Tuesday, January 7, 2020

అందియగా అందించితి నీపాదానికి
నా గుండియని
తివాచీగ పరిచితిని నీ మార్గానికి
నా హృదయాన్ని
పట్టించుకోవేల ఓ ప్రియతమా
నిను ఆరాధించడమే నా నేరమా

1.ఏ రీతిగ నీ ప్రేమను నే పొందగలనూ
నా నియతిని ఏ విధముగ నిరూపించగలనూ
మనసుపెట్టిచూడూ
నా మనసుతొ మాటాడూ
గ్రహించగలవు నా ఎదలోని సొదలు

2.కీలుగుర్రమెక్కించి వినువీథుల తిప్పనా
ఉద్యానవనాలలో విహరింప జేయనా
కలలో  వచ్చిచూడు
మన కలలన్ని పండేనూ
కలకాలం కలిసుండగ నినుకోరేనూ

పేరుకు భద్రకాళివి-రూపుకు మహాకాళివి
జగములనేలు తల్లివి-వరముల కల్పవల్లివి
వందనాలు నీకివే కంజదళాయతాక్షి
శరణాగతినీయవే శాంభవి నారాయణీ

1.అష్టభుజాలున్నవికద మమ్మాదుకొనగా
దుష్టశక్తులన్నిటిని దునుమాడగా
తాత్సారము వలదమ్మా త్రైలోక్య పావని
వెతల ద్రుంచి వేడ్క దీర్చు చిదానందిని సదానందిని
వందనాలు నీకివే కంజదళాయతాక్షి
శరణాగతినీయవే శాంభవి నారాయణీ

2.అడ్డు అదుపులేదా మా కష్టాలకూ
గడ్డుకాలమెందాకా మా బ్రతుకులకు
దొడ్డమనసు నీకుందని మరిచితివా రుద్రాణీ
బిడ్డలమే గద జననీ మము బ్రోవవె దాక్షాయణి
వందనాలు నీకివే కంజదళాయతాక్షి
శరణాగతినీయవే శాంభవి నారాయణీ





కారని కన్నీటి చుక్క నాన్న
ఆరని గుండె మంట నాన్న
గాంభీర్యం పులుముకున్న నాన్న
ఔదార్యం వంపుకున్న నాన్న
నాన్నంటే తీరాన్ని చేర్చే నావ
నాన్నంటే ముళ్ళను ఏరేసిన త్రోవ

1.ఇంటిల్లి పాదిలో ఒంటరితానై
క్రమశిక్షణ పేరిట అందరిలో వేరై
అణగద్రొక్కుకున్న అనురాగమై
అలకలవెనకన  తను త్యాగమై
నాన్నంటే  నచ్చనీ మందలింపురా
నాన్నంటే గుచ్చుకునే అదిలింపురా

2.అవసరాన్నిడిగితే అది ఒక వరమై
అదుపుతప్పునేమోయను కలవరమై
ఎండకూవానకూ తడిసిన గొడుగై
బంగారుభవితకు తానే ముందడుగై
నాన్నంటే కుటుంబం వెన్నెముకేరా
నాన్నంటే నాటికకూ తెరవెనుకేరా



రచన,స్వరకల్పన&గానం:రాఖీ

అమ్మ మొదటి దేవత
ఆవు మహిని పునీత
ఇల్లేకద ఇలలోన స్వర్గసీమ
ఈశ్వరుని దీవెనలు అందుకొనుమా

1.ఉడతాభక్తిగా దానమీయుమా
ఉన్నదాంతొ తృప్తిపడీ జీవించుమా
ఊగిసలాడకూ ఊహల ఊయలలూగకూ
ఋణముల పాలబడక ఋషిలా మనగలుగూ

అమ్మని గౌరవించు అది ధర్మార్థం
ఆవుని పెంచుకో అది పురుషార్థం
ఇల్లును నిర్మించుకో నీ కామ్యార్థం
ఈశ్వరునీ ధ్యానించుకో మోక్షార్థం

2.ఎవరు ఏది చెప్పినా వినుట నేర్చుకో
ఐశ్వర్యమె నశ్వరమని  ఎరిగి మసలుకో
ఒదిగి ఉండు ఎప్పటికీ ఎంత ఎదిగినప్పటికీ
ఓరిమి చేకూర్చునూ ఔన్నత్యము మనిషికీ

అమ్మను ఆదరించు ముదిమిలో
ఆవుని పూజించు అవనిలో
ఇల్లాలిని పిల్లలను కళ్ళల్లొ పెట్టి చూసుకో
ఈశ్వరునీ దర్శించుకొ నీ ఆత్మలో

"తెలుగింటి సంక్రాంతి"

