Friday, May 31, 2019

మత్తులోన మునుగుతున్న మానవా
మాయదారి మధువు మానవా
సారా రక్కసి లిక్కరింక మానవా

మేలుకోరి చెబుతున్న వినవా
మేలైన విధమే కనవా
పూబాటను బట్టి సాగుమా

ముద్దుల్లోన ముంచురా
కౌగిట మురిపించురా
మగువను మించి మత్తు లేదురా గమ్మతులేదురా

1.ఇప్పసార తాగుతూ వీధికెక్కబోకురా
ఫుల్లేసి కక్కబోకురా
తాటికల్లు తాగుతూ తగువెట్టుకోకురా
ఒళ్ళుమర్చి దొర్లకురా
విస్కీబీరు రమ్ము జిన్నూ  లివరుకు ముప్పురా
వోడ్కా బ్రాందీ స్కాచ్ వైన్ ఏదైన విషమేనురా
మానమరియాదలన్ని మంటగలుచురా
ఇల్లు ఒళ్ళు గుల్లయీ చిత్తుచిత్తౌదువురా
కల్లుమానకుంటే చింతా సంక్షోభము
కళ్ళుతెరుచుకుంటేనే  అంతా సంక్షేమము

2.సంకలో పెట్టుకొని లోకమంత వెతుకకు
 ఇంటనే ఉంది కిక్కనిచ్చే ఇల్లాలు
మచ్చిక చేసుకొని ముద్దుముచ్చటలాడుకో
ఉండనే ఉండవు సరసాలకెల్లలు

దేశాలైనా ఏలేనేతలు ఆలికి మాత్రం బానిసలే
యుద్ధాలైనా గెలిచే రారాజులు రాణికి రేయంతా దాసులే
ప్రేమను పంచరా భామ ననునయించరా
తరుణి తనువు హాయిపలుకు వీణరా వాయించరా
సారాకొట్టు దారిబట్టు ఫుల్లుబాటిలెత్తి కొట్టు సాంబన్నా ఓ సత్తెన్నా
ఆలినే బూతులు తిట్టు రాతిరంత బాధలు వెట్టు దాసన్నా దేవదాసన్నా
 ఒళ్ళు గుల్లచేసుకొని ఇల్లు వీథికీడ్చుకొని మర్యాదమంటగలుపకోరన్నా
పెళ్ళాం పుస్తె గుంజుకొని లిక్కర్లొ నంజుకొని కంటతడివెట్టనిత్తువేలన్నా

1.సొంతడబ్బు పెట్టిమరీ తాగుబోతుగామార్చి వింతగా నవ్వుతుంది లోకం
చుక్కదిగకుంటేను అప్పుపుట్టకుంటేను ఎక్కివస్తుంది నీకు శోకం
కల్లు సారా బీరు రమ్ము ఒక్కటే లివరుకింక ముప్పన్నది దక్కుటే
విస్కీ జిన్ను వోడ్కా బ్రాందీ స్కాచ్ లు-నిషా గొలిపి చంపే విషాలు

2. ప్రేమపంచుతుంది ప్రాణమైన ఇస్తుంది మనసుపెట్టి చూస్తే ఇల్లాలు
తనకడుపు మాడ్చుకొని కోడికూరపెడుతుంది అమ్మలా సాకుతుంది  మగనాలు
మగువే  గమ్మత్తురా  తనతనువే మత్తురా మరిగితె వదలవా మధురాలు
ముద్దుల్లొ ముంచురా కౌగిట బిగియించురా వశమైతే దొరుతాయి స్వర్గాలు

Thursday, May 30, 2019

వందే చంద్రమౌళి వరదం
వామస్థిత పార్వతీ సంయుతం
గంగాధరం గణనాథస్య సహితం
మాతాంకాసీన స్వామినాథ సేవితం
వృషభాది వాహన సమాయుతం
 కైలాస పురపతిం భజామ్యహం సతతం॥


ఈశ్వరం గంగాధరమ్
గౌరీమనోహరమ్
గుహగణనాథయోః ప్రియకరమ్
మయూర మూషక మృగనందీ
పరివారమ్
వందే శంకరం భవపాపహరమ్  ॥

సుముఖ షణ్ముఖయోః జనక గంగాగౌరీ నాయక
శశి భూషణ నాగాభరణ నీలకంఠ త్రినయన
వృషభ మూషిక కేసరి మయూర  పరివేష్ఠిత
శూల ఢమరు ధర నటరాజ భక్తవశంకర
దయాసాగర పురహర నమస్తే రామలింగేశ్వరా॥


చిరంజీవి హనుమా-మా ఆర్తిని వినుమా
మా దుస్థితి కనలేవా-మా ఎదలో మనలేవా
రామనామ భజనతో-నిను మెప్పించెదను
సీతమ్మకు విన్నవించి-నిను ఒప్పించెదను
జయజయహే పవనసుతా-నమోస్తు శ్రీ రామదూత

