుతున్నారు
చేజోతలు మీకివే ప్రియమైన హితులారా
కృతజ్ఞలు శతకోటి శ్రేయోభిలాషులారా