సకినాల పండగ సంకురాతిరి పండగ
పంటలన్ని పండగ గాదెలెన్నొ నిండగ
తెలుగునాట ఆనందాలు పండగ
రవి చిమ్మును కొత్తకాంతి దండిగ

1.కళ్ళాపి జల్లిన పచ్చనైన వాకిళ్ళు
ఇంటింటి ముంగిట ముగ్గులు గొబ్బిళ్ళు
కుంకుడుకాయలతో తల అంటుళ్ళు
భోగి మంటలతో ఉదయాలు రాత్రుళ్ళు

2.ఆట పట్టించే అల్లరి మరదళ్ళు
జడపట్టుక లాగే అక్కల మొగుళ్ళు
నోరూరే అరిసెలు తీరొక్క  పిండి వంటలు
సరదాలు సందళ్ళు సంతోషం పరవళ్ళు

3.పరికిణీ వోణీలు కంచి పట్టు కోకలు
నోములూ వ్రతాలు ఇంతుల పేరంటాలు
బొడబొడరేణివళ్ళు చిన్నారుల కేరింతలు
పతంగులతొ నింగిలోన రంగుల హరివిల్లు

4.కోన సీమలోన కోడి పందాలు
రాయల సీమలో గిత్తల పందాలు
వాడావాడలో జూదాలు దందాలు
మునిమాపే మరులుగొలుపు అందచందాలు
https://youtu.be/IVBIU5KPelM

జెండా పట్టుకొంటె మనసుకి ఒక ఊపు
జేబుకు జండా పెట్టుకుంటె దేశభక్తిని రేపు
గుండెలనిండా జాతీయత నింపుకొంటు విభేదాలు రూపుమాపు
సమైక్యతా రాగం తీస్తూ భారతీయను మేలుకొలుపు

1.కాషాయం తెలుపు త్యాగాల సైనికుని
ధర్మచక్రముతొ తెలుపు తెలుపును కార్మికుని
హరితం తెలుపును అన్నదాతయగు కర్షకుని
మూడుసింహాల చిహ్నం చట్టం న్యాయం ధర్మాన్ని

2.నైసర్గికరూపం భిన్నం ఐనా ఒకటే భారతదేశం
వేష భాషలూ వేర్వేరూ ఐనా ఒకటే హిందూస్తాన్
కుల మతాలు ఎన్నో ఎన్నెన్నో ఐనా ఒకటే ఇండియా
భిన్నత్వంలో ఐకమత్యం మేరా భారత్ సదా మహాన్

ఎముకలు కొరికే చలిలో హిమగిరి చరియల కొనలో
నరమానవుడి జాడేలేని మంచుగడ్డలలో
వడగాలలు చెలరేగే వేసవి ఎడారుల్లో
పహారాయే కర్తవ్యంగా సరిహద్దు రక్షణే ధ్యేయంగా
బ్రతుకేధారపోసే సైనికులారా మీకు సలాం
ప్రాణం ఫణంగపెట్టే ప్రియ సిపాయిలారా మీకు గులాం

దుప్పటిమాటున ఒదిగి చెలి కౌగిలిలోన కరిగి
నేను నాదను వాదనతో సుఖాలనెన్నొ మరిగి
నీ త్యాగం విలువనెరుగక పౌరులమంత చెలఁగి
నీ సేవానిరతిని  గుర్తించలేక స్వార్థంతో మేమే ఎదిగి
విర్రవీగిపోతున్నాము నిన్ను మరచి పోతున్నాము
బ్రతుకేధారపోసే సైనికులారా మీకు సలాం
ప్రాణం ఫణంగపెట్టే ప్రియ సిపాయిలారా మీకు గులాం

ఎండనకా వాననకా రేయనకా పగలనకా
నేలతల్లి ప్రాణంగా నింగి తండ్రి దేహంగా
కరువూ కాటకాలకెన్నడూ వెన్నిడక
పంటలెన్నొ పండించి ధాన్యమునే అందించి
పదిమంది కడుపు నింప పాటు పడే రైతులార మీకు సలాం
అభినవ కర్ణులార మా అన్నదాతలార మీకు గులాం

కాలికి ధూళంట నీక మట్టిమాటనే గిట్టక
డబ్బులుంటె కడుపునిండు ననే భ్రమలు వీడక
కిసానంటె ఎప్పటికి చిన్నచూపుతో పలుక
పల్లెపట్టు రైతునెపుడు పట్టించుకోక
నగరాలలో మేము నాగరికతనొదిలేము
పదిమంది కడుపు నింప పాటు పడే రైతులార మీకు సలాం
అభినవ కర్ణులార మా అన్నదాతలార మీకు గులాం