1.ఈ కలి యుగమందున ప్రత్యక్షదైవమీవు
ఇడుములనెడబాపుటకై కంకణబద్ధుడవు
కోరినదొసగుటలో పరమేశ్వర సముడవు
కొండగట్టులోన హరిహరిగా నెలకొన్నావు
జయజయహే పవనసుతా-నమోస్తు శ్రీ రామదూత

2.నీవు తలచుకొంటే నిమిషమేచాలు
కనుమరుగైపోతాయి కష్టాలు కన్నీళ్ళు
నీ అండమాకుంటే నిశ్చింత జీవితాలు
మనసారా నమ్మినాము వదలము నీచరణాలు
జయజయహే పవనసుతా-నమోస్తు శ్రీ రామదూత
చూసినప్పుడే సుప్రభాతం
గొంతువిప్పితే  చైత్రగీతం
నీతో ఉన్న సమయం పరుగుల జలపాతం
నీ విరహంలో ప్రతిక్షణం నిప్పుల సుడిగుండం

1.ముట్టుకోబోతే ముడుచుకుంటావు అత్తిపత్తిలాగా
పట్టుకోబోతే జారిపోతావు మంచుముక్కలాగా
అంతలోనే చేతికందే చందమామవౌతావు
వింతగానే నవ్వులవెన్నెల రువ్వుతుంటావు
ఊరిస్తావు ఉడికిస్తావు పిచ్చివాడిగ మారుస్తావు
నీతో ఊహసైతం నిజమగు స్వర్గలోకం
నీ తలపులలో అనుక్షణం ఆనందనందనం

2.నేను శ్వాసించే ప్రాణవాయువై బ్రతికిస్తావు
నేను ప్రేమించే హృదయరాణివై అలరిస్తావు
వద్దంటూనే వారిస్తూనే    నా వద్దకొస్తావు
ఆకాశంలో మెరుపల్లే నువు మాయమౌతావు
ఆశలు రేపి బాసలు చేసి నన్నే నమ్మిస్తావు
వదులుకోలేని వజ్రం నువ్వే నా చెలీ
సత్యంకాని స్వప్నం నువ్వే నా సఖీ
కోరడానికొక్కటైన వేరే కోరిక లేదు
తీర్చడానికిప్పటికీ నీకు తీరిక లేదు
నువ్వుత్త గారడోడివి-నువ్వొట్టి మాయగాడివి
సాయి నువ్వు గరీబా-బాబా నీ కింతటి డాబా

1.షిర్డీ దర్శించినా  దుఃఖము హరియించలేదు
సిరిసంపదల ఊసు అసలే ఎత్తలేదు
మము రక్షింతువన్న మాటనీటి మూటాయే
త్రికరణశుద్ధిగా శరణన్నా వినవాయే
కాలహరణమే గాని కరుణించక పోతివి
సమాధిమీదనీవు కొలువైన ఒక రాతివి

2.గుడ్డిగా నిను నమ్మితిమి దృష్టిని సారించవేమి
మా భారము నీదంటిమి ఇంతటి తాత్సారమేమి
పరిపరివిధముల నిను ప్రార్థనైతె జేసితిమి
నీగుడి మెట్లన్నీ ఎక్కిఎక్కి అలసితిమి
నీ ఉనికిని చాటుకొనగ నీదే ఇక తరువాయి
నీ పటమైనా పలుకునన్న నీవాక్కును నిజం చేయి
భుజంగ భూషిణమ్
అనంగ నాశినమ్
జంగమ వేషినమ్
అంతరంగ వాసినమ్
వందే శశిధారిణమ్
వందే వృషవాహినమ్

1.అర్ధనారీశ్వరమ్
అవ్యయ గంగాధరమ్
మృగచర్మ ధారిణమ్
భవతాప హారిణమ్
వందే నటేశ్వరమ్
వందే జటాధరమ్

2.త్రినేత్ర శోభినమ్
త్రిశూల పాణినమ్
త్రిలోక పూజితమ్
త్రిగుణాతీత్మకమ్
వందే పంచాననమ్
వందే ప్రమధాధిపమ్

3.పత్నిద్వయ భోగినమ్
నిత్య సత్య యోగినమ్
గణనాథ గుహనాథ పితరమ్
అభిషేకప్రియం నిరంతరమ్
వందే నీలకంఠమ్
వందే కాలకాలమ్

శ్వేతాంబరధారీ-మాతా కృపాకరీ
వీణామృదునాద ప్రియకరి శుభంకరీ
మందస్మితవదనారవింద వాగీశ్వరీ
వినుతింతు సదా నీ కృతులనే
విన్నవింతు నెరవేర్చ నా వితులనే

