Saturday, March 28, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

సాడేసాత్ శని నిన్నూ పట్టబోతుంటేనూ
మఱ్ఱిచెట్టు తొర్ర లో సొర్రలేదా
భస్మాసురుడు నెత్తిమీద సెయ్యిబెట్టబోతేనూ
హరినే శరణుకోరి బచాయించలేదా
మంచుకొండదప్ప మంచి ఇల్లైనా లేదాయే
వల్లకాడెగాని  చిన్న గుడిసైనా లేదాయే
పైలంరా శంకరా అంటురోగమంటరా నావల్ కరోనా
భద్రంరా ఈశ్వరా ఇలాజ్ లేదంటరా మానవ లోకానా
సల్లంగ బతికుంటే శివరాత్రికి మల్ల శ్రీశైల మొచ్చేము
నూకలు బాకుంటె కోడెనుగట్ట మేము ఎములాడకొచ్చెము

1.కనివిని ఎరుగని కాలనేమి ఇదిరా కాలకాలుడా
నీ ఆనతివినని పెను భూతమేనురా భూతనాథుడా
జాతరలంటూ తిరిగుతూ ఆడికీ ఈడికీ  పోబోకు
భక్తులవెంట బడి పానాలకే ముప్పు తెచ్చుకోకు
పైలంరా శంకరా అంటురోగమంటరా నావల్ కరోనా
భద్రంరా ఈశ్వరా ఇలాజ్ లేదంటరా మానవ లోకానా

2.సల్లబడ్డదేమో సంపనీకి నీకన్ను ముక్కంటీ
శిలుంబట్టిందేమొ పొడవనీకి శూలం శూలపాణీ
వైద్యనాథడువైననూ నీకే అంతువట్టకుంది ఈ మొండిజీవి
గరళకంఠుడవైన నీవే హరించలేనిదాయె ఈ వ్యాధీ
దిక్కులకే రారాజువు నీకే దిక్కులేదు మమ్మెట్లకాచేవు
యుమునికే గురుడవు నీకే సక్కిలేదు మమ్మెట్ల సాకేవు
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

అరె ఏం జెప్పుడ్రబై మన పబ్లిక్కు
దీన్ని సౌరగజేసుడెంత సిక్కు
నెత్తినోరుగొట్టుకుంటు మొత్తకున్నగాని పట్టించుకుంటే ఒట్టు
ఖుల్లం ఖుల్లజేసి ముంగట్లవెట్టినా ఎక్కదేందిరో గీ కరోనా గుట్టు

1.కాళ్ళుమొక్కిజెప్పినా ఖాతరే జేయరాయె
దండవెట్టిజెప్పినా మొండిగా వినరాయే
దందాలన్ని బందువెట్టి ఇంటికాడ ఉండమంటే
లెక్కజేయకుండ ఇంక సడకు మీద్కి రావట్రి
సబ్బువెట్టి సెయ్యితోమి సచ్చంగా ఉండమంటే
ఏదివడ్తె అదిముట్టి కంపుకంపు జేయవట్రి

2.టీవీల్లల్ల జూపినా సింతాకంత సింతలేదు
మైకువెట్టి జెప్పినా మంచిగైతె ఇనుడెలేదు
దగ్గు తుమ్ము ఏదొచ్చిన మూతిమూసుకోమంటే
నాకేమైతదంటు  పర్వజేసుడె లేదాయే
గజమంత దూరముండి పన్లు సక్కవెట్టమంటె
మీదమీద వడుకుంటూ రాస్కపూస్క తిరుగుడాయె
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

రాగం:మాయామాళవగౌళ

అనివార్యం మనిషికి మరణం
అర్ధాంతరమైతేనే అది దారుణం
ఇంటినిలిచి గెలిచేటిదీ రణం
మించిపోనీకు కరోనానరికట్టే తరుణం
బుద్ధి లేక వెధవలై గుంపులుగా గుమిగూడనేలా
మీరూ గుర్తించలేని మీలోని వైరస్ను పరులకంటించనేలా

1.దేశాధినేతలే పబ్బతులిడి చెప్పినా
ప్రపంచమంతా బెదురుతు గడగడలాడినా
వార్తల్లో కళ్ళముందు వ్యాధి వ్యాప్తి ఎరుకైనా
టీకా చికిత్సలూ లేనే లేవని తెలిసినా
బుద్ధి లేక వెధవలై గుంపులుగా గుమిగూడనేలా
మీరూ గుర్తించలేని మీలోని వైరస్ను పరులకంటించనేలా

2.మిమ్మల్ని చేయమన్న దేశ సేవ ఏమిటని
మిమ్మల్ని కోరుతున్న త్యాగం ఏపాటిదని
అంటకమెంటక శుభ్రత పాటించడమేగా
కుటుంబ సభ్యులతో ఇంటగడపమనేగా
బుద్ధి లేక వెధవల్లా గుంపులుగా గుమిగూడనేలా
మీరూ గుర్తించలేని మీలోని వైరస్ను పరులకంటించనేలా