Friday, November 30, 2018

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

మిథ్యా జగత్తులో నిత్య సత్యము నీవు
అగమ్య గోచరాన పరంజ్యోతివి నీవు
ఇహపర సాధకమౌ బ్రహ్మత్వము నీవు
స్థితప్రజ్ఞ సంస్థితమౌ అస్తిత్వము నీవు
తిరుమలగిరిరాయా శరణుశరణుశరణమయా
అష్టాక్షరి దివ్యనామ ఓంనమో నారాయణాయ

1.పురంధర దాసుని పుణ్యమే పుణ్యమయా
అన్నమయ్య భాగ్యమేమొ చెప్పనలవి కాదయా
త్యాగరాజు శ్యామశాస్త్రి తరియించినారయా
ముత్తుస్వామి దీక్షితులు నీ సేవలొ మునిగిరయా
తిరుమలగిరిరాయా శరణుశరణుశరణమయా
అష్టాక్షరి దివ్యనామ ఓంనమో నారాయణాయ

2.భవబంధాల నుండి విడుదల చేయవయా
భవసాగరమీదగా సత్తువ నొసగవయా
భవతారక మంత్రమై నాలోన చెలగవయా
అనుభవైకవేద్యమై నను కడతేర్చవయా
తిరుమలగిరిరాయా శరణుశరణుశరణమయా
అష్టాక్షరి దివ్యనామ ఓంనమో నారాయణాయ

https://www.4shared.com/s/fMof2IgCkda

Sunday, November 25, 2018

ఎంత హాయిగొలుపుతుంది అమ్మ ఒడి
ఎంత కమ్మనైనదీ నాన్న కౌగిలి
అంతులేని అనురాగం అమ్మ చెంతన
చింతలేని ధైర్యమెంతొ నాన్న కౌగిలింతన
తిరిగిరాని బాల్యంలో తీపి గురుతులే అవి
కరుగుతున్న కాలంలో మధురానుభూతులవి

కొసరి కొసరి నాకు మీగడ పెరుగేసి
పలుచనైన చల్లనే అమ్మ పోసుకునేది
పండుగల్లొ కొత్తబట్టలు నాకు కుట్టించి
ఉన్నవాటితో నాన్న సరిపెట్టుకొనేది
నాసంతోషం కోసమెంత త్యాగం చేసారో
నా సౌఖ్యాల కొరకె బ్రతుకు ధారపోసారు

నన్ను నిద్ర పుచ్చుతూ ఎంతసేపు మేల్కొనేదొ
నా అల్లరి భరియిస్తూ అమ్మ ఎంత అలసేదో
నా ముచ్చట నెరవేర్చగ ఎంత ఖర్చుచేసాడో
నా చదువులకైతె నాన్న శ్రమనెంత ఓర్చాడో
ఏమి చేసినా తీరదు కన్నతల్లితండ్రి ఋణం
మలిసంధ్యలొ చేరదీసి సేవచేయి అనుక్షణం 

https://www.4shared.com/s/fhbDIeKTJgm

Saturday, November 24, 2018

అందనంత ఎత్తులో
అందమైన నేస్తము
మాటలే కరువాయె
తెలుపగ ప్రాశస్త్యము

1.విశ్వకర్మ విస్తుపోయె చిత్రకారిణి
మయబ్రహ్మ చకితుడయే రూపశిల్పిణి
తుంబురుడే తలవంచు గాయనీమణి
భారతి వరమందిన రచనాగ్రణి

2.అందానికి రతీదేవి
అపర పార్వతీదేవి
మనసైన స్నేహశీలి
ఎప్పటికీ నా నెచ్చెలి

3.అపురూపమే రూప
కళలకు కనుపాప
పూర్వపుణ్య కానుక
తన చెలిమొక వేడుక
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

వజ్రఖచిత మకుటము-నిండునిలువు నామము
కృపాకటాక్ష వీక్షణము-మందస్మిత వదనము
సుందరాకార నిన్ను వర్ణించగ ఎవరి తరము
గోవిందనామ ప్రియ అందుకోర వందనము

తిరుమలేశ గోవిందా వేంకటేశ గోవిందా
శ్రీనివాస గోవిందా పాపనాశ గోవిందా

1.శంఖచక్ర హస్త భూషితా!
వైజయంతీ మాలాలంకృతా!
శ్రీనివాస హృదయ శోభితా
అభయ ముద్ర హస్తాన్వితా

సుందరాకార నిన్ను  వర్ణించగ ఎవరి తరము
గోవిందనామ ప్రియ అందుకోర వందనము

2.తులసీదళ వనమాలీ! పీతాంబర ధారీ!
రత్నకాంచనా భరణ రాజిత మురారి!
భక్త సులభ వరదా భవహర శౌరీ!
భవ్యపద్మ పాదయుగ్మ -శ్రిత శరణాగత శ్రీహరీ!

