Friday, January 3, 2020

https://youtu.be/NUWgB3UFuZE

సన్నజాజి తీగకూడ చిన్నబుచ్చుకున్నది
నీ ఒంటిలోవంపు చూసి
మేఘాల్లో విద్యుల్లత సిగ్గుతెచ్చుకున్నది
నీ మేనిలో మెరుపు చూసి
దారితప్పి వచ్చావే  దేవీ ఇలాతలానికి
అను'పమాన వరమిచ్చావే ఇలా స్నేహానికి

 1.కనికట్టేదో ఉన్నది నీ కనుకట్టులో
వింత అయస్కాంతముంది నీ వీక్షణలో
కట్టిపడేసే మంత్రమున్నదీ నీచిరునవ్వులో
తేనెపట్టు గుట్టున్నదీ నీ ఊరించే పెదాలలో
లొంగిపోనివాడెవ్వడు ఈ జగాన నీకు
దాసోహమనక పోడు నీ లాస జఘనాలకు

 2.కాంచనమే వన్నె తగ్గు నీదేహకాంతి ముందు
నవనీతమె స్ఫురణకొచ్చు నీశరీర స్పర్శయందు
కిన్నెరసానియే నీ హొయలును అనుకరించు
ఉన్నతమౌ నీ ఎడద హిమనగమును అధిగమించు
రతీదేవికైనా మతిపోవును నీ సొగసు గాంచ
ఏ కవి కలమైనా చతికిల పడిపోవును నిను  వర్ణించి

OK
https://youtu.be/HwHvcq0AM_s

పదవులంటే స్వామీ నీ పాదాల తావులే
ప్రాశస్త్యపు అర్థం నీ దాసుడనను ఎరుకలే
సత్కారము ఈజన్మకు నీ సన్నిధి లభ్యతయే
చరితార్థము బ్రతుకునకు నీ ఆదరణయే
తిరుమలేశ చిదానంద పాహిపాహి పాహిమాం
శ్రీనివాస గోవిందా మనసా వచసా  నమామ్యహం

1.నీ నామం స్మరించకా కానేరదు అది రసన
నిను పొగడనిదేదైనా ఔతుందా ఘన రచన
పూర్వ జన్మ పుణ్యమేమొ కవనము సిద్దించెగా
సత్కర్మల ఫలమేమో నీ తత్వము రుచియించెగా
తిరుమలేశ చిదానంద పాహిపాహి పాహిమాం
శ్రీనివాస గోవిందా మనసా వచసా  నమామ్యహం

2.ఎందరు గణుతించిరో ఒడవదు నీ కీర్తనం
పలురీతుల నుతించినా తరగదు ఆ మధురం
అందుకో శ్రీ వేంకటేశ్వరా నా అక్షర లక్షలు
దరిజేర్చుకో సత్వరమే చాలించి పరీక్షలు
తిరుమలేశ చిదానంద పాహిపాహి పాహిమాం
శ్రీనివాస గోవిందా మనసా వచసా  నమామ్యహం