Saturday, May 2, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

మోయబోకు విరహాన్ని ఎంతో భారం
సైచమాకు ఎడబాటు ఎంతటి ఘోరం
త్రుంచగ నేనున్నా ప్రతీక్షనే నెచ్చెలీ
మురిపించెద  దరిజేరీ రాసకేళి

1.సీతలాగ వీడిపోకు లేడి కోరి గీతదాటి
రాధలాగ బాధపడకు రోజంతా ఎదురుచూసి
నీ ఎదలోకి తొంగి చూడు కనిపించెదనే
నీతలపులు తట్టిచూడు ఏతెంచెదనే

2.చేరలేని రవిని కాను కమలమా నే కవిని
పున్నమి శశిని కాను చకోరమా నేనే కైరవిని
నా గుండెలొ దేవతగా కొలువుండవే
నా బ్రతుకున కర్థమై వెలుగొందవే
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

అందరం పోయేది తప్పక స్వర్గానికే
బ్రతుకును మించిన నరకం మరొకటి లేనందుకే
రౌరవాది దండనలు అష్టావింశతి
అనునిత్యం యాతనలు అనంతకోటి

1.సప్తవ్యసనాలు అష్టకష్టాలు
నవగ్రహ పీడనలు దశ దారుణాలు
అడుగుతీసి అడుగువేస్తె కందకాలు
అలవాటై పోయాయి దినదిన గండాలు

2.అవమానాలు అసూయా ద్వేషాలు
నమ్మితె మునిగేటి ఘరానా మోసాలు
మందూ మాకే లేని వింత మొండి రోగాలు
కల్తీమయ వస్తువులు కలుషిత దేహాలు
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

ఓటమి నొప్పని వీరులం
పోరాటాల్లో యోధులం
ఎదురొస్తేనేం  మరణం
ఎదిరించడమే మా గుణం

1.విశ్వంలోనే బుద్ధిజీవులం
రోదసికంతకు మేధావులం
ఐక్యత గలిగిన మానవులం
ఆధిపత్యం సాధించిన నరులం

2.విపత్తులనే అధిగమించాం
వ్యాధులనే తుదముట్టించేసాం
సృష్టికి ప్రతి సృష్టిని చేసాం
గుట్టులెన్నిటినొ విప్పిచెప్పాం

3.కరోనాపై సమరాన లౌక్యం
చాకచక్యమె మాకు ముఖ్యం
తప్పుకొంటూ తప్పించేస్తాం
అంటువ్యాధికి మంటబెడతాం
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

పుట్టిన ఊరికీ దూరమైపోయి
చుట్టపక్కాలనింక వీడిపోయి
పొట్టచేత పట్టుకోని ఏ దరికి చేరినావో
తట్టనెత్తికెత్తుకొనీ ఏ పనికి కుదిరినావో
వలసకూలీ తమ్ముడా -దినసరి కూలీకే నీ బ్రతుకమ్ముడాయే

1.రెక్కాడితె గానీ డొక్కాడదాయే
నిలువ నీడైనా నీకిక కరువాయే
పిల్లాపాలతో ఎండావానలలో
రోడ్డుపక్క జీవితమాయే-జీవితమే రోడ్డుపాలాయే
వలసకూలీ తమ్ముడా -దినసరి కూలీకే నీ బ్రతుకమ్ముడాయే

2.బ్రతుకునకు ఏమాత్రం భరోసాలేదు
భవితకైన కనీస భద్రత లేదు
పనిదొరకనివేళలో బ్రతుకు ప్రశ్నార్థకమే
అనుకోని విపత్తులందు అతలాకుతలమే
వలసకూలీ తమ్ముడా -దినసరి కూలీకే నీ బ్రతుకమ్ముడాయే

3.పుండు మీద పుట్రలాగ కరోనా కఱవసాగె
ఆత్మాభిమానమేమొ వీథులపాలాయే
దారితెన్ను గనలేక సొంతూరికి పయనమాయే
నడిచి నడిచి త్రోవతెగక కాళ్ళు రేగాళ్ళాయే
వలసకూలీ తమ్ముడా -దినసరి కూలీకే నీ బ్రతుకమ్ముడాయే