సుందరాకార నిన్ను -వర్ణించగ ఎవరి తరము
గోవిందనామ ప్రియ అందుకోర వందనము

https://www.4shared.com/s/ffK6ntrL3da
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

మనమన్నది కాదనితోసేస్తూ-తామన్నదె సరియని వాదిస్తూ
తిరకాసుల మెలికెలువేస్తూ-తికమకలే మరి కల్పిస్తూ
తమ భావం మనతో పలికిస్తూ-జవదాటని భ్రమ సృష్టిస్తూ
ఇంతింత కాదయా ఇల్లాలి లీలలు
ఇలలోని పతులంతా తోలుబొమ్మలు,కీలుబొమ్మలు

1.సింగారించు చీరలు మనకోసమే నంటూ
అలంకరణ సాధనాలు మన మెప్పుకేనంటూ
ప్రతికొట్టుకు తిప్పుతూ డ్రైవరుగా మారుస్తారు
బేరమాడి మేల్చేసామని డబ్బంతా గుంజుతారు
పిల్లలనాడించమంటూ హుకుం జారి చేస్తారు
బరువుమోయలేమంటూ బ్యాగులెన్నొ మోపిస్తారు
ఇంతింత కాదయా ఇల్లాలి లీలలు
ఇలలోని పతులంతా తోలుబొమ్మలు,కీలుబొమ్మలు

2.కాస్త రిలాక్సౌతుంటే కూరలన్ని తరిగిస్తారు
వంటబాగ చేస్తారంటూ చాకిరెంతొ చేపిస్తారు
చుట్టాలొస్తారంటూ ఇల్లు సర్దిపిస్తారు
ఉన్నఫళంగా తెమ్మంటూ సరకుల లిస్టిస్తారు
మీవైపు వాళ్ళేనంటూ చూపొకటి విసిరేస్తారు
మీ అత్తామామలె అంటూ టెక్నిగ్గా బుక్చేస్తారు
ఇంతింత కాదయా ఇల్లాలి లీలలు
ఇలలోని పతులంతా తోలుబొమ్మలు,కీలుబొమ్మలు

https://www.4shared.com/s/fTNo8TGiUda

Wednesday, November 21, 2018

రచన.స్వరకల్పన&గానం:రాఖీ

నీ పాదాల్లో పుడతాయి నదీనదాలు
నీ పలుకుల్లో ఒలుకుతాయి నాల్గు వేదాలు
నీ కరుణతొ మనగలుగుతాయి జీవజంతుజాలాలు
నీ ఆజ్ఞతొ తిరుగుతాయి విశ్వాంతర గోళాలు
సాయి నీవు సాక్షాత్తూ పరమాత్మవే
నాలోనూ వెలుగొందు జీవాత్మవే

సాయిరాం శ్రీ సాయిరాం సాయిరాం షిర్డీ సాయిరాం
సాయీరాం ఓం సాయిరాం సాయిరాం జయజయ సాయిరాం

1.నీ కను సన్నలతో ఋతువులు కాలాలు
నీ దయాభిక్షతోనె చావులు పుట్టుకలు
ఊపిరిలో ఊపిరివై చైతన్యం నింపేవు
మనసులో మసలుతూ భావుకతను వొంపేవు
సాయి నీవు జగత్తుకే పరంజ్యోతివి
నాలో తిమిరాలు బాపు జ్ఞానజ్యోతివి

సాయిరాం శ్రీ సాయిరాం సాయిరాం షిర్డీ సాయిరాం
సాయీరాం ఓం సాయిరాం సాయిరాం జయజయ సాయిరాం

2.రాగద్వేషాలు నీ మాయా విశేషాలు
భవబంధాలు నీ జగన్నాటకాలు
ప్రలోభాల పొరలుగప్పి మమ్ము పరీక్షస్తావు
మర్మమెరుగునంతలోనె మరపులోకి తోస్తావు
అలసినాను ఆటలాపు ఓ సూత్రధారీ
శరణాగతి నీవయ్య నా మానస విహారీ

సాయిరాం శ్రీ సాయిరాం సాయిరాం షిర్డీ సాయిరాం
సాయీరాం ఓం సాయిరాం సాయిరాం జయజయ సాయిరాం

https://www.4shared.com/s/fBXxSJI_lda

Tuesday, November 20, 2018

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

మనసా వాచా కర్మణా-
నిను నమ్మితిరా గిరిజారమణా
నిన్నా నేడూ రేపూ-
నీవే దిక్కురా కరుణా భరణా
ఏలమానినావురా అవధరిండం
నీకు కొత్త కాదురా కనికరించడం

మార్కండేయ పోష ఈశ్వరా
శిరియాళ ప్రాణరక్షా పరీక్ష'నా'పరా

1.చిన్ననాటినుండి నీవెన్ని కథలు విన్నానో
నీవరాలు పొందిన వారి వార్త లెరిగానో
పురాణాలు స్థలమహత్మ్యా లెన్ని తెలుసుకున్నానో
పంచాక్షరి జప మహిమల నాలకించియన్నానో
అనుభవానికేలరావు భవానీ ప్రియ పతి
తాత్సారమేలనయ్య నీ తనయుడె విఘ్నపతి

