Thursday, October 13, 2011



అమ్మా నీకు జోహారు!అమ్మా నీ వెతలెప్పుడు తీరు?


అమ్మ మనసు-ఎవరికి తెలుసు
అమ్మంటె అందరికీ ఎందుకింత అలుసు
నవ్వుతునవమాసాలు మోస్తుందనా
నెత్తురునే దారబోసి పాలిస్తుందనా

1. కడలిలోతు సైతం కనుగొన్నారెందరో
విశ్వరచననైనా తెలుపగలిగిరెందరో
గగనాంతర సీమల మర్మమెరిగిరెందరో
అమ్మ ఆంతర్యమే అంతుచిక్క దవనిలో

2. గుండెలపై తన్నినా ఎదకు హత్తుకొంటుంది
ఆకలిపై అలకొద్దని బుజ్జగించి పెడుతుంది
తప్పులెన్నిచేసినా వెనకవేసుకొస్తుంది
తలతాకట్టుపెట్టి గండం గట్టెక్కిస్తుంది

3. కడుపున బుట్టిన బొట్టె పట్టించుకోకున్న
నట్టేట పుట్టి ముంచు మేబుట్టువులున్నా
లోకమంత ఒక్కటై తనకు ఎదురుతిరిగినా
సంతతె సర్వస్వమనే వెర్రిది అమ్మా