1.తలపుల నువు నిలిచి-మరపుని తరమనీ
గళమును నువు మలచి-మార్ధవమే కురవనీ
నా ఎదలో సుస్థిరపడి-అజ్ఞానము వెరవనీ
నన్ను నేను తెలుసుకొనగ-నా బ్రతుకే మురవనీ
నా జన్మ ముగియనీ

2.సంగీత సాహితీ గంగలు నను ముంచనీ
వాదనలో వాదములో కుశలత మరి మించనీ
మాధుర్యము ఔదార్యము జగతికి నను పంచనీ
విద్యలకే శ్రీ విద్యవు-నీ ఎరుక నాలొ దీపించనీ
అహమును వంచనీ

Monday, May 20, 2019


రచన,స్వరకల్పన&గానం:రాఖీ

నీ పదముల రేణువు నేను
నా పదముల ప్రాణము నీవు
బాసరలో భాసిల్లే భగవతి
స్థిరపరచవే సంస్థితవై నామతి
భారతీ దయా జలధీ
నా ప్రతి గీతీ నీ అభినుతి

1.నా పలుకునకర్థము నీవే
నావాక్కున చక్కెర కావే
అక్కరముల అక్కెర ప్రియమై
చక్కని చిక్కని భావన నీవే
వాగీశ్వరీ కరుణా ఝరీ
నా జిహ్వ నీకవని కవనవని

2.నా గళమే కర్ణకఠోరం
చేయవె సత్వరమే మృదుమధురం
శ్రవణపేయమై శ్రావ్యగాత్రమై
దయసేయవె హృదయనాదం
సంగీత సామ్రాజ్ఞి కృపావర్షిణి
కలవాణి నా కలల ఫలదాయిని
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

మళ్ళీ బ్రతికొచ్చావని ఏసని భావించనా
ఫకీరులా గడిపావని మహ్మద్ వని ఎంచనా
పూజలు గొన్నావని ఈశుడవని సేవించనా
సాయీ నీ తత్వమె చిత్రమోయి
సాయీ నీ చరితమే పవిత్రమోయి
జయజయజయ జయసాయి-
సచ్చిదానందరూప సద్గురు సాయి

1.రోగాలను విభూతితో మాన్పే వైద్యుడవు
శోకాలను అనునయముతొ తీర్చే హితుడవు
జీవిత సత్యాలను బోధించే గురుడవు
భవజలధిని అవలీలగ దాటించే సరంగువు
సాయీ నీ తత్వమె చిత్రమోయి-సాయీ నీ చరితమే పవిత్రమోయి
జయజయజయ జయసాయి-సచ్చిదానందరూప సద్గురు సాయి

2.బంధాలు లేకున్నా మాకు బంధువైనావు
రాగద్వేష రహితుడవైనా మోహవశుడవైనావు
మాలోన ఒకడవుగా షిరిడీలో మసలినావు
మానవతను ఎరుక పరచి దైవమై నిలిచావు
సాయీ నీ తత్వమె చిత్రమోయి
సాయీ నీ చరితమే పవిత్రమోయి
జయజయజయ జయసాయి-
సచ్చిదానందరూప సద్గురు సాయి
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

రూపము గనినంత చూపరులకు భీకరము
చల్లనైన నీదృక్కులు సర్వదా శ్రీకరము
నీ దర్శన భాగ్యమే ఆనందకరము
భవభయ హారకము నీ అభయకరము
ధర్మపురీ నరహరీ నీకు వందనాలయా
మము దయజూడగ శ్రీ చందనాలయా

1.వైశాఖ శుద్ధ చతుర్ధశీ రోజున
గోధూళివేళ స్తంభమునందున
నీ శ్రీ హరిఏడీ ఢింబకా చూపుమని
హిరణ్యకశ్యపుడు గద్దించినంతనే
సర్వాంతర్యామివని చాటిచెప్పడానికి
ఉద్భవించినావు ప్రహ్లాదుని మొరవిని

2.శిరమేమో కేసరిగా నరశరీరధారిగా
ద్వారమే పీఠముగా ఆసీనుడవయ్యి
భీషణ దంష్ట్రలు వాడియౌ నఖములతో
ఊరువుల పైనా ఒక ఉదుటున వేసుకొని
ఉగ్ర నారసింహుడవై ఉదరమే చీల్చివేసి
దితి సుతుని హతమార్చి నీ భక్తుని బ్రోచితివి

3.గోదావరి తీరమున ధర్మపురీ క్షేత్రమున
శ్రీ లక్ష్మీ సహ యోగ నరసింహమూర్తిగా
వెలసినావు స్వామి నీ మహిమలు జూపగా
మలచినావు స్వామీ మా బ్రతుకులు నీవిగా
శేషప్పవరదుడవై శతకము రాయించితివి
రాఖీప్రియ సఖుడవై సతతము నువు కాచితివి
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