మార్కండేయ పోష ఈశ్వరా
శిరియాళ ప్రాణరక్షా పరీక్ష'నా'పరా

2. కాళేశ్వర ముక్తీశ్వర దర్శనమే నేగొంటి
కాళహస్తీశ్వరుణ్ణి కనులారా కనుగొంటి
శ్రీశైల మల్లన్న శిఖరమునే చేరుకొంటి
వేములాడ రాజన్న లింగమునే అంటుకొంటి
కాశీ విశ్వనాథ హారతులే నే కంటి
ధర్మపురీ రామలింగ ఇకనైన దయగను ముక్కంటి

మార్కండేయ పోష ఈశ్వరా
శిరియాళ ప్రాణరక్షా పరీక్ష'నా'పరా

https://www.4shared.com/s/f63WF3wbrgm
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

కనులు కనులు కలపకున్నా
పెదవులసలేం పలకకున్నా
నా గుండెవిన్నది నీ హృదయ స్పందన
మనసు కనుగొన్నదీ ప్రణయ ఆరాధన

చేరలేనీ దూరమున్నా
కాలమే కరుణించకున్నా
తలపులకు తొలి వలపుసోకే
కలలు అలలై నిన్ను తాకే

నీది నాదీ ఒకే భాష
లలిత కళలే మనకు శ్వాస
కుంచె దించే అపురూప మీవు 
కలము వెలయించు కవితనేను

https://www.4shared.com/s/fwSGbelougm

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

నా ఊహకు రూపం నీవే
నా ఆశల దీపం నీవే
నా కలలకు సాక్ష్యం నీవే
నా జీవిత లక్ష్యం నీవే

చెలీ నీవేలే నా లోకం
ప్రియా నీ వలపే ఓ మైకం

1.నా కవితల కల్పన నీవే
నా గానపు మధురిమ నీవే
నా చిత్రపు ఆకృతి నీవే
నా భవితకు అతీగతి నీవే

చెలీ నీవేలే నా లోకం
ప్రియా నీ వలపే ఓ మైకం

2. నా  గుండెకు సవ్వడి నీవే
నా బ్రతుకున ఊపిరి నీవే
నా మనసున దేవత నీవే
ఏడేడు జన్మల జతవీవే

చెలీ నీవేలే నా లోకం
ప్రియా నీ వలపే ఓ మైకం

https://www.4shared.com/s/fQMaraYadfi

Saturday, November 10, 2018

రచన:రాఖీ

మల్లెవిరిసె వేళ ఇది –కన్నెమురిసె కాలమిది
ఎదలు కలిసె తరుణమిది
ఇదే ఇదే వసంతము-మరులొలికే కాలము

1.మావి చివురు వేసేది పికము కోసమే
చెలియ మురిసి వేచేది ప్రియుని కోసమే
పికము కొసరి కోరేది చివురు మాత్రమే
ప్రియుడు చేయి సాచేది ప్రేమ యాత్రకే

2.మధురిమల మల్లియ మధువు గ్రోలు మధుపం
మనసిచ్చిన చెలియ వలపుకోరు ప్రియుడు
అనురాగ జగానికి ఎదురులేని ఏలికలు
ప్రేమమందిరాన వారే ఆరాధ్య దేవతలు

Tuesday, November 6, 2018



రచన,స్వరకల్పన&గానం:రాఖీ

పెదవుల దివ్వెలపై నవ్వులు దీపిస్తే దీపావళి
కన్నుల ప్రమిదలలో వెన్నెలలే పూస్తే దీపావళి
అగమ్యగోచరమౌ జీవితాన జ్ఞానజ్యోతి వెలిగిస్తే దీపావళి
ప్రతి బ్రతుకున ఆనందం వెల్లివిరియ దీపావళి
దీపావళి నిత్య దీపావళి-దీపావళి విశ్వ దీపావళి

1.ఆకలి చీకటి తొలగించే కంచమందు అన్నమే అసలు 'రుచి'
అంధులకిల దారి చూపు చేతి ఊతకర్ర రవిని మించి
మిరుమిట్ల కాంతులు దద్దరిల్లు ధ్వనులు అంతేనా దీపావళి
అంబరాల సంబరాలు విందులు వినోదాల వింతేనా దీపావళి
ఒక్కనాడు జరుపుకుంటె అదికాదు దీపావళి
ప్రతిరోజూ పండగే సంతోషం నిండిన జీవన సరళి

2.సుదతులంత సత్యలై నరకుల దునిమితే దీపావళి
సిరులొలికే ధనలక్ష్మి జనుల ఎడల హాయికురియ దీపావళి
పాడీపంటలతో పిల్లాపాపలతో  శోభిస్తే దీపావళి
చదువు సంధ్యలతో పరువు సంస్కృతితో విలసిల్లితె దీపావళి
ఒక్కనాడు జరుపుకుంటె అదికాదు దీపావళి
ప్రతిరోజూ పండగే సంతోషం నిండిన జీవన సరళి

https://www.4shared.com/s/fALbrLmoUfi