Sunday, November 22, 2020

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నా ఆత్మలింగేశ్వరా ఏమిటీ అంతర్మదన

శ్రీరామలింగేశ్వరా  ఎంతకూ ఆరని తపన

ఎన్నో ప్రసాదించినా ఎందుకీ అశాంతి

ఈ అంధకార బంధుర జీవనంలో నీవే విద్యుత్కాంతి

ఓం నమః శివాయ ఓం నమః శివాయ


1.ఐహికమౌ ఈప్సితాలు అంతెరుగని వాసనలు

భౌతికమౌ కామనలు భవ రోగ దుఃఖములు

 మాయాన్విత నీసృష్టి నిరంతరం బాహ్యదృష్టి

కురిపించు దయావృష్టి కలిగించగ పరితుష్టి

ఓం నమః శివాయ ఓం నమః శివాయ


2. ఒకవైపున గమ్యము వ్యతిరేక పయనము

జన్మ మోక్ష కారణం  జనన మరణ వ్యతికలనం

అంతర్ముఖుడ గావించు అద్వైతమునెరిగించు

నిత్యకైవల్యమౌ నీ పదమును అనుగ్రహించు

ఓం నమః శివాయ ఓం నమః శివాయ

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


జీవిస్తున్నా నేనో జీవచ్ఛవంలా

ఉండీ లేక బ్రతుకే నరకంలా

చినుకే రాలని బీడులా

చివురే వేయని మోడులా

నువు లేక నే ఎడారిలా గొంతే తడారిఇలా

పున్నమి జాబిలినే కోరే చకోరిలా


1.అనుభూతులె రాయని పుస్తకమై

నీమధురోహయె వీడని జ్ఞాపకమై

 నీతో గడిపిన సమయం వెన్నెల్లో గోదారియై

నీతో వేసిన అడుగులే పొగడపూల దారియై

కాలపు చదరంగంలో బలియైన తొలిబంటునై

అంతస్తుల వైకుంఠపాళిలో పామునోటి పావునై


2.గుడిమెట్లు నిన్నెపుడూ గుర్తేచేస్తుంటే

బడి గోడల రాతలూ చెరిగిపోకుంటే

ఎలామరచిపోగలను నీ పెదవంచు మధురిమను

ఎలా వదులుకోగలను నీ కౌగిటి ఘుమఘుమను

పదేపదే నినదిస్తుంటా నీ హృదయ నాదానిగా

మరోజన్మ ఎత్తైనా నిను చేసుకుంటా నాదానిగా

 

