Sunday, June 28, 2020


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:శహనా

వందే విశ్వంభరా
నమోస్తుతే ఋతంబరా
ధన్యోహం దిగంబరా
దండంబులు గొనుమిదే హరా నిరాడంబరా

1.ఎలా నీకు తెలుపగలను కృతజ్ఞత
ఎలా ప్రకటించను నా విశ్వసనీయత
ఏవిధి ఎరుకపరుచగలను  నా భక్తి ప్రపత్తత
ఏ రీతి మెప్పించను మార్కండేయవినుత
ధన్యోహం దిగంబరా
దండంబులు గొనుమిదే హరా నిరాడంబరా

2.ఉత్కృష్టమౌ ఈ నరజన్మ నిచ్చావు
ఆరోగ్యభాగ్యాలు నాకొసగినావు
చక్కని ధారా పుత్రుల దయచేసినావు
మిక్కిలి కవన ప్రతిభ వరమిచ్చినావు
ధన్యోహం దిగంబరా
దండంబులు గొనుమిదే హరా నిరాడంబరా
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

మల్లెలకెంత తొందర-నీ జళ్ళో మాలగా అలరొందాలని
వెన్నెలకెంత ఆత్రుత-నీ ఒళ్ళు ఒళ్ళంతా  పరుచుకోవాలని
తుమ్మెద కెంత కోరిక-నీ ముఖకమలంపై వాలాలని
ముత్యాలకొకే వేడుక-నీ నగవుల జల్లుగా రాలాలని

1.కిన్నెరసాని నీ నడకచూసాకే-మెలికలు తిరిగింది
పెన్నానది నీ నడుము కనగానే-అలకను పూనింది
కృష్ణవేణి నీ కురుల నలుపుచూసి-తలవంచుక సాగింది
పాపికొండల గోదారి నీ గుండెల ఉన్నతికి-అచ్చెరువొందింది

2.నర్మదానది లోయనే లోతైన -నీ నాభిని తలపించింది
తపతీ నది అందమైన ప్రవాహమే-నీ నూగారును పోలింది
తుంగభద్ర సంగమించ నిను మెళకువలడిగింది
కావేరి నీమేని సోయగాలకే నిలువెల్లా నీరయ్యింది
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

ఆమె:
తనువుకే యవ్వనం ముసలితనం
అతను:
మనసన్నది ఎప్పుడూ అజరామరం
ఆమె:
అందాన్ని ఇనుమడించు హుందాతనం
అతను:
నిండైన కట్టుబొట్టు నెలతకు సింగారం

అతను:
1.అరమరికలే లేని అపురూప కాపురం
సాంగత్యమె నిత్యమైన సిసలైన దాంపత్యం
అలకలు కలనైన  కనరాని సంసారం
అతివ చతురతతొ ఔతుంది గృహమే స్వర్గం

ఆమె:
2.కుటుంబమంతటి శ్రేయస్సే ఏకైక లక్ష్యం
సంతానపు ఔన్నత్యమే చేరిన శిఖరం
ఎదలోన అనురాగం ఎదుటేమో గంభీరం
 మగధీరుడే మగనాలికి ఆరాధ్య దైవం
తీరు చూస్తే జలపాతం
ఉరిమితే మరి ఉల్కాపాతం
మనసు లైతే నవనీతం
స్నేహితం మనకాపాతం

1.ఉబుసుపోని జీవితం
మూడునాళ్ళే శాశ్వతం
వెతకు చెలిమొక ఊతం
కరిగనీకు క్షణమే అమృతం

2.దొరికినదె మన ప్రాప్తం
అనుభూతులె అవ్యక్తం
సర్దుకుంటె అది యుక్తం
అంతరంగమన్నది గుప్తం
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

నీపదము తడిసింది స్వామి
నా అశ్రుధారతోని
గుడి మారుమ్రోగె వినవేమి
నా హృదయఘోష తోని
మిన్నకుందువేమి గోవిందా
నన్నుగానవేమీ ముకుందా

1.కన్నతండ్రివీవు చిన్నకొడుకునే నేను
చేయవైతివేల గారాబము
తప్పులెన్నబోకు గొప్పలేవిలేవు నాకు
మన్నించవేల నా అజ్ఞానము
పెంకెతనం మంకుతనం సహజమే కదా
మిన్నకుందువేమి గోవిందా
నన్నుగానవేమీ ముకుందా

2.శుంఠనై మిగిలాను మూఢునిగ మసిలాను
శ్రద్ధగా నీవే బుద్ధిగరపక
మొరవెట్టుకున్నాను నిన్ను తిట్టుకున్నాను
నా అవసరాలు నెరవేరక
సన్మార్గం చూపే బాధ్యత నీదే సదా
మిన్నకుందువేమి గోవిందా
నన్నుగానవేమీ ముకుందా
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

చలికాలమైనా మేనంతా చెమటలే
తానమాడినా గానీ తనువంతా మంటలే
వేగలేకపోతోంది అంగాగం నీవిరహం
తాళజాలకుంది తపన రేగి నాదేహం
రారా సఖా  ప్రియ ప్రేమికా-నా పరువమే నీకు కానుకా

1.పిచ్చుకల జంటకాస్తా ఇచ్ఛ రెచ్చగొడుతోంది
కపోతాల జతసైతం రచ్చ రచ్చ చేసేస్తోంది
చిలుకాగోరింకల మిథునం కలకలం రేపుతోంది
అభిసారిక ఆవహించి కామార్తి బుసకొడుతోంది
రారా సఖా  ప్రియ ప్రేమికా-నా పరువమే నీకు కానుకా

2.ఏకధార జలపాతం సరస్సులో దూకుతోంది
పుడమి చీల్చుకొంటూ మొలక వెలికి వచ్చింది
సెలయేటి కౌగిట కొండ ఒదిగిపోయింది
పదపడుతు నదితానే కడలితో సంగమించింది
రారా సఖా  ప్రియ ప్రేమికా-నా పరువమే నీకు కానుకా
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

జీవితమే చింతల నాటకం
జీవితమే వింతల బూటకం
మనిషికి మనసుకి మధ్యన దొంగాటకం
మనిషికి మనిషికీ నడుమన పితలాటకం

1.రమణి చుట్టు తిరిగే రంగులరాట్నం
గొడ్డు చాకిరితో తిరిగే గానుగ చట్రం
కూపస్థ మండూకం తనలోకమె మైకం
జనన మరణ వలయంలో చిక్కిన జీవితం

2.భావానికి భాషణకు ఎంతటి అంతరం
కార్యానికి వచనానికి పొంతన బహుదూరం
సాటివారి సంక్షేమం మృగతృష్ణతొ సమానం
చిన్నారి నాబొజ్జకు శ్రీరామరక్షయే ప్రమాణం