Tuesday, July 6, 2021

 


ఎలా కాచి ఉంచను నీ వదన కమలాన్ని

తుంటరి తుమ్మెదల దండునుండి

ఎలా ఏమార్చను నీ చరణ పల్లవాన్ని

గండుకోయిలల దాడినుండి

తెరవెనక ఉండక కలంలోకి చొరబడవే

కనులెదుట లేకున్నా కలల్లోకి త్వరపడవే


1.క్షీరసాగర మథనం మళ్ళీ మొదలౌతుంది

నీ అధరామృతం కోసం

శివ మనోచపలత్వం మరలా సాధ్యమౌతుంది

నీ నవమోహన రూపంకోసం

తెరవెనక ఉండక కలంలోకి చొరబడవే

కనులెదుట లేకున్నా కలల్లోకి త్వరపడవే


2.ప్రపంచాన్ని సాంతం త్యజించవచ్చు

నీ క్రీగంటి చూపుకు

విశ్వాన్ని సైతం జయించగావచ్చు 

నీ అరనవ్వు కైపుకు

తెరవెనక ఉండక కలంలోకి చొరబడవే

కనులెదుట లేకున్నా కలల్లోకి త్వరపడవే

 

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఎంతటి శిక్షనో ఈ నిరీక్షణ

నీకెప్పటికైనా చెలీ ఎరుకౌనా

ఎంతగకాల్చునో విరహ వేదన

కాసింతైనా నీకిక అవగతమౌనా

అనుభవైకవేద్యమైతేనే తెలిసేనీ తీపియాతన

సహానుభూతితోనే కరుణించాలి నువ్వికనైనా


1.కన్నయ్య రాకకు రాధ ఎలా ఎదిరి చూసిందో

దుష్యంతుని జాడకై శకుంతలెంత వేచిందో

ప్రణయాగ్ని జ్వాలలోన ఎవరెంత వేగారో

ప్రియతముల సంగమించ ఎంతగా గోలారో

అనుభవైకవేద్యమైతేనే తెలిసేనీ తీపియాతన

సహానుభూతితోనే కరుణించాలి నువ్వికనైనా


2.రామునికి దూరమై సీత ఎంత వగచిందో

నలుడి నెడబాసి దమయంతెలా సైచిందో

చేజారి పోతే తెలియును గాజు పూస రత్నమనీ

చెలికాని వెలితిని మరచుట విఫల యత్నమేననీ

అనుభవైకవేద్యమైతేనే తెలిసేనీ తీపియాతన

సహానుభూతితోనే కరుణించాలి నువ్వికనైనా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


సకల సృష్టికే స్త్రీ మూలం

ఆకాశంలో అతివ సగం

స్వావలంబన సాధికారత

సబలకు పెట్టని ఆభరణం

విద్యతోనే  నేటి వనితకు నిత్యవికాసం

బాలికలందరు చదువుకొంటెనే బంగరు భారత దేశం


1.సకల విద్యలకు అధిదేవతయే మాతా శ్రీ సరస్వతి

సిరులను వరముగ నరులకిచ్చే లక్ష్మి సైతం పడతి

అసురదూర్తులను మట్టుబెట్టినది కాదా ఆదిపరాశక్తి

నిబిడీకృతమౌ మనో బలమునే గుర్తెరగాలి ప్రతి ఇంతి

విద్యతోనే  నేటి వనితకు నిత్యవికాసం

బాలికలందరు చదువుకొంటెనే బంగరు భారత దేశం


2.పలురంగాలలొ పురుషుని దీటుగ నిలిచింది ప్రమద

వ్యోమగామిగా గగనతలంతో విహరించింది ధీర

దేశమునేలే నేతగ నాడే పరిపాలించెను తరుణి

సంతతి పొందే ఉన్నతి ఖ్యాతికి కారణభూతం కాంత

విద్యతోనే  నేటి వనితకు నిత్యవికాసం

బాలికలందరు చదువుకొంటెనే బంగరు భారత దేశం

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


మెరుగులు దిద్దని ముడి సరకు

అమరపురి నుండి దిగె ఈ ఇలకు

సహజాతమే నీ అపురూప సౌందర్యం

అపరంజి శిల్పమేనీ అనన్య సోయగం


1.కొలనులోన విచ్చిన కమలం

వనములొ  విరిసిన మందారం

అణువణువు నీ తనువు మొగలి సౌరభం

తాకిచూస్తే హాయిగొలిపే గులాబి సుకుమారం


2.అనంగ రంగం నీ అంగాంగం

 బృందావన రస సారంగం

హద్దులు దాటి పెదవులు మీటే కమ్మదనం

హత్తుకపోతే మత్తులొముంచే వెచ్చదనం

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


భో భో భో భో బోళా శంకరా

భో భో భో భో శంభోశంకరా

ప్రభో రాజరాజేశ్వరీ విభో శంకరా

సాంబ సదాశివ భక్తవశంకరా హరా

నమోనమఃశివాయా భవాశంకరా

హరహర మహాదేవ పాహి పాహిశంకరా


1.జటాఝూట హఠయోగీ గంగాధరా

కరుణా కటాక్ష వీక్షణా బాలేందుశేఖరా

నిటలాక్ష విషకంఠా వృషభ వాహనా

శూలధరా పురంధరా ఫణి భూషణా

నమోనమఃశివాయా భవాశంకరా

హరహర మహాదేవ పాహి పాహిశంకరా


2.త్రయంబకా పంచముఖా మృత్యుంజయా

వైద్యనాథ భూతనాథ విశ్వనాథ సహాయా

నటరాజా చిద్విలాస ప్రళయ రౌద్ర రూపాయా

రాజేశ్వర పరమేశ్వర కైవల్యదాయకాయ

నమోనమఃశివాయా భవాశంకరా

హరహర మహాదేవ పాహి పాహిశంకరా