Sunday, May 2, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:షణ్ముఖ ప్రియ


అభయకరం నీ శుభనామం శివశంకరం

భవభయహరం శివా నీ ధ్యానం పురహరం

అపమృత్యునివారణకరం వందే విశ్వేశ్వరం

సర్వవ్యాధి వినాశనకరం ప్రణతోస్మి పరమేశ్వరం

కేవల పంచాక్షరీమంత్రం రక్షాకరం మోక్షకరం 

ఓం నమః శివాయ ఓంనమః శివాయ ఓం నమంశివాయ


1.భూతనాథం లోకైకనాథం దిక్పతిం

అనాథనాథం శ్రీవైద్యనాథం  వృషపతిం

దీననాథం కాశీ విశ్వనాథం అహర్పతిం

భగీరథీ ప్రాణనాథం గంగాధరం ఉమాపతిం

కేవల పంచాక్షరీమంత్రం రక్షాకరం మోక్షకరం 

ఓం నమః శివాయ ఓంనమః శివాయ ఓం నమంశివాయ


2.నాగభూషణమ్ చర్మధారిణం త్రయంబకమ్

యోగి వేషిణం భక్తపోషణం విషాంతకమ్

శూలపాణినం పంచాననం త్రిపురాంతకమ్

శశిభూషణం మోదదాయినం కరోనాంతకమ్

కేవల పంచాక్షరీమంత్రం రక్షాకరం మోక్షకరం

ఓం నమః శివాయ ఓంనమః శివాయ ఓం నమంశివాయ

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


గడిచింది గతమంతా- ఎదిరిచూపులోనే

కరిగింది యవ్వనమంతా-ఎడబాటులోనే

ప్రియతమా నా నేస్తమా

మన అడుగులు సాగేదెపుడో-బ్రతుకు బాటలో

పదిలమైన నా హృదయమా

మాధుర్యం చిలికేదెపుడో-నాతో జతగ పాటలో


1.సేదదీరు శుభఘడియేదో నీ ఎదపై

పవళించు పరవశమెపుడో నీ ఒడిలో

పసిపాపలాగా లాలించవే నన్ను

కనురెప్పలాగా పాలించవే నన్ను

అక్కున జేర్చుకోవే మిక్కిలి గారాబంగా

గ్రక్కున అరుదెంచవే అలరులు కురియంగా


2.ప్రణయ గోదారిలో నన్ను ఓలలాడనీ

  పాలకడలిలోన తలమునకలవనీ

కవ్వించి నన్ను కలతల్లో ముంచకు

ఊరించి నాలో ఉద్వేగం పెంచకు

మనసనేది నీకుంటే మరిజాగు సేయకు

ప్రాధేయ పడుతోంటే ఇక జాలిమానకు




నీ సుప్రభాతాలు గాలియలల తేలియాడి

చెవుల సోక పావన శుభోదయం

నీ కోవెల గరుడ ధ్వజ చిరుగంటల సవ్వడులే

మేలుకొలుప మంగళ శుభోదయం


1.శేషశైలవాసా శ్రీ శ్రీనివాసా నీదివ్య

దర్శమమవగా ధన్యమౌ శుభోదయం

గోవింద గోవింద యను నీ నామఘోష

భక్తి భావ మినుమడించ ఆహ్లాద శుభోదయం


2.నీ కరుణా కటాక్ష వీక్షణాలు మాపై

రోజంతావర్షించగ ఆనంద శుభోదయం

ఆయురారోగ్యాలు అందరికీ ప్రసాదించ

ధన్వంతరిరూపా జగానికే నవోదయం

మానవాళికే మహోదయం శుభోదయం

నేడే మేడే కార్మిక దినోత్సవగీతం



ఎత్తిన పిడికిలి సుత్తికొడవలి

చక్రం బాడిస కత్తి గొడ్డలి 

సమస్త కార్మిక సహస్ర రీతుల ఎత్తళి