చలనం లేని శిలవైనావు
స్పందన ఎరుగని ఎదవైనావు
ఉలులెన్ని విరిగాయో నిను చెక్కలేక
కలలెన్ని కరిగాయో నువు కానరాక

1.అమావాశ్య బ్రతుకే నాది
తెల్లారని రేయి నాది
వేగుచుక్కలాగా తట్టిలేపుతావు
మలయమారుతానివై చుట్టుముట్టుతావు
ఎంతకూ పొద్దుపొడవదు
వింతగా లిప్తగడవదు
తూర్పు తలుపు తెరవకనే దినం గడచును
మేలుకొలుపు తెలియకనే నిద్ర కమ్మును

2.పరిచయాలె సరిగమలై
స్నేహితాలె పికగీతాలై
జీవితాన సంగీతం జలపాతమవ్వాలి
అనుభూతుల సుమగంధాలే విరజిమ్మాలి
నీచర్యలు చిత్రమైనవి
నీ చేష్టలు ఆత్రమైనవి
తప్పుకపోతుంటే నన్ను  సెలుకుతుంటావు
ముట్టుకోబోతుంటే నువు ముడుచుకుంటావు
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

నీ కాలిమువ్వనౌతా నే కాలి కాటుకనౌతా
నీ మోవినవ్వునౌతా నీ గుండె గువ్వనౌతా
నా హృదయ రాణీ నీ ఇంటి దివ్వె నౌతా
నా ప్రణయ దేవీ నీ పూజ పువ్వునౌతా

1.క్రీగంటి చూపుకే నేను పడిపోయాను
నీవొంటి స్పర్శకే వివశుడిని అయ్యాను
సోయగాలు తిలకిస్తూ నే సోలిపోయాను
నీ హొయలుకే తరిస్తూ మైమరచిపోయాను

అతిలోక సుందరీ బానిసగా మార్చావే
శతపుష్ప మంజరీ దాసునిగ జేసావే

2.నీ వాలు జడలోనా మిన్నాగు నాట్యాలు
నీకొంగుముడిలోనా భూలోక స్వర్గాలు
నీ నడుము వంపుల్లో ఇసుక మైదానాలు
నీ అడుగుజాడల్లో నవపారిజాతాలు

రసరమ్య వాహినీ మాయలేవొ చేసావు
జగదేక మోహిని మత్తులోన ముంచావు
రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

తీరదు ఋణము నను గన్న మా అమ్మది
తీరదు ఋణము నడిపించు మాయ'మ్మది

కడుపు చించి జన్మనిచ్చినందుకు
కడలి దాటించి దరిచేర్చునందుకు

1.స్తన్యమిచ్చి నా బొజ్జనింపింది
కంటికి రెప్పలా ననుకాచింది
తననోరుకట్టుకొని కోరినదిచ్చింది
కథలుచెప్పి జోలపాడి
నన్ను నిదురపుచ్చింది

నిస్వార్థపు సేవచేసి
ప్రేమగా పెంచింది
తనకుతాను మొత్తంగా
నాకే బ్రతుకు పంచింది

2.స్థిరమైన చిత్తముతో
చిత్ర పటము చూడలేదు
ఏకాగ్ర దృక్కులతో
తల్లి ప్రతిమ దాల్చలేదు
స్తోత్రాలు మంత్రాలతొ
అంబనుపూజించలేదు
మనసుపెట్టి ఎన్నడు
మాతను ధ్యానించలేదు

ఎందుకో జగజ్జననికి నాపై అనురాగం
ఏ పుణ్య విశేషమో
కవిగాయక ఘనయోగం

Sunday, May 19, 2019



చెప్పుకుంటె సిగ్గుచేటు
చెప్పకుంటె గుండె పోటు
మానవత అనాధగా తిరుగుతోంది
మాయువత మత్తులో జోగుతోంది
నా దేశ ప్రగతి ఆకాశవీథిలో
నా దేశ సంస్కృతి నడివీథిలో

1.ఎన్నికలే కల్లోలం నా ప్రజా స్వామ్యంలో
అధికారమె ప్రాథమ్యం రాజకీయమైకంలో
వ్యక్తిత్వం ఆత్మహత్య చేసుకుంటుంది
సిద్ధాంతం పట్టపగలు హత్యచేయ బడుతుంది
నా దేశ రాజ్యాంగం ఆదర్శప్రాయము
నా దేశ స్వాతంత్ర్యం అనిర్వచనీయము

2.నగ్నత్వం నగ్నంగా నాట్యమాడుతుంది
మృగత్వం పసికూనలననుభవిస్తుంటుంది
విలువల వలువలిచట చిరుగుల పేలికలు
కన్నవారి బంధాల్లో కాముకతల కతలు
నా దేశం ఉమ్మడి కుటుంబాలకాలవాలం
నా దేశం చిత్తకార్తి కుక్కల వ్యవహారం

