Saturday, November 6, 2021


కన్ను చెదిరె సన్నజాజి తీగవంటి నీ ఒంటి వంపులే చూసి

రెప్పలార్చనైతినే  మెరుపుతీగ తెన్ను మేను జిలుగుకే భ్రమిసి

జీడితీగలోని తీపి నీ పెదాల మాధురి

సంతూర్ తీగలమ్రోగు తీపి నీ పలుకుల మాదిరి


1.కాంచనగంగా ప్రవాహంగ నీ తనువు తోచే

నీ అంగాంగం మోహనంగ సారంగమై పూచే

మదన కదనరంగాన శృంగార శృంగజమై వేచే

కందవాహనమే ఆవాహనమై నా మనమే నర్తించే


2.మితిమీరే రతి పదాల నిఘంటువులు  నీ బిగువులు

మతి కోరే సమ్మతి తెలిపెడి చాటువులు నీ నగవులు

ప్రతినాయకి గతిసాగెడి కవ్వింపుల నీపయ్యెద పొతవులు

శ్రీమతిగా నిను గొనమని తథాస్తు దేవతల హితవులు


చెప్పారు ఎందరో-స్నేహితానికి నిర్వచనం 

అనుభూతి చెందారు మైత్రిలోని మాధుర్యం

సృష్టిలోనే తీయనిది స్నేహమన్నది

చెలిమిని మించి ఏమున్నది పెన్నిధి


1.నీకు తెలియని కోణాలెన్నో నీలో లోలో

నీవు చూడని పార్శ్వాలెన్నో నీ వ్యక్తిత్వంలో

ఏ అద్దమైనా-చూపలేని నీ ప్రతిరూపం-చూపే దీపం సౌరభం

దిద్దుబాటుకోసం-నీలోని ప్రతి లోపం-తెలిపే కటకం నేస్తము


2. పరకాయ ప్రవేశం చేస్తుంది నీలోకి నేర్పుగా

పరసువేదితో పసిడిని చేస్తుంది నిన్ను ఓర్పుగా

నీ నుండి విడివడిన-ఆ రెండో నీవే-నీ మిత్రుడు చిత్రంగా

శ్రేయస్సును కూర్చే-ఏకైక లక్ష్యమే-మైత్రికి తగు సూత్రంగా