Thursday, October 20, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ప్రియమగు వచనములే నను పలుకనీ

నయమగు రచనములే నను చేయనీ

సూనృతమో అనృతమో అన్యులకది

అమృతమై తోచనీ

హితకరమో ముఖప్రీతికరమో ప్రతిమది

ముదమెందనీ

వాగధీశా అవతారపురుషా 

వానరేశా వందే ఈశ్వరాంశా


1.మహా బలుడవే నీవు నీ శక్తి నెరుగవే

రామనామ పిపాసుడవే యుక్తులెరుగవే

రామపాద సేవకుడవే మరే ముక్తినీ కోరవే

నీ నిజ భక్తుడిగ భజనానురక్తుడిగ నను మారనీ


2.అహంకారము మత్సరాలే తలభారము

మనో వికారము స్వామీ నాకవనీ దూరము

పరోపకారము అలవడగ అందించు సహకారము 

పదిమందితో కలిసి చేరనీ పరమానంద తీరము

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఔదుంబర ఫల* తత్వం

ఆణిముత్యాల సత్యం

వికాసానికేదైనా అకృత్యం

యథాతథ యధార్థమే వాంఛితార్థం


1.ఆత్మన్యూనతే బ్రహ్మపదార్థం

అహంభావమైతే అత్యంత వ్యర్థం

ఎరగాలి అంతరంగ అంతరార్థం

ఎదగాలి సార్థకంగ జీవిత పరమార్థం


2.వినియోగపరచాలి ప్రతిభను

వికసింపజేయగా మనలో ప్రభను

అలరింపజేయాలి రసికుల సభను

ఆహ్లాద పరచగ అభిమానుల ఎదను


*ఔదుంబరఫలం=మేడిపండు