3.విద్య భారతావనిలో చుక్కలుచూపెడుతోంది
మార్కులవేటలో మూర్ఖంగా నలుగుతోంది
వైద్యం విధిని విడిచి డబ్బులెక్క పెడుతోంది
నైపుణ్యం విదేశాల వెర్రిలో ఎదుగుతోంది
నా దేశం మేధావుల ఖజానా
నా దేశం స్వార్థానికి నమూనా

Wednesday, May 15, 2019

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

ద్వయరూపా దనుజారి నరకేసరి
జగతిలోన లేరెవరూ నీకు సరి
దుర్జన నిర్మూలన కంకణధారి
ధర్మపురి సంస్థిత హే చక్రధారి
కరములు మోడిచి శరణంటిమి స్వామి
కనికరమును జూపగ చరణాల వాలితిమి

1.ఉగ్ర యోగ రూపాలతొ వెలసినావు
అనుగ్రహము మాపైన కొనియున్నావు
నిత్యపూజలెన్నో అందుకొనుచున్నావు
నిరతము భక్తజనుల కాచుచున్నావు
కరములు మోడిచి శరణంటిమి స్వామి
కనికరమును జూపగ చరణాల వాలితిమి

2.జయంతోత్సవమును జయతుగ జరిపేము
చందనోత్సవమును కనువిందుగ చేసేము
డోలోత్సవాలు  సంబరాలె  ఏటేటా
వసంతోత్సవాలు ఆనందాలు మాకంట
కరములు మోడిచి శరణంటిమి స్వామి
కనికరమును జూపగ చరణాల వాలితిమి

Sunday, May 12, 2019

జయ జనని జయ జనని జయతు జగజ్జనని
జగతిని జనతతి నేలెడి జగదోద్ధారిణీ
జిజ్ఞాస కారిణి జన్మరాహిత్యదాయిని
జ్ఞాన సరస్వతి మాతా పరవిద్యా వరదాయిని ప్రణమామ్యహం

1.వాగ్గేయకార వాంఛిత పలదాయిని
సంగీతామృతధారా వర్షిణి
శృతి లయ భావ విస్తృత సంచారిణి
వీణాగాన వినోదిని మందస్మిత హాసిని
జ్ఞాన సరస్వతి మాతా పరవిద్యా వరదాయిని ప్రణమామ్యహం

2.సప్త చక్ర పరివేష్ఠిని యోగిని
సప్త స్వర విహారిణి రాగిణి
సప్తతాళ ఘోషణి ప్రణవరూపిణి
సప్త ఋషి సేవిని పారాయణి
జ్ఞాన సరస్వతి మాతా పరవిద్యా వరదాయిని ప్రణమామ్యహం

ఎందుకే కన్నీటి చినుకా- ఇంత ఆరాటం
నా కంటినుండి దుముకా-వింత పోరాటం
నా గుండె లోతులనుండి
నా గొంతు మలుపులనుండి
నా కనుల కొలుకులనుండి
కారిపోవగ-జారిపోవగ

1.ఎండి పోయిన ఏరులన్నీ- నిండి పారగా
ఇంకిపోయిన నదులన్నీ -వరదలై ఉప్పొంగగా
మిగిలిపోయిన నేలనంతా- కడలిలో కలిపేయగా
మనసుమాట మీరుతుంటూ-గుట్టు గట్టు తెంచుకొంటూ
కుంభవృష్టితొ ముంచివేయగ-ఉప్పెనల్లే ఊడ్చివేయగ

2.పెదవిమాటున నొక్కి పెట్టా బాధనంతా
నవ్వుచాటున దాచిఉంచా వేదనంతా
కవితల జలతారుముసుగే వేసా బ్రతుకంతా
మిన్నుకే చిల్లు పడినట్టు-కన్నుకే గాయమైనట్టు
నీటిబదులుగ నెత్తురొస్తూ- రెప్పలను తోసివేస్తూ
అమ్మంటే ఆర్ద్రత
అమ్మంటేనే మమత
అమ్మంటే త్యాగశీలత
అమ్మేగా ఇలలో  దేవత

1.అమ్మంటే అంతులేని ఆప్యాయత
అమ్మంటే కొలవలేని కారుణ్యత
అమంటేనే  ఎనలేని బాధ్యత
అమ్మేగా అమ్మకు  సారూప్యత

2.అమ్మంటే లాలించే ఒడి
అమ్మంటే తొలుదొల్త బడి
అమ్మతావు అనురాగపుగుడి
అమ్మేగా వీడని కన్నప్రేగు ముడి

