Thursday, June 27, 2019

ఎందుకు వెళ్ళాలి సాయీ షిరిడీ పురము
దేనికి చూడాలి బాబా నీ మందిరము
మార్చవయ్యా మా గుండె షిరిడీగ
మా మనసే నీ మందిరముగ
తలచినంతనే దర్శనమీయి మాతలపులందున
పిలిచినంతనే నువు బదులీయి ఆపదలందున

1.నువు దైవమని నేను భావించనూ
పూజలు భజనలు నే చేయను
నీ బోధనలే పాటించెదనూ
నీ మార్గములో నే సాగెదను
సాటి మనిషిలో నిను చూసెదను
తోచిన సాయము నే చేసెదను
మానవత్వమె నీ తత్వము
జనుల హితమే నీ మతము

2.నీ హుండీలో వేయను రొక్కము
నీ ముందు వెలిగించనొక దీపము
ఆకలి తీర్చగ జీవుల కొఱకు
రూకలు రెండైన వెచ్చించెదను
దుఃఖము మాన్పగ దీనార్తులకు
చేయూత నందించి ఓదార్చెదను
మానవ సేవే మాధవ సేవ
సంతృప్తి నిచ్చేదె ముక్తికి త్రోవ

రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:తోడి
కోవెలలో ఉన్న దేవీ ఈవలకేల వచ్చెనో
ఈ భక్తుని కరుణించగా నా సేవలె నచ్చెనో
హరి మనోహరి సిరీ-శివకామిని  శివానీ- వాణీ

1.ఏపూలమాలైన నే వేయలేదు
ఏ పూజసైతం నే చేయలేదు
స్తోత్రాల నైనా వల్లించలేదు
ఏ మొక్కులైనా చెల్లించలేదు
గుడిచేర్చినాను ముసలమ్మను
బడి చూపినాను పసి బాలకు

2.యజ్ఞాలు యాగాల ఊసైన లేదు
వేదాలు శాస్త్రా ధ్యాసైన లేదు
దానాలు ధర్మాల చేసింది లేదు
పుణ్యాలు పాపాల నెరిగింది లేదు
మా అమ్మ పాదాలు వదిలింది లేదు
మా నాన్న ఆజ్ఞల్ని  మీరింది లేదు