ఘర్మజలాన్నే కందెనచేసి

యంత్రపుకోఱలు శ్రద్ధగతోమి

మానవ జీవన సౌకర్యానికి

 లోకుల విలాస  సౌలభ్యానికి

రక్తమునంతా చెమటగ వడిపే

 శ్రమైక కృషితో  ఫ్యాక్టరి నడిపే

ప్రపంచ కార్మికులారా మీకు సలాం

అహరహ శ్రామికులారా మీకు జయం


1.గనిలో పనిలో  కార్ఖానాలో

క్రీకర భీకర రణగొణ ధ్వనిలో

కనీస వసతులు కొఱవడుతున్నా

భరించలేని వేడికి వెఱవక

సహించలేని చలికీ జడవక

విషవాయువులనె శ్వాసగ పీల్చే

దుర్గంధముతో  రుచులను మరచి

ప్రమాదాలతో చెలిమే చేసే

మరణపు అంచులు నిత్యం చూసే

ప్రపంచ కార్మికులారా మీకు సలాం

అహరహ శ్రామికులారా మీకు జయం


2.చెల్లాచెదురౌ కార్మిక జాతిని

వివిధ వర్గాల శ్రామిక తతిని

ఒక్కతాటిపై నడువగ జేసి

సంఘటితంగా ముందుకి నడిపి

కార్మిక హక్కుల పోరే సలుపగ

ప్రపంచ కార్మిక ఐక్యత నెరుపగ

కార్మికోద్యమం క్రమతగ జరిపి

బలిదానాలకు వెనకడుగేయక

ఎగురెను నేడే మేడే అరుణ పతాక

రెపరెపలాడేను నేడే విజయ పతాక

ప్రపంచ కార్మికులారా మీకు సలాం

అహరహ శ్రామికులారా మీకు జయం

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నిద్దురపోతే కల్లో కొచ్చి

మెలకువలోను తలపులజొచ్చి

నిండిపోయావే నా మనసంతా

నేనే నీవైపోయానేమో అనేంత


1.చీమ చిటుకుమన్నా నీవే అనుకుంటున్నా

గాలితాకిపోతున్నా నీ కబురేదంటున్నా

ప్రాణవాయువై నన్ను బ్రతికించమంటున్నా

హృదయలయగ మారి నినదించమంటున్నా


2. వెచ్చించగ నాకోసం నిమిషమైన నీకుందా

యోచించగ నాకై క్షణమైన వీలౌతుందా

నూరేళ్ళ జీవితాన్ని నీ కంకిత మిచ్చేస్తా

మరుజన్మలోనైనా నీజతకై జన్మిస్తా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


పగలు గడిచి పోయింది 

రేయి కరిగి పోతోంది

జాడైన కనరాదు జామురాతిరైనా

పాటైన వినరాదు గాలివాటుగానైనా

ఓపలేను నా ప్రియా నీ ఎడబాటు

తాళలేను నే చెలియా ఒక లిప్తపాటు


1.సరదానా ననుడికిస్తే ఓ చినదానా

నన్నాట పట్టిస్తే సంబరమా నచ్చినదానా

గుండె కోసి తెచ్చాను నీకిస్తా కానుగగా

వలపు మూట గట్టాను కుమ్మరిస్త శుల్కంగా


2.రోజులెన్ని మారాయో  తగ్గలేదు మోజసలు

దూరమెంత పెరిగిందో సడలలేదు మోహమసలు

తాడోపేడో తేల్చుకంటా ఈ పూటనే

తెగిపోతె అనుకుంటానే గ్రహపాటనే

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నీ అందానికి పడిపోందెవ్వరూ?!