3. అమ్మంటే తీర్చలేని ఋణం
అమ్మంటే తెంచలేని బంధం
అమ్మంటే స్నేహసుగంధం
అమ్మేగా మన మనుగడకర్థం 

Friday, May 10, 2019

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

చిత్రమైన తత్వం నీది
తత్వమున్న రూపంనీది
భిన్నమైన అస్తిత్వం నీది
ధన్యమాయే నినుగని జన్మే నాది
భోలా శంకరా-భక్తవశంకరా
లయకారాహర-ప్రళయభయంకరా

1.కంటిలోన కాల్చెడి మంట
తలమీద ఆర్పెడి గంగంట
గొంతులోన కాలకూట విషమంట
శిరమందు శీతల సుధాంశుడంట

2.మహాకాయగణపతికి మూషకము
బాలసుబ్రహ్మణ్యానికి మయూరము
జంగమయ్య నీ వాహనం నందియట
జగదంబ మా గౌరమ్మకు కేసరియట

3.ఎలుకను మ్రింగే నాగులె నగలు
పాములు జడిసే నెమలికి నెలవు
ఎద్దుని చంపే సింహానికి తావు
అన్నీ ఒకేచోట మనేలా చేస్తావు

4.తైతక్క లాడుతావు
తపస్సులూ చేస్తావు
ఇల్లిల్లూ బిచ్చమెత్తుతావు
అడిగినదేదైనా ఇచ్చేస్తావు

Thursday, May 9, 2019

నీకు సాటి ఎవరయా వేంకట రమణా
కలియుగదైవమీవె కరుణాభరణా
మొక్కులు ముడుపులు తలనీలాలు
లెక్కకు మిక్కిలిగా భక్తులు తండోపతండాలు
ఏడుకొండలవాడా గోవిందా గోవిందా
వడ్డికాసులవాడా గోవిందాగోవిందా

1.పాదచారులౌతారు సప్తగిరులనెక్కుటకై
పడిగాపులు పడతారు నీ  దర్శనానికోసమై
పిల్లాపాపలతో వస్తారు నీ కృపకొరకై
చల్లగచూడమని వేడుతారు నమ్మికతో
ఏడుకొండలవాడా గోవిందా గోవిందా
వడ్డికాసులవాడా గోవిందాగోవిందా

2.పాపాలు తొలగించగ పాపనాశనం
పుణ్యాలనందగ ఆకాశగంగాస్నానం
తిరుమల వీథులే అపర వైకుంఠం
సిరులను కురిపించగ మంగాపట్నం
ఏడుకొండలవాడా గోవిందా గోవిందా
వడ్డికాసులవాడా గోవిందాగోవిందా

అమ్మ అనే మాట ఎంత విలువైనది
అమ్మ ఉన్నచోటి బ్రతుకు సులువైనది
అమ్మ ఎడద ఎంతటి విశాలమైనది
జనమంతా బిడ్డలుగా భావించగలుగునంతటిది
అమ్మంటే అనురాగమూర్తిరా
ప్రేమపంచడానికి అమ్మనే స్ఫూర్తిరా

1.ఆకలేసినప్పుడల్లా అమ్మతలపుకొస్తుంది
దిక్కుతోచనప్పుడల్లా అమ్మగురుతుకొస్తుంది
దెబ్బతాకినప్పుడూ అమ్మాఅని అరిచేము
నొప్పితాళనప్పుడూ అమ్మనే పిలిచేము
అమ్మంటే ఆదుకొనే ఆత్మబంధువు
అమ్మంటే  అంతేలేని అమృత సింధువు

2.చందమామనైనా నేలకు దింపుతుంది
గోరుముద్దలోనా మమత కలిపిపెడుతుంది
కథలెన్నొచెప్పుతూ బ్రతుకు బోధచేస్తుంది
హాయిగొలుపు జోలపాడి నిదురపుచ్చుతుంది
అమ్మ పేగు పంచుకొన్న బంధమురా
సకలజీవరాశుల్లో అమ్మ అద్భుతమ్మురా

3.రాసి రాసి కలం సిరా ఇంకిపోయినా
గుట్టలుగా పుస్తకాల రాశి మారినా
సృష్టిలోని ఘనకవులే ప్రతిభచూపినా
అమ్మ కవన వస్తువుగా అసంపూర్ణమే
అమ్మంటే కమ్మనైన భావనరా
అమ్మంటే దివ్యమైన దీవెనరా
గల గల పారుతోంది సెలయేరు
కళకళలాడుతోంది మన ఊరు
స్వచ్ఛనైన  జలాలతో
పచ్చనైన  పొలాలతో
రారా నేస్తం ఈతలు కొడదాం
సరదాసరదాగా చేపలు పడదాం

