Tuesday, June 29, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఏమవ్వగలను నేస్తమా 

బంధాలకతీతమై నీకు నేనౌతా సర్వం సహా

ఏమివ్వగలను మిత్రమా 

నేనే నీవైపోయిన నీకు -నిన్ను నేనుగా మినహా


1.నీవుగా కోరింది ఇప్పటికి నెరవేరంది

మనసారా నువు బాగా మెచ్చింది -ఇంకా ఏముంది

నావద్ద దాచుకుంది నాకెంతో నచ్చేది

నన్నిమ్మని అడిగింది నీవేకదా అది -నిన్ను నీకా ఇచ్చేది

ఖరీదెవరు కట్టలేంది అమూల్యమే అది నీకు నా బహుమతి


2.దూరంగా ఉన్నాగాని ఒకే ఒరలొ కత్తులం

పరస్పరం ప్రభావంతో సాహితీ పాన మత్తులం-కవన చిత్తులం

చేరువగా భావాలున్నా చేరలేని తీరాలం

తలపులతో తలమునకలయే పావురాలం-స్నేహగోపురాలం

సృష్టిలో తీయనిది ఎన్నటికి తరగనిది చెలిమి నీకు  కానుక

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నా అంతరాత్మవు నీవు

నామేధలో  పార్వతీ మాతను నిలిపేవు

నా పంచప్రాణాలే పంచ భూతవిశ్వము

నాదనుకొను ఈ దేహమే నీదైన గృహము

త్వమేవాహం శివా నీకు నాకు అభేదము


1.గుణరూప రహితుడవు నిత్య నిరంజనుడవు

సాకార నిరాకార సందిగ్ధ లింగ ప్రాప్తుడవు

సర్వవ్యాపకుడవు అఖండ విశ్వజనకుడవు

త్రయంబకుడవు నీవు సాంబ సదా శివుడవు

త్వమేవాహం శివా నీకు నాకు అభేదము


2.వేదవేద్యుడవు సంగీత శాస్త్రాద్యుడవు 

తాండవకేళీ విలాసుడవు నటేశ్వరుడవు

ఆది వైద్యుడవు సకల విద్యా పారంగతుడవు

ప్రళయకాల రుద్రుడవు మృత్యుంజయుడవు

త్వమేవాహం శివా నీకు నాకు అభేదము

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


చారెడేసి కళ్ళున్న చారులత

బారెడంత జడ ఉన్న మంజులత

ఒదిగిపో నీవే నా కవితగా

సాగవే  బ్రతుకంతా నా జతగా


1.గోముగా చూడకే నా వంక

అరనవ్వు రువ్వకే చంద్రవంక

వెక్కిరించినా నీ ప్రేమకదో వంక

వైరులకూ దొరకదు నీలో ఏ వంక


2.ఊరించడం నీకు మామూలే

ఉడికించకు మగటిమికది సవాలే

ఊహలే రేపేను నీ పరువాలే

ఉక్కిరిబిక్కిరాయే నాలో భావాలే

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


లోకమంతా నిదురపోతోంది

నా కవితకిపుడే వేకువయ్యింది

చెదురుమదురుగా ఎదను తట్టిన

భావసంచయము

కుదురుగా ఇపుడిపుడే వచ్చి

కూర్చె నీ సరము


1.సెలయేరై పారుతుంది ఎడారిలోనూ

గులాబీగ పూస్తుంది స్మశానంలోను

చంద్రికయై వెలుస్తుంది అమావాస్యలోను

చిరుజల్లై కురుస్తుంది ఎద బీడులోను

వేగుచుక్కగా మారి దారి చూపుతుంది భావుకత

పొద్దుపొడుపుగా ఆశలకే రుచిస్తుంది నా కవిత


2.ఆర్తి తెలియపరుస్తుంది ప్రేమికుల జతకు

స్ఫూర్తి కలుగజేస్తుంది యథాలాప యువతకు

మార్గదర్శనం చేస్తుంది సరియగు నడతకు

జాతీయత రగిలిస్తుంది నా దేశజనతకు

వేగుచుక్కగా మారి దారి చూపుతుంది భావుకత

పొద్దుపొడుపుగా ఆశలకే రుచిస్తుంది నా కవిత