Saturday, May 15, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:భీంపలాస్


కైలాసనాయకా కైవల్యదాయకా

కైమోడ్పులివి నీకే కైంకర్యము నా బ్రతుకే


1. కైరవమే ననుకానీ నీకై చేసే అర్చనలో

కైవారము సేయనీ నాకైతల గుఛ్ఛముతో

కైరవై కురియనీ నీ శీతల దృక్కులు నాపై

కైవశమైతిని శివా నీ భక్తిసుధే నాకు కైపై


2.కైశికమందు గంగ కావించనీ నను పునీతం

కైలాటకమాయే స్వామి నా జీవిత నాటకం

కైటభవైరి సఖా హరహరా ననుగావర తక్షణం

కైతవాలు వెతకకిక శరణం శరణం నీ దివ్య చరణం

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:నీలాంబరి


మహాదేవా పరమశివా

మహాకాలకాల భక్తపాలా

మహామృత్యుంజయా నమోస్తు అవ్యయా

నటరాజా రాజరాజేశ్వరా నమామి ఈశ్వరా


1.భవా భవానీధవా ఆత్మసంభవా విభవ

వామదేవా కాకోలగ్రీవా ఖరువా భార్గవా

రుద్రా వీరభద్రా విరూపాక్షా నమోస్తుకాలాభైరవా

కపర్ది కామారి త్రిపురారి నమామి శంభో సాంబశివా


2.రాజరాజేశ్వరీ వరా హరా భక్తవశంకరా

నగరేశ్వరా స్థిరా వేములాడ భీమేశ్వరా

గంగాధరా చంద్రమౌళీశ్వరా నమోస్తు బాలేశ్వరా

వృషభ వాహనా విషకంధరా నమామి విశ్వేశ్వరా౹

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నిను తలవని క్షణమే లేదు

నిను కలవక బ్రతుకే చేదు

పెంచిపోషిస్తున్నా నీ ప్రేమ పాదు

వస్తే రానీ నా మీద అపవాదు


1.గాలివాటుగా పరిచయమైనాము

ఏటవాలుగా పయనిస్తున్నాము

కాలం కట్టింది మన మధ్యన వారధి

దైవం వరమిచ్చింది స్నేహమనే పెన్నిధి


2.ఏదో కావాలని ఎదకు ఉబలాటం

చెప్పడానికెంతగానో నాకు మొహమాటం

చెప్పలేక చెప్పలేక ఎప్పుడూ ఆరాటం

నీతో చెలిమి  వయసుకు మనసుతొ చెలగాటం

 కన్నుల కురిసెను వర్షం

పెదవుల విరిసెను హర్షం

జీవితాన ప్రతి నిమిషం

ఆనందామృతం విషాద సంయుతం


1.కరోనా అంటినందుకు దుఃఖం

గండం గడిచినందుకు ప్రశాంతం

వ్యాక్సిన్ దొరికినందుకు మోదం

మరోసారి వేయనందుకు ఖేదం


2.దిన దినం క్షణక్షణం కరోనా భయం

ఎప్పుడు కడతేరుతుందో అయోమయం

రాకతప్పదను మాటే అందరికీ ఖాయం

బతికి బట్టకట్టామా అది అంతిమ విజయం

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


గోరుచుట్టు ఒక బాధ

రోకటిపోటదే గోటిపై ఎంతటి బాధ

పుండువల్లనే ఎంతో నొప్పి

పుండుమీద పుట్రవల్ల ఇంకెంత నొప్పి

కరోనా కాటుతోటె చేటనుకుంటే

నల్లబూజు(బ్లాక్ ఫంగస్)మోపై

కబళించసాగె వెనువెంటే


1.పరిసరాలనన్ని పాడుచేసిన పాపం

పర్యావరణానికే కీడు చేసిన దోషం

జీవవైవిధ్యానికే హానిచేసిన నేరం

ప్రకృతే ప్రకోపించినా విపత్తులే విరుచుక పడినా

గుణపాఠాలే నేర్వం మానవులెవరం మారం


2.తమదాకా వస్తుందా అన్న నిర్లిప్తత

మొక్కబడిగా పాటించే తూతూ జాగ్రత్త

కనీసమైనా పట్టింపులేని జాగరూకత

తెగేదాక లాగుతూ తెగిందంటే వెక్కుతూ

నెత్తినోరుకొట్టుకుంటాం,దీనంగా మొత్తుకుంటాం

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


శుభోదయం నేస్తమా ప్రియనేస్తమా

నీ నిలువెల్లా సుప్రభాతం ప్రాప్తమా

నిదురలేచు శుభవేళ ఎదురుగా నీ మోమే

అదిరిపాటు చెందేలా నా మోవితొ నీమోవే

శుభోదయం రసోదయం హసోదయం


1.నీలికురుల మబ్బుల మధ్యన

పారాడే పాపిట బిళ్ళనే ప్రత్యూషం

కనుబొమల కనుమల నడుమన

వెలిగే సిందూర తిలకం రవిలా విశేషం

అధరసుధా సాగరాన అలలపై తేలే

నవ్వుల కిరణాలతో హర్షోదయం

శుభోదయం రసోదయం హసోదయం


2.తలకునీళ్ళోసుకుని ఒడుపుగా విదిలిస్తే

నా ఒళ్ళుఒళ్ళంతా తుషారోదయం

కావాలనిలేదంటూ కావలించుకుంటుంటే

పొద్దంతా హద్దులుదాటే పరవశోదయం

మనసెరిగిన ఆలిచేసే చిలిపి అల్లరులే

ఉవ్వెత్తు ఉత్తేజంతో ఉల్లాన ఉల్లాసోదయం

శుభోదయం రసోదయం హసోదయం



శిష్ట రక్షకా దుష్టశిక్షకా కలియుగ వరదా

దీనబాంధవా ప్రేమ సింధువా ఆర్తత్రాణబిరుదా

ఎందుకు నీమౌనం దేనికి నీజాప్యం

పంచాయుధ పాణీ కరోనా అల్ప ప్రాణి

అంతమొందించవేమి గోవిందా నమోనమామి


1.వాడి వాడి వాడి వీడెనా  సుదర్శనానిది

ఊదిఊది నెర్రెవాసెనా పాంచజన్యానిది

చిలుంపట్టి బలం తగ్గెనా కౌమోదకిది

వధించగ పదను ఒగ్గెనా నందకానిది

ఎక్కిడగ పటిమ ఉడిగెనా సారంగానిది

పంచాయుధ పాణీ కరోనా అల్ప ప్రాణి

అంతమొందించవేమి గోవిందా నమోనమామి


2.గజేంద్రమోక్షగాథ నెరనమ్మియున్నాము

ప్రహ్లాదు గాచిన చరిత్రనే విశ్వసించుచున్నాము

ద్రౌపదీ మానసంరక్షణ కథవినియున్నాము

ధ్రువుడిని సరగున బ్రోచినగతి నెరిగినాము

నీ ఉనికే కల్పనయని భావించకున్నాము

పంచాయుధ పాణీ కరోనా అల్ప ప్రాణి

అంతమొందించవేమి గోవిందా నమోనమామి