వేసవి సెలవులు ఆనందంగా
ఆటల పాటల గడిపేద్దాం
రెక్కలు సాచిన పక్షుల్లాగా
గగనపు వీథుల విహరిద్దాం
రారానేస్తం దోస్తీ చేద్దాం
సరదాసరదాగా కుస్తీ పడదాం

తోటమాలి గన్నుగప్పి
మామిడికాయలు కోద్దాం
మనని పట్టుకోను వస్తే
పరుగులు పెడదాం
దొరికిదొకటైనా పంచుకుందాం
కాకెంగిలి చేసైనా కమ్మగ తిందాం

చెట్టు చెట్టు పైనా
కోతికొమ్మలాడుదాం
పిట్టపిట్టతోనూ
కబురులు చెబుదాం
రారా నేస్తం కోయిలతో పోటీపడదాం
సరదాసరదాగా జాబిలితో జట్టే కడదాం


నా పుట్టుక కర్థమేమిటో
నా జన్మకు పరమార్థమేమిటో
ఎరిగించరా షిరిడిసాయీ
భవజలధిని వేగమె దాటించవోయీ
నా జన్మదినమున తీర్చరా వేదన
నామనసే నీకు  సాయీ నివేదన

1.అడగనిదే ఇచ్చావు ఎన్నో
అడుగడుగున తోడై నిలిచావు
అందలాలనెక్కించావు
అంతలోనె నిర్దయగా పడద్రోసావు
నా జన్మదినాన తీర్చరా వేదన
నామనసే నీకు  సాయీ నివేదన

2.ఎంతమందికో నీవు మహిమలు చూపావు
మరెందమందికో ఆత్మ బంధువైనావు
సడలని విశ్వాసమే ఉన్నది
నను అక్కున జేర్చుకుంటావన్నది
నా జన్మదినాన తీర్చరా వేదన
నామనసే నీకు  సాయీ నివేదన

నా పలుకుల్లో సుధలొలికే జనని
నా కవితల్లో ప్రభవించే తల్లీ
నా పాటకే ప్రాణమైన మాతా
ఏజన్మలోని పుణ్య ఫలమో
ఏకర్మలోని దివ్య బలమో
నన్నాదరించితివే సరస్వతి
నను అక్కునజేర్చుకుంటివే వాణి
ఎలానిన్ను కీర్తించనూ ఏ వరములనర్థించనూ
నమోనమో భారతీ నమోస్తుతే భగవతీ

1.చదువలేదు ఏనాడు ప్రాచ్యకళాశాలలో
పట్టాలు పొందలేదు సాహిత్య శాస్త్రములో
ఛందస్సు వ్యాకరణం చెలగి నేర్వనేలేదు
భాష పట్ల బహువిధముల కృషి సల్పలేదు

ఏ తొలి ఉషస్సులో నీ దృక్కులు ప్రసరించెనో
ఏ శుభ ఘడియలో నీ వాక్కులు ఫలియించెనో

నను కరుణించితివే వేదమయీ
నను దయజూసితివే నాదమయీ
ఎలానిన్ను కీర్తించనూ ఏవరములనర్థించనూ
నమోనమో భారతీ నమోస్తుతే భగవతీ

2.స్వరముల సంగతే ఎరిగింది లేదు
శృతిలయ సూత్రాలు తెలియగలేదు
రాగతాళాలను సాధన చేయలేదు
వాగ్గేయకారుల కృతులను వినలేదు

అమ్మలాలి పాటలోని హాయి ఎదను కదిపిందో
కోయిల గొంతులోని మధురిమ నను కుదిపిందో

నను కృపజూసితివే పాట పల్లవింపజేసి
నా తలనిమిరితివే మనోధర్మ రీతిగఱపి
ఎలానిన్ను కీర్తించనూ ఏవరములనర్థించనూ
నమోనమో భారతీ నమోస్తుతే భగవతీ

Thursday, May 2, 2019

కన్న ప్రేమ ఎవరికైన ఒకటే
ఆ ప్రేమముందు దైవమైన దిగదుడుపే
కడుపు ప్రేగు బంధము తెగదు జీవితాంతము
స్వంత రక్తపాశము వెంటాడును సాంతము

1.నలుగు పిండి బొమ్మచేసి మురిసె పార్వతి
కరిశిరమును పొందివెలిసె సిద్ధి గణపతి
తండ్రి ప్రేమ ఎంతటిదో తొలివేల్పుగ నుడివె పశుపతి
సుబ్రమణ్యస్వామిని చేసే దేవసేనాపతి

2.పుత్రప్రేమ పరాకాష్ఠ తార్కాణం దశరథుడు
కనకున్నా ప్రేమపంచె యశోదానందులు
గతములోన ఎన్ని లేవు కడుపుతీపి కథనాలు
నా సుతుడిని కరుణించగ ఏలమీనమేషాలు