https://youtu.be/YZW7XCta0cE?si=bOs2_lHogol7ZXWw

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నేతిబీరకాయలో నేతిరీతి

నేటి రాజకీయాలలో  నీతి

పదవి ఒక్కటే ప్రాధాన్యం 

ప్రజాసేవ అన్నది శూన్యం

లాభసాటి వ్యాపారం  రాజకీయం

పార్టీ ఏదైనా అన్నిటికీ అధికారమే ధ్యేయం


1.నిన్నటి బూతుల పార్టీ నేడది అదర్శవంతము

ఈనాటి విలువల పార్టీ రేపటి డర్టీ పార్టీగ విధితము

మ్యాజిక్ ట్రిక్స్ ని మించినవే పాలిట్రిక్స్

గెలవగ మాయోపాయాలదే పొలిటికల్ గేమ్

లాభసాటి వ్యాపారం  రాజకీయం

పార్టీ ఏదైనా అన్నిటికీ అధికారమే ధ్యేయం


2.గుడ్డిలొ మెల్ల పార్టే ఎంపికలో అవకాశం

తక్కువ అవినీతి లీడర్ ఎన్నికే ఓటరు ప్రారబ్ధం

కులమతాల ప్రభావము కరెన్సీ ప్రలోభము

వాగ్దాన ప్రవాహము తాయిలాల పంపకము

లాభసాటి వ్యాపారం  రాజకీయం

పార్టీ ఏదైనా అన్నిటికీ అధికారమే ధ్యేయం

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కరువే కరువు మగజాతి సరసులకు

కనుచూపు సాగుతుంది కలికిపై కనిపించనంతమేరకు

మగ బలహీనత భలేతెలుసులే నారీమణులకు

విచ్చుకత్తులే వాడేరు రెచ్చగొట్టి చిచ్చుపెట్టేందుకు


1.అందాలకు కేంద్రకాలు ఎరిగేరు నెరజాణలు

మీటకుండ మ్రోగేటి సింగార రసవీణలు

నాభిచూపి నట్టేల్లో బ్రతుకునే ముంచేస్తారు

నడుము కదిపి రారాజులనే గులాంగిరీ చేయిస్తారు


2.చూపుతో చూపుకలిపి మత్తుమందు చల్లేస్తారు

వీపు సైతం చూపి మరీ కనికట్టు చేసేస్తారు

అధరవిన్యాసాలతో పూబాణాలే వేస్తారు

దరహాస చంద్రికలతో దాసులుగా మారుస్తారు

టెంకాయ కొడతాను వేంకటేశుడనీకు

ఏ వంక మావంక నీవింక రానీకు

వెంట్రుకల ముడుపునే ఇడుదునయ్యా స్వామి

ఇడుములను మానుండి కడతేర్చవయ్యా

ఏడుకొండలవాడ గోవిందా వడ్డికాసులవాడ గోవిందా

అపద మొక్కులవాడ గోవిందా ఆనందదాయకా గోవిందా


1.కాలినడకన కొండలేడూ ఎక్కి 

చక్కనీ నీ మోము దర్శింతుమయ్యా

ఆయురారోగ్య భోగభాగ్యాలనే

మాకొసగి మమ్మిపుడె కరుణించవయ్యా

ఏడుకొండలవాడ గోవిందా వడ్డికాసులవాడ గోవిందా

అపద మొక్కులవాడ గోవిందా ఆనందదాయకా గోవిందా


2.పాలకడలిలోన ఫణిరాజుపైన 

పడుకొని బడలికను బాసేటి స్వామి

అలసినాను నేను సంసార కడలీది

చేయూతనాకిచ్చి చేదుకోవయ్యా మమ్మాదుకోవయ్యా

ఏడుకొండలవాడ గోవిందా వడ్డికాసులవాడ గోవిందా

అపద౹మొక్కులవాడ గోవిందా ఆనందదాయకా గోవిందా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


సరసమంతా భావనలోనే

రసికతంతా కామనలోనే

అందమన్నది ఉత్ప్రేరకమే

పరువమన్నది ఒక కారకమే

తమకాల గమకాల్లో

అప్సరస అప్పలమ్మ ఒకరకమే


1.సౌందర్యపు కొలమానం చూసే నయనం

ఏది గొప్ప ఏది తక్కువ తూచలేదు తులనం

ఉపమానమెప్పుడు కాబోదు సరిసమానం

దైవదత్తమైన మేనే మనిషికి తగు బహుమానం


2.జగన్మోహినియన్నదే  కవుల కావ్యకల్పనయే

అతిలోకసుందరి యంటూ లేదనేది వాస్తవమే

మనవైన వీక్షణలన్నీ ఆపేక్షతా సాపేక్షాలే

మనసైన ఏ మగువైనా అందించు మోక్షాలే

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఒక గూగుల్ సెర్చ్డ్ పిక్కే కదా శుభోదయం

ఒక కాపీ పేస్ట్ లుక్కే కదా శుభోదయం

ఒక వాట్సప్  బ్రాడ్ కాస్ట్ పోస్టే కదా శుభోదయం

ఒక మెసెంజర్ లిస్ట్ సెండే కదా శుభోదయం

మనస్ఫూర్తిగా స్నేహస్ఫూర్తిగా పరామర్శయే శుభోదయం

ఉదయాన్నే సహృదయంతో పలకరింపే శుభోదయం


1.తడిగా మడిగా వడివడిగా అలవడునొక శుభోదయం

గొడవగొడవగా అలజడిరేపుతు ఆరంభం ఒక శుభోదయం

దీక్షా దక్షత లక్షణమై పరీక్షల సాధనలో ఒక శుభోదయం

నడినెత్తికి పొద్దెక్కినా మెలకువకై బద్దకించెడిదొక శుభోదయం

మనస్ఫూర్తిగా స్నేహస్ఫూర్తిగా పరామర్శయే శుభోదయం

ఉదయాన్నే సహృదయంతో పలకరింపే శుభోదయం


2.మొక్కుబడిగా చెప్పేనుడిగా నప్పేనా శుభోదయం

ఆశయాలను ఆకాంక్షలను వక్కాణిస్తే శుభోదయం

చేసిన తప్పులు చేయక మెదిలితె అదేకదా శుభోదయం

క్రమశిక్షణతో ఘనలక్ష్యముతో అడుగేస్తే అది శుభోదయం

మనస్ఫూర్తిగా స్నేహస్ఫూర్తిగా పరామర్శయే శుభోదయం

ఉదయాన్నే సహృదయంతో పలకరింపే శుభోదయం