Sunday, August 23, 2009

ఎన్నిజన్మలు ఎత్తినగాని మాయమ్మా
నన్నుకన్నఋణమును తీర్చుకోలేను మాయమ్మా
ఏ జన్మలోని పుణ్యమో ఇది మాయమ్మా
నీ గర్భవాసపు భాగ్యమన్నది నమ్మవమ్మా

1. చిన్ననాట నాకెన్ని ఊడిగాలు చేసావో
కొన్నికొన్ని నాకింకా గుర్తున్నాయమ్మా
నా మలమూత్రాలు ఓకారమనుకోలె ఓయమ్మా
రోగాల్లొ రొష్టుల్లొ వేసటపడలేదు మాయమ్మా
కంటిపాపవోలె కాచుకుంటివీ ఓయమ్మా
యువరాజులాగ పెంచుకుంటివీ మాయమ్మా

2. దాచుకున్న ఆచిల్లర కూడ -కోరగానె నా కిచ్చేదానివి
కలుపుకున్న నీ ముద్ద కూడ- ముద్దుచేసీ పెట్టేదానివి
కొండమీది కోతైనగానీ ఓయమ్మా
అర్దరాతిరి అడిగిన గాని ఇచ్చావమ్మా
నీ ప్రేమను పోల్చే సాహస మెప్పుడు చేయబోనమ్మా
నిన్నుమించి ఏదైవానికైనా మొక్కను మాయమ్మా

3. నీతి కథలే నీనోట నేర్చుకున్నాను
వీరగాధల నొంటబట్టించుకున్నాను
లాలిపాటల మాధుర్యాన్ని గ్రోలాను
నీ ఒడిలో ఊయలలే ఊగాను
నేనింత వాణ్ణి అయినానంటే ఓయమ్మా
చల్లనైన నీ దీవెన వల్లనె మాయమ్మా

4. పైన భావన కనరాదు గాని మాయమ్మా
గుండెనిండా నీవే నిండినావమ్మా
చెప్పడానికి భాష చాలదు ఓయమ్మా
నా ప్రేమ సంగతి నీకు మాత్రం తెలియందా
ముందెన్ని సార్లు పుట్టినగాని మాయమ్మా
కమ్మనైన నీ కడుపులోనె కాస్త చోటివ్వు

5. పరమాత్మకూడ కోరుతాడు పత్రం పుష్పం
వెతికి చూసినా కాసింత దొరకదు నీలొ స్వార్థం
అమ్మ ఉన్నతి సంగతినెరిగి పరబ్రహ్మా
భూమిమీద ఎన్నెన్ని సార్లు ఎత్తాడొ జన్మా
గొప్ప గొప్ప కవులెందరొ ఓయమ్మా
అమ్మ గొప్పను చెప్పజాలరు మాయమ్మా