Friday, May 15, 2020



రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

*నవరోజు రాగం*

శ్రీనివాసము నీ హృదయం
నీ నివాసము నా హృదయం
నీ మూడునామాలు నా గుణత్రయములు
నా ఏడు వ్యసనములు నీ సప్తగిరులు
ఏలుకో లోకాలు నాలోన కొలువుండి
మనసెరిగి మసలేవు స్వామీ నీకు కనికరము దండి

1.అలంకారప్రాయాలు కావు నీ ఆయుధాలు
కథలు కల్పనలు కావు నీ అవతారగాథలు
ఖండించు దుష్కృతములన్నీ చక్రధర వేగిరముగాను
నరికేయి దుష్కర్మలన్నీ  నళినాబ్జ నందకముతోను
ఏలుకో లోకాలు నాలోన కొలువుండి
మనసెరిగి మసలేవు స్వామీ నీకు కనికరము దండి

2.నా మదము నణిచేయి స్వామీ బలిని బ్రోచిన రీతి
నన్నుద్ధరించవేమి సుధాముడివంటిదే నా దుస్థితి
త్రికరణాలలోనూ నీ స్మరణ భాగ్యాన్ని కలిగించు
త్రికాలముల యందునూ నీ ధ్యానమనుగ్రహించు
ఏలుకో లోకాలు నాలోన కొలువుండి
మనసెరిగి మసలేవు స్వామీ నీకు కనికరము దండి
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

గంధర్వకాంతవో -నవయువకుల చింతవో
అనాదిగా కనివిని ఎరుగని రమణీయ వింతవో
మనాదినే కలిగించే కమ్మని కవ్వింతవో
యుధ్ధాలు వచ్చేదీ సుందరి నీ వలనే
మరణాలు హెచ్చేదీ మానినీ నీ చలవే

1.ఎంతమంది నీకొరకై కలలుకంటున్నారో
ఎంతమంది ఎదపై నిన్ను చిత్రించుకున్నారో
ఎందరు నిను హృదయంలో బంధించుకున్నారో
ఎందరు నిను జీవితాన ఊహించుకున్నారో
పిచ్చిలేసి తిరిగేదీ నీవల్లనే
వెర్రెత్తిపోయేదీ నీ చలవతోనే

2.నీ తప్పు కానేకాదు నీరూపలావణ్యానిది
నీ దోషమేదీలేదు నీ మేని సౌష్ఠవానిది
ఏర్చికూర్చి తీర్చిదిద్దే ప్రతిభ కనబర్చగ బ్రహ్మ
నీతో ముడిపడినవాడికి ధన్యమయ్యేను జన్మ
క్రీగంటిచూపైనా నోచనీవె నెచ్చెలీ
నూరేళ్ళ నా బ్రతుకూ నీకోసమే బలీ
మౌనం విశ్వ సంగీతం
అనురాగం విశ్వజనీనం
భావానికున్న భాష ఏదీ
అనుభూతికి యానకమేదీ
మనసు నుండి మనసుకి ప్రవహించేలా
కనుల నుండి కనులకు ప్రసరించేలా

1.మాటలెన్ని వస్తేనేమి మూగయై పోతాము
గుండె గుట్టు విప్పలేకా మిన్నకుండి పోతాము
ప్రతిపాదన చేసేవేళా ప్రమాదమే తాత్సారం
హృదయాన్ని తెలిపేలోగా చేజారు పుణ్యకాలం

2.బెట్టుచేయనేల బ్రతుకు నిర్ణయాలకు
పట్టింపులింకేలా ప్రేమ అనునయాలకు
మెట్టొకటి దిగివస్తే మకుటమేది పడిపోదు
జంటగా మనగలిగేందుకు సర్దుబాటే మేలు

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

కడుపులోని చల్లకాస్త కదలనంత సేపు
మనకాలికి ఏ మట్టీ అంటనంత వరకు
చెబుతాము ఎన్నైనా గొప్పలూ గప్పాలు
బోధిస్తూ ఉంటాము  ప్రవచనాలు నీతులు
సహానుభూతిచెందాలి సాటిమనిషిగా
సాయమందించాలి మనవంతు బాధ్యతగా

1.నిలుచున్న తావులో భూకంపం వస్తుంటే
ఏ అర్ధరాతిరో ఉప్పెన విరుచుకపడితే
కమ్మని కలల వేళ విషవాయువు కమ్మేస్తే
ఉపాధికోల్పోయే విఘాతమెదురైతే
ఉన్నఫళంగా ఇల్లూపట్టునొదలాల్సిరావడం ఎంతకష్టం
దారీతెన్నూ తెలియక విలవిలలాడడం ఎంతటి దురదృష్టం
సహానుభూతిచెందాలి సాటిమనిషిగా
సాయమందించాలి మనవంతు బాధ్యతగా

2.అష్టకష్టాలతో బ్రతుకు భ్రష్టుపడుతుంటే
వికృత మహమ్మారి విచ్చలవిడి కబళిస్తే
ప్రాణాపాయమెదురై ఓడలుబళ్ళైపోతే
మందేలేని రోగాలు పట్టిపట్టి పీడిస్తే
కూలినమేడల కడ నీడైనా దొరకని దుస్థితే దుర్భరం
పట్టెడన్నానికై చేయిసాచాల్సి రావడం మరణ సదృశం
సహానుభూతిచెందాలి సాటిమనిషిగా
సాయమందించాలి మనవంతు బాధ్యతగా
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

బాల్యమా నీకెంత నిర్దయనమ్మా
నన్ను గెంటివేస్తివి ఎందుకమ్మా
పాడుబడె నా మది నమ్మవమ్మా
నీ తీపి జ్ఞాపకాలే నాకు ఊపిరమ్మా

1.అమ్మజోల పాటలు
నాన్న గోరుముద్దలు
సోపతోళ్ళ ఆటపాటలు
ఎన్ని ముద్దుముచ్చటలు
బ్రతికినంత కాలం చెల్లిస్తాను మూల్యమే
అందజేయి మరోసారి నీ ఒడి కైవల్యమే

2.అజ్ఞానమైనా ఆనందమే
సుజ్ఞానమైనా ఆనందమే
నిర్మలమైనదే నీ నెలవు
కల్లాకపటాలకు లేదేతావు
మిడిమిడి జ్ఞానమే మ్రింగుడు పడదు
చేజారిపోయిన సమయం దొరకనే దొరకదు