రథ సప్తమి శుభాకాంక్షలు
https://youtu.be/j2-GG8dFazI?si=4n4WuCuy0l_QR2E-
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
రాగం:ఉదయ రవి చంద్రిక
ఉదయాద్రి మీయమ్మ గర్భాన ఆవిర్భవించి
ఉషఃశ్రీ నీ తోబుట్టుతో చెట్ట పట్టాలు చేబట్టి
గోదారిగంగలో మునకలేసి తానాలు చేసి
చెట్లంట పుట్లంట వరిచేలు గట్లంట ఆటలాడి
పుడమితో మైత్రి సలిపెడి మిత్రుడా పవిత్రుడా వందనం
లోకులెల్లరికి నిజ బాంధవుడవైన భాస్కరా నమస్కారం
1.ప్రాణవాయువు నొసగు ప్రాణదాతవు నీవు
చీకటులు పరిమార్చు కాంతి రూపుడవు
నీటి వలయ చలన నిత్య నిర్ణేతవు నీవు
గ్రహగతుల క్రమతకు కేంద్ర బిందువువు
పుడమితో మైత్రి సలిపెడి మిత్రుడా పవిత్రుడా వందనం
లోకులెల్లరికి నిజ బాంధవుడవైన భాస్కరా నమస్కారం
2.అవిరళ ప్రజ్వలిత శక్తి స్వరూపుడవు
అనంతానంత కాలాల సాక్షీభూతుడవు
కులాతీత మతాతీత మానవతా నేతవు
విశాల విశ్వసీమ నరజాతి విలాసమీవు
పుడమితో మైత్రి సలిపెడి మిత్రుడా పవిత్రుడా వందనం
లోకులెల్లరికి నిజ బాంధవుడవైన భాస్కరా నమస్కారం