Wednesday, January 29, 2020

నువ్వొస్తే కవితలొస్తయ్
కవ్విస్తే వలపులొస్తయ్
అనురక్తినంతా రంగరిస్తాను
సరికొత్త రాగంతో ఆలపిస్తాను

1.హృదయానిదేముంది
ప్రాణమే ధార పోస్తా
ఏడడుగలు మాత్రమేనా
జన్మలేడు తోడొస్తా
నువ్వడిగితె ఏదైనా కాదంటానా
ఇవ్వ మనసు నీకెపుడు లేదంటానా

2.సరదాలతో సదా
సాగిపోనీ జీవితం
సరసాలు జాలువారి
తరించనీ ఏ క్షణం
మూడునాళ్ళైతేనేమి మన అనుబంధం
చిక్కుముళ్ళగామారి విప్పలేని చందం
రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


ఏనాడు అడగలేదు మా అమ్మని ఇదినాకిమ్మని
నోరు తెఱిచి కోరలేదు నా తల్లిని తీర్చగ అవసరాలని
ఆకలి నెరిగి వేళకు కొసరి తినిపించింది
నలతను తను గుర్తించి సేవలు చేసింది
జగన్మాతవే నీవు నా సతి సుతులూ నీబిడ్డలే
నాకేల ఆరాటం గతిగానగ మా మంచిచెడ్డలే

1.నిజముగ మే రుజలబడి కడదేరమందువా
యాతన మాపేటి చికిత్సలో నీవే మందువా
సంతోషము దుఃఖము అన్నీ నీకంకితము
వేదనలో మోదములో నీతోనే జీవితము
జగన్మాతవే నీవు నా సతి సుతులూ నీబిడ్డలే
నాకేల ఆరాటం గతిగానగ మా మంచిచెడ్డలే

2.నువు చేసే కర్తవ్యం నేను గుర్తుచేయాలా
నీ చర్యల ఆంతర్యం నేను రచ్చ చేయాలా
అనుభవమూ వ్యక్తీ కర్మఫలము వేరుగా తోయగా
సర్వం నీవను సత్యం మరువ మాయలో తోయగా
జగన్మాతవే నీవు నా సతి సుతులూ నీబిడ్డలే
నాకేల ఆరాటం గతిగానగ మా మంచిచెడ్డలే

రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:చంద్రకౌఁస్

ఓనమాలు ఆనాడే వేలుపట్టి నేర్పితివి
మంచి చెడ్డలేవో ఎంచగ బోధించితివి
వసంత పంచమినాడుదయించిన విద్యాదేవి
విరించి నెచ్చెలీ నమోస్తుతే విపంచి వాదన వినోదిని

1.బాసరలో వెలిసావు జ్ఞాన సరస్వతిగా
కాశ్మీరున నెలకొన్నావు ధ్యాన సరస్వతిగా
అనంతసాగర గిరిపై  నిలిచావు వేద సరస్వతిగా
వర్గల్ లో వరలుతున్నావు విద్యా సరస్వతిగా
శృంగేరి పీఠాన వెలుగొందే శారదామణీ
విరించి నెచ్చెలీ నమోస్తుతే విపంచి వాదన వినోదిని

2.తెలివి తేటలన్నీ నీ  ప్రసాదమ్ములే
కళానైపుణ్యాలు  నీ కరుణా దృక్కులే
వాక్చాతుర్య పటిమ జననీ నీ వరమేలే
సాహితీ ప్రావీణ్యత నీ చల్లని చూపువల్లే
హంసవాహినీ పరమానంద దాయినీ
విరించి నెచ్చెలీ నమోస్తుతే విపంచి వాదన వినోదిని