నీ పరువానికి దాసులే అందరూ

దివినుండి దిగివచ్చావో

కవిగుండె కల్పన నీవో

మనోహరి సుధామయి నీదృష్టి పడనీ నాపై

మిసమిసల మదాలసా సృష్టికే అపూర్వమై


1.వెన్నెలొలుకు కన్నుల్లో నను స్నానమాడించు

తేనెలూరు పెదవులనే తనివార అందించు

 విరులు తలవంచగా ఎన్ని వన్నెలో నీలో

మరులు కురిపించగా నాకెన్నెన్ని సైగలో

చూపుల్తొ రాసేస్తున్నావు ప్రేమలేఖలు

మాటల్లొ పలికిస్తున్నావు ప్రణయవీణలు


2.మాట ఇచ్చి తప్పకు ఎన్నడు నాతో

బాస చేసి మరువను ఎప్పుడు నీతో

ఆశగా వేచేనులే నీకై నా మనసు

అర్తిగా వగచేనని నీ కెలా తెలుసు

గొంతునులిమినట్లుండే నా తీవ్ర బాధ

గుండె మిక్సీలొ నలిగే విపరీతమైన వ్యధ



ఎంతగ నిను పొగిడాను

ఎన్నని  నిన్ను నేనడిగాను

ఉలకవు పలకవు నీవు ఓ బెల్లంకొట్టిన రాయి

కదలవు మెదలవు నీవు శ్రీ షిరిడీపుర సాయి

గుడిలోన కొలువైవున్న నీవో కొండరాయి

కన్నీటికైనా కరగని కరకు గుండెనీదోయి


1.నిత్యం అభిషేకాలు అందమైన వస్త్రాలు

గురువారమైతే చాలు ఊరేగ అందలాలు

షిరిడిసంస్థానమందు ఎన్ని రాజభోగాలు

ఊరూరా మందిరాలల్లో ఉత్సవాలె ఉత్సవాలు

ఫకీరువే నీకేలా సంబరాలు ఆర్భాటాలు

అవధూతవు నీకవసరమా ఈ వైభోగాలు


2.నమ్ముతూనె ఉన్నాను ఊహతెలిసి నప్పటినుండి

వేడుతూనె ఉన్నాను కష్టంవచ్చినప్పటినుండి

 ఏ విన్నపాన్ని విన్నదైతె ఎన్నడు లేదు 

 ఏ కోరిక తీర్చిన దాఖలాయే కనరాదు  

 అడుగడుగున ఆటంకాలు నోటికందకుండా

అనుభవించు గతిగనరాదు లేకనే నీ అండ

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నిత్యం పలకరింపులే లేక

నగవుల చిలకరింపులూ లేక..

ఊపిరాగి పోతోందే..గొంతునొక్కినట్టూ

గుండె నలిగిపోతోందే రోట దంచినట్టూ

నేస్తమా నీవే నా సమస్తము

అనుకుంటే ఇంతేనా నా ప్రాప్తము


1.ఊసైనా వినలేక ,ఊహైనా కనరాక..

పట్టలేకా విడవలేకా దూరమౌతూ భారమౌతూ

సతమతమైపోంది పండంటి బ్రతుకే

చేరుతుంది చేరువలోనే మండేటి చితికే

నేస్తమా నీవే నా సమస్తము

అనుకుంటే ఇంతేనా నా ప్రాప్తము


2.తమాషగా ఏర్పడలేదు మన మధ్య బంధము

అషామాషీ అనుకోలేదు నీతోటి స్నేహము

విధిమనని కలిపింది పరమార్థమేదో ఉంది

మన సంగమ నిమిత్తమేదో ఉత్కృష్టమవనుంది

నేస్తమా నీవే నా సమస్తము

అనుకుంటే ఇంతేనా నా ప్రాప్తము

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నీళ్ళొదులుకుంటే మేలు నీతో స్నేహానికి

చరమగీతం పాడితె ఇకచాలు మన చెలిమికి

పట్టించుకోనపుడు  పట్టుబట్టి పట్టిపట్టి వెంటపడతావు

పరిచయాన్ని పెంచుకోబోతే ముఖం కాస్త చాటేస్తావు


1.ఎండమావిలోనైనా నీరుండవచ్చేమో

ఇంద్రధనుసునైనా అందుకోవచ్చేమో

ఉసూరనిపిస్తుంది నీతో చేసే మైత్రి

వృధాప్రయాస మాత్రమే నా అనురక్తి


2.చేయీచేయి కలిపితేనే అది స్నేహితం

మనసు మనసు ఒకటైతేనే భవ్య జీవితం

ఉబుసుపోక కట్టేవన్నీ గాలి మేడలే

సరదాకై గడిపితె బ్రతుకులు చట్టుబండలే

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


సైచలేను నేను సై అనని నీ మౌనాన్ని 

మరచిపోలేను జన్మల మన ప్రణయాన్ని

ఓపలేను విరహాన్ని మానలేను నీ ఊహల్ని

ఎంతకష్టం ఈ ప్రేమికుడిది ఓ చెలియా

బ్రతుకలేక చావలేక అనుక్షణం నా ప్రియా


1.తటపటాయిస్తావు ఔననడానికి 

వెనకంజవేస్తావు కాదనడానికి

అనురాగం నిండిన నీహృదయం

మానసమేమో డోలాయమానం

తాత్సారమెందుకు పచ్చ జెండాకై

తర్కించగా తగదు స్వచ్ఛమైన ప్రేమకై


2.బంధనాలు త్రెంచుకో మన అనుబంధానికి

రెక్కలను విప్పుకో నింగికి నీవెగరడానికి

చేరుకుందాము సరికొత్త స్వర్గాలే

మనంవేసె అడుగుల్లో మల్లెపూల మార్గాలే

మేడకడతా మనకై స్వప్నాల పొలిమేరల్లో

పడకనౌతా నీకై పండువెన్నెల రాత్రుల్లో