Wednesday, May 1, 2019

ఇచ్చిన పండుతోనె కడుపు నింపుకో
ఇదే ప్రసాదమనుకొని కళ్ళకద్దుకో
దైవాన్ని ప్రశ్నించగ నీ అర్హతేమిటి
విధినే నిలదీయగ నీ ప్రజ్ఞ ఏపాటిది

1.వికృతంగ నీకు ఆకారమిచ్చినా
వక్రబుద్ది నీలోన కలిగించినా
వీథుల్లో తిరిగులాగ అనాథనే చేసినా
క్షుద్బాధ తాళలేని దొంగగ నిను మార్చినా
దైవాన్ని నిందించగ నీసుకృత మేపాటిది
విధిని తూలనాడగనీ పుణ్యశేష మెంతటిది

2.కష్టాలు మూకుమ్మడి దాడి చేసినా
మానలేని రోగాలు ఎంతగ పీడించినా
ఋణ బాధలు కరుణమాని కలచివేసినా
లోకమంత ఏకమై నీపై పగబూనినా
దైవం దయజూడగ నీ నమ్మిక ఎంతటిది
విధినీకు వరమీయగ నీవినతులు ఏపాటివి

3.మునులవోలె తీవ్రమైన తపస్సులే చేసావా
ఋషులతీరు యజ్ఞయాగ హవిస్సులే వేసావా
రావణబ్రహ్మ లాగ రుద్రవీణ మీటావా
శబరిలాగ ఏళ్ళకేళ్ళు వేచివేచి చూసావా
అంతటివారికే తప్పలేదు తిప్పలు
ఎంతటివారికైన విధివింత పరీక్షలు
మనసు ఏ మూలల్లోనో-గుండె ఏ లోతుల్లోనో
దాగి ఉంటుంది మానవత్వము-
మిగిలి ఉంటుంది ప్రేమతత్వము
మనిషివనే సంగతి మరచి మనబోకు నేస్తమా
మూడునాళ్ళ జీవితానికి సార్థకతను కూర్చుమా

1.ఏదో ఒక దృశ్యం నిన్ను కదిలించక మానదు
ఏదో ఒక కవనం నిన్ను మేల్కొలుపక సాగదు
బండరాళ్ళు సైతం కరుగుతాయి సంగీతానికి
లోకమంత క్షామమైనా కరువుండదు కంటనీటికి
మనిషివనే సంగతి మరచి మనబోకు నేస్తమా
మూడునాళ్ళ జీవితానికి సార్థకతను కూర్చుమా

2.గోచైనా లేకుండా వచ్చాము ఇలాతలానికి
చిల్లికాసునైనా కొనిపోము మనతో స్వర్గానికి
ఉన్నదాంట్లొ ఎంతోకొంత సాయపడితె సంతృప్తి
చేదోడువాదోడై ధైర్యమిస్తె తరగదు ఆస్తి
మనిషివనే సంగతి మరచి మనబోకు నేస్తమా
మూడునాళ్ళ జీవితానికి సార్థకతను కూర్చుమా

3.అరిషడ్వర్గాలలో లోభమే కడు హీనం
పదితరాలసంపద ఉన్నా చేయబోము చిరుదానం
నేత్రమూ రక్తమూ ఏదైనా వితరణయే
చితిలొ కాలు అవయవాలు వదాన్యతకు అర్హమైనవే
బలి శిభి దధీచి కర్ణులు దాతృత్వ శ్రేష్ఠులు
లేదనక కోరిన దిచ్చిన ఆదర్శప్రాయులు

ప్రేమికులరోజు శుభాభినందనలతో...

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

ఇది ప్రేమికుల రోజు
ఇదంటేనే ప్రేయసీ ప్రియులకు మోజు
తెలుసుకుంటారు పరస్పరం మనసులను
గెలుచుకుంటారు నమ్మకము ప్రేమలను

1.అనురాగం నోచని హృదయం అర్రులు చాస్తుంది
మూసుకున్న తలుపులను ఆతృతగా తీస్తుంది
చిన్న పలకరింపుకే పులకరించి పోతుంది
చిరు స్పర్శకైనా పరవశించి పోతుంది
వలపు వలలో పడినా ప్రేమికులకు అది మోదం
ఎదుటివారి ప్రతి ప్రతిపాదన మదికి ఆమోదం

2.త్యాగమే ఆయుధమై విజయాలనందిస్తుంది
చెలిమి తను అంకితమై కాలాన్ని బంధిస్తుంది
కోరింది కాదనకా కానుకలతో మురిపిస్తుంది
అడిగింది వద్దనకా దేహాలను మరిపిస్తుంది
ఆకర్షణ మత్తులో విచక్షణే నశియిస్తుంది
సాహసమే ప్రభవించి తెగువ వెలుగు చూస్తుంది